అవి ఫౌంటేన్లు కావు.. బోర్లు

21 May, 2016 05:31 IST|Sakshi
అవి ఫౌంటేన్లు కావు.. బోర్లు

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: కరువుతో రాష్ట్రం విలవిలలాడుతుండగా.. ఆ గ్రామంలో జల కళ ఉట్టి పడుతోంది. రాష్ట్రంలోని ఏ గ్రామం లో చూసినా భూగర్భజలాలు పాతాళానికి చేరాయి. కానీ, ఈ ఊరిలోని బోర్లు ఫౌంటేన్ల ను తలపిస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 40కి పైగా బోర్లలో నీళ్లు ఫౌం టేన్‌లా విరజిమ్ముతున్నాయి. ఎలాంటి మోటార్లుగానీ, పంపుసెట్లు కానీ అమర్చకుం డానే నీళ్లు ఎగజిమ్ముతున్నాయి. మండు వేసవిలో కూడా ఈ గ్రామంలో ఏడాది పొడవునా ఇలాగే బోర్ల నుంచి నీళ్లు పైపైకి వస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామ పంచాయతీ పరిధిలోని మామడ గ్రామంలో ఈ అద్భుత దృశ్యం దర్శ నమిస్తోంది.

గ్రామంలో సుమారు 50 కుటుం బాలున్నాయి. గ్రామ సమీపంలోనే నీల్వాయి వాగుపై ప్రాజెక్టు ఉంది. ప్రాజెక్టులో నిండా నీరుండటంతో ఆ ప్రాంతంలో భూగర్భ జలా లు బాగా పైకి పెరిగాయి. భూగర్భ జలాలు పుష్కలంగా ఉండటం ఒక రకంగా ఈ గ్రామస్తులకు  కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. అతిగా నీళ్లు పైకి రావడంతో గ్రామంలో నివసించడం, భూములను సాగు చేసుకోవడం కష్టమ వుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లు కుంగిపోయి, గోడలు బీటలు వారుతున్నాయి. పలు ఇళ్ల గోడలు కూలిపోయాయి. తమ ఇళ్లు కూలిపోవడంతో గ్రామానికి దూరంగా గుడిసె వేసుకున్నామని మం చినీళ్ల నాగరాజు ‘సాక్షి’ ప్రతినిధితో పేర్కొ న్నారు. ఇక వర్షాకాలంలో పంట పొలాలను సాగు చేయలేని పరిస్థితి. ట్రాక్టర్లు బురదలో కూరుకుపోతున్నాయి. ఏటా వర్షాకాలంలో నాలుగైదు పశువులు ఈ బురదల్లో కూరుకుపోయి చనిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. మరుగుదొడ్డి కోసం 2, 3మీటర్ల లోతు తవ్వితే నీళ్లు వస్తుండటంతో గుంతలు తీసి వదిలివేశామని గ్రామస్తులు చెబుతున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా