పండుటాకులకు...ఏదీ భరోసా?

21 Feb, 2019 09:38 IST|Sakshi
వివరాలు తెలుసుకుంటున్న డీసీపీ రమేష్‌రెడ్డి

తరచు నేరాల బారినపడుతున్న వృద్ధులు

ఢిల్లీలో విజయవంతంగా సీనియర్‌ సిటిజన్స్‌ సెల్‌ నిర్వహణ

పలువురి రిజిస్ట్రేషన్, గుర్తింపుకార్డులు

నగరంలో ఏళ్లుగా ప్రతిపాదనల స్థాయిలోనే...

యాప్‌ అందుబాటులోకి తెస్తున్నాం: పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో: సైదాబాద్‌ ఠాణా పరిధిలో బుధవారం వృద్ధ దంపతులపై జరిగిన దాడి నగరంలో తీవ్ర కలకలం సృష్టించింది. రాజధానిలో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధుల భద్రత, వారి యోగక్షేమాలను కనుక్కునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు లేకపోవడమే ఇందుకు కారణం. అయితే దేశరాజధాని ఢిల్లీ పోలీసులు మాత్రం కొన్నేళ్ల క్రితమే వృద్ధులకు భరోసా కల్పించేందుకు ప్రత్యేకంగా ‘సీనియర్‌ సిటిజన్స్‌ సెల్‌’ ఏర్పాటు చేశారు. ఇలాంటి సెల్‌ను నగరంలోనూ ఏర్పాటు చేయాలని గతంలోనే భావించినా ఇప్పటికీ ఈ ప్రతిపాదనలు అమలులోకి రాలేదు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన సీనియర్‌ సిటిజన్స్‌ సెల్‌ మంచి ఫలితాలు సాధిస్తోంది. తమ బిడ్డలు ఇతర ప్రాంతాలు, విదేశాల్లో నివసిస్తున్న వృద్ధులు తమ వివరాలు, చిరునామాలను ఈ సెల్‌లో నమోదు చేసుకుంటున్నారు. వారితో పాటు కుటుంసభ్యులు ఉద్యోగాలకు వెళ్తుండటంతో పగటిపూట ఒంటరిగా నివసిస్తున్న వారి వివరాలనూ రిజిస్టర్‌ చేశారు. రెండేళ్లల్లో 19,716 మంది వృద్ధుల వివరాలు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు వారిలో 12,812 మందికి ప్రత్యేక గుర్తింపుకార్డులూ జారీ చేశారు. ఈ కార్డుల్లో వారి చిరునామాతో పాటు రక్తగ్రూపు, వారి అనారోగ్య సమస్యలు, డాక్టర్‌ పేరు, సంప్రదించే నంబరు, అత్యవసర సమయాల్లో ఎవరికి సమాచారం ఇవ్వాలనే వివరాలనూ నమోదు చేశారు. అంతేగాక ఆడిట్‌ పేరుతో నిత్యం వారి ఇళ్లకు వెళుతూ యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. ఫలితంగా వృద్ధులకు భరోసా లభించడంతో పాటు వారిపై జరిగే నేరాల సంఖ్య గణనీయంగా తగ్గించేందుకు కృషి చేస్తున్నారు.  

నగరంలో నాన్చుడే...
నగరంలోనూ ఒంటరిగా ఉంటున్న వృద్ధుల సంఖ్య ఎక్కువగానే ఉంది. దీనిని ఆసరాగా తీసుకున్న నేరగాళ్లు  పంజా విసురుతున్నారు. 2010లో పళ్లం రాజు పెద్దమ్మపై దాడి ఘటనతో అప్రమత్తమైన పోలీసులు వీటికి పరిష్కారం వెతికే దిశలో కీలక నిర్ణయం తీసుకున్నామన్నారు. ఒంటరి వృద్ధులు నగర వ్యాప్తంగా ఉన్నప్పటికీ, ఆర్థికంగా స్థిరపడిన వారిలో ఎక్కువ మంది వెస్ట్‌జోన్‌ పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటున్నారు. వీరిలో ఎక్కువ మంది ఒంటరితనంతో బాధపడుతూ, తమ భావాలను పంచుకోవాలని ఆశిస్తూనే అభద్రతా భావంలో కొట్టుమిట్టాడుతుంటారు. వీరికి ఆసరాగా ఉండటమే కాకుండా భరోసాను ఇచ్చేందుకు సీనియర్‌ సిటిజన్స్‌ సెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వీరి బాధ్యతలు ఏరియాల వారీగా కానిస్టేబుళ్లకు అప్పగిస్తామని, దీని వల్ల మరుగున పడిపోయిన బీటు కానిస్టేబుల్‌ వ్యవస్థకూ ప్రాణం పోసినట్లువుతుందని పేర్కొన్నారు. అయితే ఈ ప్రతిపాదన ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఇటీవల దీనిపై దృష్టి పెట్టిన నగర పోలీసులు ప్రత్యేక యాప్‌ అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది అధికారిక యాప్‌ ‘హాక్‌ ఐ’కు అనుబంధంగా పని చేయనుంది.  

