ఫెడరల్‌ ఫ్రంట్‌ ఓ డ్రామా

27 Mar, 2018 08:08 IST|Sakshi
మాట్లాడుతున్న గుజ్జుల రామకృష్ణారెడ్డి

సొమ్ము కేంద్రానిది.. సోకు రాష్ట్రానిదా?

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి

సుల్తానాబాద్‌(పెద్దపల్లి) : సీఎం కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటూ డ్రామా చేస్తున్నారని అందులో పస లేదని బీజేపీ రాష్ట్ర ఉపాద్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి విమర్శించారు. సుల్తానాబాద్‌ పద్మనాయక కల్యాణ మండపంలో జరిగిన బూత్‌ కమిటీల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కేంద్రం రాష్ట్రానికి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తుంటే, కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజలను ప్రక్క దారి పట్టిస్తూ బీజేపీని బద్నాం చేస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వం కృషి వికాస్‌ యోజన పథకం ద్వారా జిల్లాకు 52 సబ్సిడీ ట్రాక్టర్లు, ప్రధానమంత్రి కృషి శిక్షణ యోజన ద్వారా 400 విద్యుత్‌ మోటార్లు సబ్సిడీపై రాగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకే ఇవ్వడంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు. 2019లో కేంద్రంలో నరేంద్రమో«డి ప్రభుత్వం రాష్ట్రంలో బీజేపీ భాగస్వామ్య పక్షాలతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు.

మంత్రి హరీష్‌ రావు అసెంబ్లీలో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నుంచి 37లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్తున్నారని, అది ఎలా సాధ్యమో వివరించాలన్నారు. కేంద్రం 13వ, 14వ ఆర్థిక సంఘం ద్వారా గ్రామాలకు నేరుగా నిధులు అందిస్తోందన్నారు. గ్రామ పంచాయతి యాత్ర ఈ నెల 29న కాల్వ శ్రీరాంపూర్‌ నుంచి ప్రారంభించేందుకు రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ హాజరు కానున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మీస అర్జున్‌ రావు, జిల్లా కార్యదర్శి సంజీవ రెడ్డి, అశోక్‌ రావు, కన్నం అంజయ్య, బీజెవైఎం జిల్లా అధ్యక్షుడు కోట రాంరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మహేందర్‌ యాదవ్, మండలాధ్యక్షుడు తిరుపతి యాదవ్, లింగారెడ్డి, ఎల్లయ్య, రాజేంద్రప్రసాద్, సదయ్య, నాగేశ్వర్, మహిపాల్‌రెడ్డి, తదితరులు ఉన్నారు. 

మరిన్ని వార్తలు