చురుగ్గా ‘థర్మల్’పైలాన్ నిర్మాణం

25 May, 2015 23:34 IST|Sakshi

వీర్లపాలెం (దామరచర్ల) :  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటులో భాగంగా మండల పరిధిలోని వీర్లపాలెం గ్రామ శివారులో జెన్‌కో సంస్థ  నిర్మిస్తున్న పైలాన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సుమారు కోటి రూపాయల అంచనా వ్యయంతో 5 ఎకరాల స్థలంలో  పైలాన్‌ను నిర్మిస్తున్నారు. పనులను ఖమ్మం కేవీ కన్‌స్ట్రక్షన్స్ సంస్థకు అప్పగించారు. పనుల పరిశీలనకు జెన్‌కో ఈఈ సత్యనారాయణను ప్రభుత్వం నియమించింది.
 
 ఆదిలో అడ్డంకులను అధిగమించి..
 ఆదిలో అడ్డంకులను అధిగమించి....థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం దామరచర్ల మండలంలోని అటవీభూములు 10,500 ఎకరాలు సర్వే చేయించి క్లియరెన్స్ కోసం కేంద్రానికి నివేదిక పంపింది. కాగా కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ నిర్మాణానికి 4676 ఎకరాలను కేటాయిస్తూ ఉత్తర్యులు జారీ చేసింది. దీంతో జెన్‌కో అధికారులు స్థానిక అధికారులకుగానీ, నాయకులకు గానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పైలాన్ నిర్మాణ పనులు ప్రారంభించారు. దీంతో ఇటీవల తాళ్లవీరప్పగూడెం, వీర్లపాలెం గ్రామస్తులు తమకు నష్టపరిహారం విషయంలో హామీ ఇవ్వకుండా పైలాన్ పనులు ఎలా చేపట్టారని కార్యాలయాన్ని ముట్టడించి ఫర్నిచర్‌ను తగులబెట్టిన విషయం విదితమే. అనంతరం రాష్ట్ర ప్రభుత్వంలో కదలికవచ్చి ఆర్టీఓ కిషన్‌రావు, డీఎస్పీ గోనె సందీప్‌ను గ్రామస్తులతో సమావేశపరిచి వారికి నచ్చజెప్పి ఆటంకాలను అధిగమించేలా చేశారు.
 
 రోజూ మూడు టీంలు
 దీంతో నాలుగు రోజులుగా పనులు వేగవంతం చేశారు. నిర్మాణానికి రోజూ మూడు టీంల తాపీ మేస్త్రీలు, కూలీలను ఏర్పాటు చేసి నిర్మాణ పనులు చకచకా కొనసాగిస్తున్నారు. రోజుకు సుమారు 18 గంటలు, సుమారు వంద మంది కూలీలతో  పైలాన్ పనులను నిర్వహిస్తున్నారు. పరిశీలనకు జెన్‌కో ఈఈతో పాటు ఖమ్మం జిల్లా పాల్వంచ నుంచి జెన్‌కో డీఈ దాస్, ఏఈ నాగరాజును డిప్టేషన్‌పై ఇక్కడ నియమించారు. ఈ నెల చివరిలోగా నిర్మాణం పూర్తిచేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని, అన్ని అనుకూలిస్తే అనుకున్న సమయంలో పూర్తిచేస్తామని ఈఈ సత్యనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు