దేవుళ్లకే శఠగోపం!

6 Mar, 2019 12:01 IST|Sakshi
సేకరిస్తున్న క్లూస్‌టీం సభ్యులు

హుండీలను దొంగిలించి పొలాల్లో పడేసిన దుండగులు

మూడు ఆలయాల్లో నగదు, వెంకటగిరిలో శఠగోపం చోరీ

సాక్షి, కొత్తకోట రూరల్‌: జల్సాలకు ఆలవాటు పడిన కొందరు ఆలయాలను కూడా వదలడం లేదు. ఇటీవల కురుమూర్తిస్వామి ఆలయంలో చోరీకి పాల్పడిన ఘటన మరవకముందే కొత్తకోటలోని మూడు ఆలయాల్లో దొంగలు హుండీలను పగులగొట్టి నగదు ఎత్తుకెళ్లారు. సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు పట్టణ శివారులోని వెంకటగిరి, పట్టణంలోని సాయిబాబ, కోట్ల ఆంజనేయస్వామి ఆలయాల్లో హుండీలను ఎత్తుకెళ్లి గ్రామ శివారులోని పొలాల్లో పడేశారు. ఈ క్రమంలో కోట్ల ఆంజనేయస్వామి ఆలయంలో రూ.3 వేల నగదు, సాయిబాబ ఆలయంలో రూ.500, వెంకటగిరి ఆలయంలో అరకిలో వెండి (శఠగోపం)తోపాటు తీర్థం పోసే పాత్ర ఎత్తుకెళ్లారని ఎస్‌ఐ తెలిపారు.

ఉదయమే ఆయా ఆలయాల్లో తాళాలు పగులగొట్టి ఉండగా వెంటనే ఆలయ కమిటీ సభ్యులకు సమాచారం అందిం చారు. విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాకేంద్రాలను నుంచి క్లూస్‌ టీంలు వచ్చి పొలాల్లో పడేసిన హుండీలను పరిశీలించారు. దొంగతనానికి గురైన హుండీలపై ఉన్న వేలిముద్రలను క్లూస్‌టీం సభ్యులు సేకరించారు. మూడు ఆలయాలను వనపర్తి డీఎస్పీ సృజన, సీఐ వెంకటేశ్వర్‌రావు పరిశీలించి ఎస్‌ఐతో వివరాలు తెలుసుకున్నారు.  

మరిన్ని వార్తలు