సీతారాముడిని వదిలేసి.. లక్ష్మణుడిని మాత్రం..

16 Oct, 2019 11:42 IST|Sakshi
చోరీకి గురైన విగ్రహం (వృత్తంలో)

తుంగతుర్తి సీతారాముడి ఆలయంలో భారీ చోరీ

పంచలోహ విగ్రహంతో పాటు వెండి, బంగారు ఆభరణాల అపహరణ

మొత్తం సొత్తు విలువ రూ.15లక్షల పైమాటే..

సాక్షి, తుంగతుర్తి : పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే తెగబడి భారీ చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి ఆలయంలోకి ప్రవేశించి సీతారామంద్రుల విగ్రహాలను వదిలేసి.. లక్ష్మణుడి పంచలోహ విగ్రహంతో పాటు ఇతరత్ర ఆభరణాలను అపహరించుకుపోయారు. ఈ ఘటన తుంగతుర్తిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి దేవాలయం పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోనే ఉంటుంది.

దుండగులు అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడి  దేవాలయ ప్రధాన ద్వారం, గర్భగుడి తలుపులు పగులగొట్టి పురాతన కాలం నాటి 25 కేజీల బరువుగల లక్ష్మణస్వామి పంచలోహ విగ్రహం, మూడు వెండి కిరీటాలు, రెండు వెండి ధనుర్బానాలు, రెండు వెండి హస్తాలు, వెండిపళ్లెం, సీతా దేవి మెడలోని 2.5గ్రాముల బంగారపు పుస్తె అపహరించుకెళ్లారు. ఈ ఆభరణాల విలువ సుమారు రూ.15లక్షలకు పైగానే ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. 

వెలుగులోకి ఇలా..
మంగళవారం ఉదయం పూజారి కాటూరి రామాచార్యులు రోజువారీ కార్యక్రమంలో భా గంగా దేవాలయంలోకి దూప, దీప, నైవేద్యానికి వచ్చాడు. అప్పటికే ఆలయ తలుపులు పగలగొట్టి ఉండటంతో పోలీసులకు, సర్పంచ్‌కు సమాచారం ఇవ్వడంతో చోరీ విషయం వెలుగులోకి వచ్చింది.  

ఆనవాళ్లు సేకరించిన క్లూస్‌టీం...
ఆలయ పూజారి సమాచారం మేరకు ఎస్‌ఐ శ్రీకాంత్‌గౌడ్‌ సిబ్బందితో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం అధికారులను రప్పించి ఆధారాలు సేకరించారు. స్థానిక పోలీ సులు మెయిన్‌రోడ్డుపై ఉన్న సీసీ కెమెరాల పుటేజ్‌లను పరిశీలించి ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి ఆలయ గోడదూకి లోనికి వెళ్లినట్లు గుర్తించారు.

అర్ధరాత్రి చికటీ సమయం కావడంతో సీసీ కెమెరా పుటేజీల్లో నిందితుల ముఖాలు స్పష్టంగా  గుర్తించలేకపోయారు. దేవాదాయశాఖ అధికా రుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

విగ్రహాలను ఎందుకు వదిలేసినట్టు..?
పంచలోహ విగ్రహాలకు అంతర్జాతీయ మార్కె ట్‌ మంచి డిమాండ్‌ ఉంది. మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి దేవాలయంలోని 25కేజీల బరువు కలిగిన కాకతీయుల కాలం నాటి మూడు విగ్రహాలకు భారీ మొత్తంలోనే ధర పలుకుతుందని, దుండగులు ఒక్క విగ్రహాన్నే ఎందుకు ఎత్తుకెళ్లినట్టని స్థానికంగా చర్చ జరుగుతోంది. అయితే వచ్చిం ది ఇద్దరు దుండగులేనని, ఓ విగ్రహంతో పాటు మొసుకెళ్లకలిగే ఇతరత్ర ఆభరణాలనే తీసుకుని వెళ్లారనే చర్చ కూడా లేకపోలేదు.  

మరిన్ని వార్తలు