సమరోత్సాహం!

13 May, 2018 08:29 IST|Sakshi
బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు మహేశ్వర్‌రెడ్డి, అరవిందరెడ్డి తదితరులు

 తూర్పున నేటి నుంచి కాంగ్రెస్‌ ప్రజా చైతన్యయాత్ర

 మూడో దశ యాత్రలో మంచిర్యాల, ఆసిఫాబాద్‌

జిల్లాల్లో ఐదు రోజులు

 నిర్మల్‌లో ముగిసిన యాత్ర

 మంచిర్యాల సభ ద్వారా సత్తా చాటే ఎత్తుగడలో పీఎస్‌ఆర్‌

సభా ప్రాంగణాన్ని పరిశీలించిన కాంగ్రెస్‌ నేతలు

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల:  చాలాకాలంగా నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో సమరోత్సాహం పెల్లుబుకుతోంది. రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రజా చైతన్య యాత్ర పేరుతో ప్రారంభించిన బస్సు యాత్రకు స్పందన పెరుగుతుండడం నేతల్లో ఆనందానికి కారణమవుతోంది. ఇప్పటి వరకు రెండు దశల్లో 31 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర సాగించిన కాంగ్రెస్‌ అతిరథ మహారథులు ఆదివారం మంచిర్యాల పట్టణానికి రాబోతున్నారు. మూడో విడత బస్సుయాత్రను మంచిర్యాల నుంచి ప్రారంభించి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లోని ఐదు నియోజకవర్గాల్లో ఒక్కోరోజు సభ నిర్వహించనున్నారు. అధికార పార్టీ నేతల హడావుడి మధ్య కాంగ్రెస్‌ జెండాలు కూడా కనిపించకుండా పోతున్న పరిస్థితుల్లో బస్సు యాత్ర ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఊపిరిపోస్తోంది. ఈ నేపథ్యంలో నేతలంతా ఐక్యతారాగం పాడుతూ బస్సు యాత్రను విజయవంతం చేసేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు.

డీసీసీ అధ్యక్షుడుమహేశ్వర్‌రెడ్డి చొరవతో..
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి మూడో విడత బస్సు యాత్రను మంచిర్యాల నుంచి ప్రారంభించేందుకు తనవంతు కృషి చేశారు. గతంలో ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ బస్సు యాత్ర సాగుతుందని ప్రకటించినప్పటికీ, నిర్మల్‌తోనే ఆగిపోయింది. తాను ఇన్‌చార్జిగా ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మల్‌లో సభను మహేశ్వర్‌రెడ్డి విజయవంతం చేయించారు. అదే సమయంలో మిగతా నియోజకవర్గాల్లో కూడా ప్రజా చైతన్యయాత్రలు నిర్వహించేలా కాంగ్రెస్‌ నేతలను ఒప్పించారు. అందులో భాగంగానే మూడో విడతలో మంచిర్యాల,  బెల్లంపల్లి, చెన్నూరు, ఆసిఫాబాద్, సిర్పూరు నియోజకవర్గాల్లో ఐదు రోజులపాటు బస్సు యాత్ర సాగనుంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి, కాంగ్రెస్‌ నేతలు టి.జీవన్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, డి.కె.అరుణ, ఎ.రేవంత్‌రెడ్డి తదితరులు హాజరయ్యే ఈ యాత్ర, సభలను విజయవంతం చేయడం ద్వారా పార్టీకి తిరిగి ఊపిరి పోసినట్లవుతుందని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు.

నేతల ఐక్యతారాగం
మంచిర్యాలలో ఆదివారం సాయంత్రం జరిగే ఆత్మగౌరవ సభను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలంతా ఒక్కటయ్యారు. డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి ఏకతాటిపైకి రావడం విశేషం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల నుంచి పోటీ చేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్న ప్రేంసాగర్‌రావు సహజంగానే మాజీ ఎమ్మెల్యే ఎం.అరవింద్‌రెడ్డిని వ్యతిరేకించారు. ఒక సందర్భంలో అరవింద్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లోకి వెళతారనే ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పెద్దల జోక్యంతో వీరిద్దరు ఐక్యతారాగం పాడి కలిసి పనిచేయాలని నిర్ణయించుకోవడం కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఉత్సాహాన్నిచ్చింది.

సత్తా చాటే ఎత్తుగడలో ప్రేంసాగర్‌రావు
మంచిర్యాలలో ఆదివారం సాయంత్రం జరిగే కాంగ్రెస్‌ ప్రజా చైతన్య యాత్ర సభ ఏర్పాట్లన్నీ మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు ఆధ్వర్యంలోనే సాగుతున్నాయి. సభా నిర్వహణ ఖర్చు మొదలుకొని, వాహనాలు సమకూర్చడం, భోజనాల ఏర్పాటు, ఆయా మండలాల నాయకుల ఇతర ఖర్చులు అన్నీ ప్రేంసాగర్‌రావు నేతృత్వంలోనే సాగుతుందనేది బహిరంగ రహస్యం. గత రెండేళ్లుగా మంచిర్యాల నియోజకవర్గంలో పాగా వేసుకొని కూర్చున్న పీఎస్‌ఆర్‌ ఈ సభ ద్వారా నియోజకవర్గానికి అన్నీ తానే అని నిరూపించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇతర నియోజకవర్గాల్లో సైతం అదే ఊపు
కాంగ్రెస్‌ ప్రజా చైతన్యయాత్రను విజయవంతం చేయాలనే సంకల్పంతో మిగతా నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్‌ నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మంచిర్యాల స్థాయిలో కాకపోయినా.. సభలకు జనం సమీకరించడంలో అందివచ్చే అవకాశాలన్నింటినీ ఉపయోగించుకునే ఆలోచనతో ఉన్నారు. అధిష్టానం నుంచి ఆర్థికంగా సహాయ సహకారాలు రాకపోవడం మిగతా నాలుగు నియోజకవర్గాలకు ఇబ్బంది కరమైన అంశం. చెన్నూరులో మాజీ మంత్రి బోడ జనార్దన్, సిర్పూరులో రావి శ్రీనివాస్, గోసుల శ్రీనివాస్‌యాదవ్, సిడాం గణపతి సభలను విజయవంతం చేసేందుకు సమాయత్తం అవుతున్నారు.  ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కు గిరిజనులతో సభను విజయవంతం చేసే యోచనలో ఉన్నారు. బెల్లంపల్లిలో కాంగ్రెస్‌ ఇన్‌చార్జి, పీసీసీ సభ్యుడు చిలువల శంకర్‌ ఆధ్వర్యంలో 17న సభ జరుగనుంది.       

మరిన్ని వార్తలు