వచ్చే ఖరీఫ్‌ నాటికి రుణమాఫీ... 

11 Apr, 2019 03:59 IST|Sakshi

సర్కార్‌ యోచన.. వ్యవసాయశాఖ కసరత్తు  

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఖరీఫ్‌ నాటికి పంటల రుణమాఫీ చేయాలని సర్కారు యోచిస్తోంది. ఈ మేరకు వ్యవసాయశాఖ కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల కోడ్‌ కొనసాగుతుండటం, ఆ తర్వాత మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నందున రుణమాఫీని ఖరీఫ్‌ ప్రారంభం నాటికి చేయాలని భావిస్తున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. రుణమాఫీ కోసం ఇటీవల ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్లో రూ. 6 వేల కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే సర్కారు పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత రుణమాఫీ ఉంటుందని ఓ ఉన్నతస్థాయి అధికారి తెలిపారు. రుణమాఫీకి ఎంతమంది అర్హులనే దానిపై ఇటీవలే రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందజేసింది.  

అసెంబ్లీ ఎన్నికల హామీగా..  
కేసీఆర్‌ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పంటల రుణమాఫీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ హామీని నిలబెట్టుకునేందుకు ఇప్పుడు ఏర్పాట్లు చేస్తుంది. అంటే రూ. లక్ష లోపు రుణాలున్న వారందరికీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో పంట రుణాలు మాఫీ కానున్నాయి. రుణాల మాఫీకి కటాఫ్‌ తేదీగా గతేడాది డిసెంబర్‌ 11ని ప్రకటించింది. ఆ తేదీని గడువుగా లెక్కించి అప్పటివరకు తీసుకున్న రుణాన్ని మాఫీ చేయనుంది. బ్యాంకర్ల వద్ద ఉన్న లెక్కల ప్రకారం చూస్తే దాదాపు 48 లక్షల మందికి రూ. 30 వేల కోట్లు మాఫీ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ. 6 వేల కోట్లు ఒక విడతగా కేటాయించిందంటే, మొత్తంగా ఐదు విడతల్లో బ్యాంకులకు చెల్లించే అవకాశముంది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లోనూ రుణమాఫీ అంశాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్గాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు