ఆభరణాలు కనిపిస్తే అంతే!

11 Oct, 2019 04:25 IST|Sakshi
ఇర్ఫాన్‌

ఎమ్మెల్యే కాలనీ దొంగతనాలతోనూ అతడికి లింకు

లోతుగా విచారిస్తున్న బెంగళూరు పోలీసులు

హైదరాబాద్‌కు తేనున్న పోలీసులు

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని సంపన్నుల నివాసాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే వజ్రాభరణాలు దొంగతనం చేసి పరారైన ఘరానా దొంగ ఇర్ఫాన్‌ (35) ఎట్టకేలకు బెంగళూరు పోలీసులకు చిక్కాడు. ఈ మోస్ట్‌ వాంటెడ్‌ దొంగను విచారిస్తున్న కొద్దీ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో చేసిన దొంగతనాల చిట్టా బయటికొస్తున్నది. తాజాగా ఇర్ఫాన్‌ను విచారించిన అక్కడి పోలీసులకు ఏడాది క్రితం ఎమ్మెల్యే కాలనీలో చేసిన దొంగతనాలతో కూడా ఇర్ఫాన్‌కు సంబంధాలు ఉన్నట్లు తెలిసింది.మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి సోదరుడి కొడుకు తిక్కవరపు ఉత్తమ్‌రెడ్డి నివాసంలో ఆగస్టు 28వ తేదీన రూ.2 కోట్ల విలువ చేసే ఆభరణాలు దొంగిలించి పరారైన ఘటనలో, ఒక వైపు పోలీసులు గాలింపు చేస్తున్న క్రమంలోనే నిందితుడు బెంగళూరు పోలీసులకు ఈ నెల 1న ముంబైలో పట్టుబడ్డాడు. విచారించగా ఉత్తమ్‌రెడ్డి నివాసంతో పాటు గత జూలై 22వ తేదీన జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.

28లో నివసించే విల్లామేరీ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఫిలోమినా ఇంట్లో దొంగతనం చేసి రూ.30 లక్షల విలువ చేసే ఆభరణాలు తస్కరించింది కూడా ఇర్ఫాన్‌గా గుర్తించారు. అలాగే గత ఆగస్టు 24వ తేదీన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఆదిత్య ఎన్‌క్లేవ్‌లో నివసించే జగదీశ్‌ ఇంట్లో రూ.25 లక్షల విలువ చేసే ఆభరణాలు తస్కరించింది కూడా అతడే అని విచారణలో తేలింది. నెల రోజుల వ్యవధిలోనే ఈ మూడు దొంగతనాలు చేసి పరారైన ఇర్ఫాన్‌ ఇక్కడి పోలీసులకు సవాల్‌గా మారాడు. 2018 ఆగస్టు 9వ తేదీన బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లోని ఎమ్మెల్యే కాలనీలో నివసించే శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సోదరుడు వెంకట్‌రెడ్డి ఇంట్లో రూ.10 లక్షల విలువ చేసే ఆభరణాలు తస్కరించి ఒక రోజు గడవకముందే, 2018 ఆగస్టు 10వ తేదీన ఎమ్మెల్యే కాలనీలో నివసించే డాక్టర్‌ రామారావు ఇంట్లో రూ.50 లక్షల విలువ చేసే ఆభరణాలు తస్కరించి పరారైనట్లు విచారణలో తేలింది. 

పీటీ వారెంట్‌తో రప్పించేలా..
హైదరాబాద్‌కు వచ్చినప్పుడు తలాబ్‌ కట్టలో నివసించే స్నేహితులు సాజిద్, ముజఫర్‌ల వద్ద ఆశ్రయం పొందేవాడని తేలడంతో ఆ ఇద్దరినీ సీసీఎస్‌ పోలీసులు వారం క్రితం అరెస్ట్‌ చేశారు. మరింత లోతుగా ఇర్ఫాన్‌ను విచారించగా ఢిల్లీ, గుర్గావ్, ముంబై, బెంగళూరుతో పాటు హైదరాబాద్‌లో మొత్తం 12 దొంగతనాలు చేసినట్లుగా తేలింది. హైదరాబాద్‌లో చేసిన దొంగతనాల్లో సీసీ కెమెరాల్లో ముఖం కనిపించకుండా ఇర్ఫాన్‌ జాగ్రత్తలు తీసుకున్నాడు. బెంగళూరులో పట్టుబడ్డ ఓ దొంగద్వారా అక్కడి పోలీసులు ముంబైలో తలదాచుకున్న ఇర్ఫాన్‌ను చాకచక్యంగా పట్టుకోవడంతో నేరాల చిట్టా బయటపడింది. ప్రస్తుతం ఇర్ఫాన్‌ను బెంగళూరు పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.

హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే కాలనీలో రెండు చోట్ల దొంగతనం చేసిన విషయాన్ని రెండు రోజుల క్రితమే ఇర్ఫాన్‌ వెల్లడించగా, నగరంలో ఇంకా ఎక్కడెక్కడ భారీ దొంగతనాలు జరిగాయన్నదానిపై పోలీసులు ఆరా తీస్తూనే ఆ వివరాలను బెంగళూరు పోలీసులకు అందిస్తున్నారు. బెంగళూరు పోలీసులు ఇర్ఫాన్‌ను రిమాండ్‌కు తరలించగానే, హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు పీటీ వారెంట్‌ జారీ చేసి నిందితుడిని హైదరాబాద్‌కు తీసుకొచ్చి ఇక్కడి దొంగతనాలపై విచారణ ప్రారంభించనున్నారు. మొత్తానికి ఈ గజదొంగ పోలీసులకు చిక్కడంతో నగర పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా