కెనరా బ్యాంక్‌లో చోరీకి విఫలయత్నం

23 Jan, 2019 14:59 IST|Sakshi
దుండగులు చోరీకి యత్నించిన కెనరా బ్యాంక్‌ కిటికీగ్రిల్స్‌ తొలగించిన దృశ్యం 

గ్రిల్స్‌ తొలగించి ప్రవేశించేందుకు ప్రయత్నం

సెక్యూరిటీ అప్రమత్తతతో పరారైన దుండగులు

సాక్షి, వెల్దుర్తి(తూప్రాన్‌): మాసాయిపేట కెనరాబ్యాంక్‌లో చోరీకి విఫలయత్నం జరిగింది. వెల్దుర్తి సెంట్రల్‌బ్యాంక్‌లో చోరీకి ప్రయత్నించిన ఘటన మరువకముందే మళ్లీ దుండగులు మరో బ్యాంకులో చోరీకియత్నించారు. గ్యాస్‌కట్టర్‌ సహాయంతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ అప్రమత్తతతో దుండగులు పరారయ్యారు. బ్యాంక్‌లో ఎలాంటి చోరీ జరగకపోవడంతో బ్యాంక్‌ సిబ్బంది, ఖాతాదారులు ఊపిరి పీల్చుకున్నారు. గతంలోనూ కెనరాబ్యాంక్‌లో దుండగులు చొరబడి బంగారు నగలతో పాటు లాకర్‌లలోని నగదు ఎత్తుకెళ్లండంతో, చోరీ ప్రయత్నం ఘటన తెలుసుకున్న ఖాతాదారులు పెద్దఎత్తున తరలివచ్చారు. చివరికి లోనికి ప్రవేశించకుండానే దుండగులు పరారయ్యారని తెలుసుకుని ఇళ్లల్లోకి వెళ్లిపోయారు.

సంఘటనకు సంబంధించిన వివరాలను చేగుంట ఎస్సై సత్యనారాయణ, బ్యాంక్‌ మేనేజర్‌ వినితాకృష్ణ వెల్లడించారు. సోమవారం అర్ధరాత్రి దాటాక సుమారు 2గంటల 30నిమిషాల సమయంలో బ్యాంక్‌లో అలారం మోగింది. దీంతో అక్కడే కాపలా ఉన్న సెక్యూరిటీ గార్డు గణేష్‌ అప్రమత్తమై బ్యాంకు చుట్టూ కలియతిరిగాడు. ఈ క్రమంలో బ్యాంక్‌ వెనుక భాగంలో ఇద్దరు దుండగులు కిటికీ గ్రిల్స్‌ గ్యాస్‌కట్టర్‌తో తొలగించి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. సెక్యూరిటీ గట్టిగా అరుపులు చేస్తూ పట్టుకునేందుకు ప్రయత్నించడంతో దుండగులు గ్యాస్‌ సిలిండర్‌లను అక్కడే వదిలి పరారయ్యారు. సెక్యూరిటీ గార్డు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, బ్యాంక్‌మేనేజర్‌ బ్యాంక్‌లో పరిశీలించి ఎలాంటి అపహరణ జరగలేదన్నారు. బ్యాంక్‌ వద్ద ప్రత్యేక సెక్యూరిటీ గార్డును ఉంచడంతో పాటు బ్యాంకులో రక్షణ చర్యలు తీసుకున్నట్లు బ్యాంక్‌ మేనేజర్‌ వినితాకృష్ణ తెలిపారు. ఖాతాదారులు ఆందోళన చెందవద్దన్నారు. 

మరిన్ని వార్తలు