అవి టీఆర్‌ఎస్‌ గ్రామ కమిటీలు

14 Nov, 2017 02:20 IST|Sakshi

రైతు సమన్వయ సమితులపై అసెంబ్లీలో విపక్షాల ధ్వజం

రైతులను ఓటర్లుగా చూస్తున్నారు: చిన్నారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతు సమన్వయ సమితుల ఏర్పాటుపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. అవి రైతు సమన్వయ సమితులు కావని, టీఆర్‌ఎస్‌ పార్టీ గ్రామ కమిటీలని ఎద్దేవా చేశాయి. ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెట్టి టీఆర్‌ఎస్‌ పోలింగ్‌ బూత్‌ కమిటీలను వేసుకుంటున్నారని ఆరోపించాయి. సోమవారం శాసనసభలో రైతు సమన్వయ సమితులపై జరిగిన లఘుచర్చలో జి. చిన్నారెడ్డి (కాంగ్రెస్‌), కౌసర్‌ మొయినుద్దీన్‌ (ఎంఐఎం), ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ (బీజేపీ), సండ్ర వెంకటవీరయ్య (టీడీపీ), సున్నం రాజయ్య (సీపీఎం) పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పలు విమర్శలు చేశారు.

ఎమ్మెల్యే హోదాలో వెళ్తే గెంటేశారు?: జి.చిన్నారెడ్డి
‘రైతు సమన్వయ సమితులను ఎమ్మెల్యేల ద్వారా వేస్తామన్నారు. పేర్లు ఇవ్వాలా అని అడిగితే కలెక్టర్లు ఇవ్వమన్నారు. మా జాబితాలు పంపించాం. కమిటీలు పూర్తయిన తర్వాత అవగాహన సదస్సులకు వెళ్తే మేం ఇచ్చిన పేర్ల వాళ్లు ఎవరూ అక్కడ లేరు. ఎమ్మెల్యే హోదాలో వెళ్లిన మమ్మల్ని అక్కడి నుంచి పోలీసులతో గెంటి వేయించారు. ఇదేనా తెలంగాణ ప్రజాస్వామ్యం? సమితులపై కలెక్టర్లను అడిగితే జాబితాలను జిల్లా మంత్రులకు పంపించామని చెప్పారు.

జిల్లా వ్యవసాయధికారులు, కలెక్టర్లు సంతకాలు పెట్టలేదు. కొన్ని చోట్ల కలెక్టర్లు సంతకాలు పెట్టేందుకు నిరాకరిస్తే నేరుగా ముఖ్య కార్యదర్శి చేత ప్రొసీడింగ్స్‌ ఇప్పించుకున్నారు. పోస్టల్‌ శాఖలో పనిచేస్తున్నవారు, గజం భూమి లేని వారు, హైదరాబాద్‌లో స్థిరపడ్డవాళ్లు, పందులు కాసే వాళ్లను ఆ సమితుల్లో వేశారు. వీళ్లా రైతులకు మార్గదర్శనం చేసేది. ఇవి రైతు సమన్వయ సమితులు కావు. టీఆర్‌ఎస్‌ గ్రామకమిటీలు. ప్రభుత్వ సొమ్ముతో పార్టీ కమిటీలు వేసుకునే రీతిలో ప్రభుత్వం బరితెగించి వ్యవహరిస్తోంది.

అయినా నాలుగేండ్లు నిద్రపోయి ఇప్పుడు ఎకరానికి రూ.8 వేలు ఇస్తరా? ఇది రైతులను ఓటర్లుగా చూడడం కాదా? అయినా మీరు ఇచ్చిన రుణమాఫీని చూసిన రైతులు ఇప్పుడు పెట్టుబడి సాయం ఇస్తారంటే నమ్మడం లేదు.’

కౌలుదారులకు ఇస్తారా
‘ప్రభుత్వం ఎకరానికి రూ.8 వేల పెట్టుబడి సాయం ఇవ్వడం మంచిదే. అయితే, ఆ పైసలు పట్టాదారులకిస్తారా? కౌలు చేసుకున్న వారికి కూడా ఇస్తారా? ప్రభుత్వ భూముల్లో చాలా ఏళ్లుగా సాగు చేసుకుంటున్న ఆదివాసీ రైతులకు కూడా ఆ సాయం ఇస్తారో లేదో ప్రభుత్వం చెప్పాలి.’ – కౌసర్‌ మొయినుద్దీన్‌

అనేక తప్పిదాలు జరిగాయి
‘రైతు సమన్వయ సమితుల ఏర్పాటులో అనేక తప్పిదాలు జరి గాయి. వీరి ద్వారానే మొత్తం జరుగుతుందని అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. వీళ్లు రైతుల పాస్‌పుస్తకాలు, టైటిల్‌డీడ్ల విష యంలో కూడా వేలు పెడుతున్నారు. అసలు వీరి అధి కారాలేంటి? అవి రైతు సమన్వయ సమితులా? టీఆర్‌ఎస్‌ పోలింగ్‌ బూత్‌ కమి టీలా? రాజకీయం చేస్తే రైతాంగం క్షమించదు. రైతు రుణమాఫీ కింద వడ్డీని కూడా కడతామన్నారు. ఒక్కరికయినా కట్టారా?’    – ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌

గ్రామాల్లో ఇబ్బందులు వస్తున్నాయి
‘రైతుల కోసం గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అనేక ప్రభుత్వ సంస్థలున్నాయి. అధికార యంత్రాంగం ఉంది. స్థానిక సంస్థలున్నా యి. ఇవన్నీ ఉండగా మళ్లీ ఈ సమితులు ఎందుకు? రాజకీయంగా వీటి వల్ల గ్రామాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతు న్నాయి. ముందు కల్తీ విత్తనాలు, పురుగు మందుల నియంత్రణకు చర్యలు తీసుకోండి. ఖమ్మం జిల్లాలో 1/70 చట్టం అమల్లో ఉన్న ప్రాంతాల్లో 20,848 మంది రైతులకు రూ.101 కోట్ల రుణమాఫీ చేయండి.’     – సండ్ర వెంకటవీరయ్య

45 శాతం కౌలుదారులే
‘రాష్ట్రంలో 1.13 కోట్ల ఎకరాల్లో వ్యవసాయం జరుగుతుంటే అందులో 45 శాతం కౌలుదారులే. కౌలుదారు చట్టాన్ని అమలు చేసి వారికి అన్ని హక్కులు కల్పించాలి. రైతు సమన్వయ సమితుల్లో రైతులనే పెట్టాలి తప్ప రాజకీయ నిరుద్యోగులను కాదు. అవి రాజ్యాంగేతర శక్తులుగా మారకూడదు.’ – సున్నం రాజయ్య

>
మరిన్ని వార్తలు