రైళ్లలో పెరగనున్న థర్డ్‌ ఏసీ బోగీలు

13 Apr, 2017 03:45 IST|Sakshi
రైళ్లలో పెరగనున్న థర్డ్‌ ఏసీ బోగీలు

‘స్లీపర్‌’ సంఖ్య తగ్గించి వాటిని పెంచే యోచన
మూడో తరగతి ఏసీకి డిమాండ్‌ పెరగడమే కారణం
సొంత సర్వేతో ‘రైల్వే’ నిర్ణయం
తొలుత తొమ్మిది ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో పెంచే అవకాశం


సాక్షి, హైదరాబాద్‌: రైళ్లలో మూడో తరగతి ఏసీ బోగీల సంఖ్య పెరగబోతోంది. ప్రస్తుతం ముఖ్యమైన రైళ్లు మినహా మిగతావాటిల్లో మూడో తరగతి ఏసీ బోగీల సంఖ్య ఒకటి.. రెండుకు మించడం లేదు. కానీ కొంతకాలంగా ఏసీ మూడో తరగతి ప్రయాణికుల సంఖ్య పోటెత్తుతుండటంతో వాటి సంఖ్యను పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మేరకు త్వరలో ప్రధాన రైళ్లలో వాటి    సంఖ్యను పెంచబోతున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలుత తొమ్మిది ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో వీటి సంఖ్యను పెంచే అవకాశం ఉంది. డిమాండ్‌ ఆధారంగా ఇటీవలే దక్షిణ మధ్య రైల్వే అధికారులు రైల్వే బోర్డుకు ఈ తొమ్మిది రైళ్ల పేర్లను పంపించారు.

ఆదాయం పెరగటంతో ....
గతంలో ఏసీ క్లాస్‌ ప్రయాణం అంటే కేవలం డబ్బున్నవారికి సంబంధించిందనే అభిప్రాయం ఉండేది. కానీ ప్రస్తుతం ప్రజల్లో మార్పు వచ్చింది. చాలామంది మూడో తరగతి ఏసీ బోగీల్లో ప్రయాణానికి ఆసక్తి చూపుతున్నారు. వారి ఆదాయాల్లో పెరుగుదలే దీనికి కారణమని ఇటీవల రైల్వే శాఖ నిర్వహించిన సర్వేలో స్పష్టమైంది. దీంతో గతంలో ఎన్నడూ లేనట్టుగా థర్డ్‌ ఏసీ బోగీల్లో వెయిటింగ్‌ లిస్టు బాగా పెరిగిపోయింది. వాటి సంఖ్యను రెట్టింపు చేసినా సరిపోయే సంఖ్యలో టికెట్ల కొనుగోలు ఉంటోందని రైల్వే గుర్తించింది. 2016 ఏప్రిల్‌ నుంచి 2017 మార్చి మధ్య కాలంలో చోటుచేసుకున్న మార్పులను రైల్వే శాఖ విశ్లేషించింది. ఏడాది క్రితం మొత్తం ప్రయాణికుల్లో స్లీపర్‌ తరగతి ప్రయాణికుల వాటా 61 శాతంగా ఉండగా అది ఈ సంవత్సరం మార్చిలో 59 శాతానికి పడిపోయిందని, ఆ శ్రేణిలో టికెట్‌ ఆదాయం 46 శాతం నుంచి 44 శాతానికి పడిపోయిందని గుర్తించింది.

అదే మూడో తరగతి ఏసీ ప్రయాణికుల వాటా 32 శాతం నుంచి 34 శాతానికి, టికెట్‌ ఆదాయం 16 శాతం నుంచి 17 శాతానికి పెరిగినట్టు గుర్తించింది. దీంతో మూడో తరగతి ఏసీ బోగీలపై ఒత్తిడి పెరుగుతున్నందున వాటి సంఖ్య పెంచాలని నిర్ణయించింది. అదనంగా బోగీల సంఖ్య పెంచటానికి అవకాశం లేనందున స్లీపర్‌ బోగీల సంఖ్యను తగ్గించి వాటి స్థానంలో మూడో తరగతి ఏసీ బోగీల సంఖ్యను పెంచాలని భావిస్తోంది. ఈ సంఖ్య ఆయా రైళ్ల డిమాండ్‌ ఆధారంగా 4 నుంచి 6 వరకు ఉంటుందని సమాచారం. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఏపీ, తెలంగాణ, దక్షిణ్, గోదావరి, గౌతమి, చెన్నై, ఢిల్లీ ఏపీ సంపర్క్‌క్రాంతి, నారాయణాద్రి, వెంకటాద్రి రైళ్లలో తొలుత వీటి సంఖ్య పెంచుతారని సమాచారం. ఆ తర్వాత మిగతావాటికి విస్తరిస్తారు.

సౌకర్యంగా ఉండడంతో పెరిగిన ఆసక్తి
ఏసీలో ప్రయాణం హాయిగా ఉండటంతోపాటు, బయటి శబ్దాలు లేకుండా రాత్రి వేళ నిద్రకు ఇబ్బంది ఉండకపోవటంతో ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఫస్ట్, సెకండ్‌ క్లాస్‌తో పోలిస్తే థర్డ్‌ ఏసీ టికెట్‌ ధర బాగా తక్కువగా ఉండటంతో దాన్ని భరించే వారి సంఖ్య కూడా బాగా పెరిగింది. మరోవైపు ఈ నిర్ణయం వల్ల రైల్వే ఆదాయం కూడా పెరుగుతుందని అంటున్నారు.. త్వరలోనే ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని రైల్వే భావిస్తోంది.

మరిన్ని వార్తలు