 వృద్ధ దంపతులపై దాడి
మలక్‌పేట: పట్టపగలు ఓ ఇంట్లోకి చొరబడిన ఇద్దరు అగంతకులు వృద్ధ దంపతులపై దాడి చేసి, చోరీకి యత్నించిన సంఘటన బుధవారం సైదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ నర్సింహారావు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. విద్యుత్‌ శాఖ మాజీ ఉద్యోగి శారపు వామనమూర్తి(75) అతని భార్య అనురాధా(68)తో కలిసి సైదాబాద్, ఫర్హా కాలనీలో ఉంటున్నారు. ఉద్యోగరీత్యా అతని కుమారుడు అమీర్‌పేట్‌లో, కుమార్తె బెంగుళూర్‌లో ఉంటున్నారు. ఇంటి పక్క పోర్షన్, పైపోర్షన్‌ అద్దెకు ఇచ్చారు. బుధవారం కిరాయి వాళ్లు ఇంట్లో లేని సమయంలో ఇంటి వెనుక నుంచి వంటగదిలోకి చొరబడిన ఇద్దరు అగంతకులు ‘డబ్బులు ఎక్కడ పెట్టారు’ అంటూ హిందీలో అడుగుతూనే వంటగదిలో ఉన్న రోకలి బండతో వామనమూర్తి తలపై మోదారు. అనంతరం కత్తితో అతడిని పొడిచేందుకు ప్రయత్నించగా అనురాధా చెయ్యి అడ్డం పెట్టడంతో గాయాలయ్యాయి. వామనమూర్తి తలకు బలమైన గాయం కావడంతో సృహ కోల్పోయాడు. అగంతకులు అనురాధాను కత్తితో బెదిరిస్తూ డబ్బులు ఎక్కడ పెట్టావ్‌ చూపించు అంటూ భయపెట్టారు. ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కునేందుకు ప్రయత్నించగా ఆమె గట్టి కేకలు వేయడంతో  అప్రమత్తమైన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. దీనిని గుర్తించిన స్థానికులు బాధితులను మలక్‌పేట యశోద ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఈస్ట్‌జోన్‌ డీసీపీ రమేష్‌రెడ్డి, అడిషనల్‌ డీసీపీ గోవింద్‌రెడ్డి, టాస్క్‌ఫోర్స్‌ అడిషనల్‌ డీసీపీ చైతన్య, మలక్‌పేట ఏసీపీ సుదర్శన్, ఇన్‌స్పెక్టర్‌ నర్సింహ్మారావు సంఘటన స్థలాన్ని సందర్శించారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్‌ టీమ్, డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. కాలనీలోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. 

బాధితులకు ఎమ్మెల్యే బలాల పరామర్శ
వృద్ధ దంపతులపై దాడి విషయం తెలియడంతో స్థానిక ఎమ్మెల్యే అహ్మద్‌ బలాల మలక్‌పేట యశోద ఆసుపత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు. ఫర్హా కాలనీలోని వారి ఇంటిని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.

తెలిసిన వారి పనేనా..
ఇంట్లో ఎవరూ లేని సమయంలో దాడి పాల్పడటం, మంగళవారం అనురాధ ఏటీఎంలో రూ.40 వేలు డ్రా చేసింది. ఆ డబ్బులు ఎక్కడ పెట్టావ్‌ అని ఆడగటం పట్ల స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డబ్బుల విషయం తెలిసిన వ్యక్తులే చోరీకి యత్నించి ఉంటారని కాలనీవాసులు భావిస్తున్నారు. అదే కోణంలో పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు