ఇదీ రీతి...ఇంకేం ఖ్యాతి?

5 Jul, 2014 04:14 IST|Sakshi
ఇదీ రీతి...ఇంకేం ఖ్యాతి?
  •       జీహెచ్‌ఎంసీలో భారీగా ఇంజినీర్ల బదిలీలు
  •      ఇప్పటికే సిబ్బంది కొరత
  •      కొత్తవారి ఊసే లేదు
  •      ఉన్న వారికే అదనపు బాధ్యతలు
  •      కమిషనర్ నచ్చజెప్పినా వినని సర్కార్
  • సర్కార్ ఒక్క కలం పోటుతో 24 మంది జీహెచ్‌ఎంసీ ఇంజనీర్లను బదిలీ చేసింది. రూ.400 కోట్లతో నగరంలో అభివృద్ధి పనులు చేపట్టాల్సిన తరుణంలో ఈ చర్య చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఇంజనీర్ల కొరత ఉన్న సమయంలో అదనంగా నియమించాల్సింది పోయి ఉన్న వారిని బదిలీ చేసింది. అదీగాక వారి స్థానంలో  కొత్త వారికి పోస్టింగ్‌లు ఇవ్వకుండా ఇతరులకు అదనపు బాధ్యతలు  అప్పగించడంపై కమిషనర్ సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వాదనను ఆలకించని సర్కార్ బదిలీలకే మొగ్గుచూపింది.
     
    సాక్షి, సిటీబ్యూరో: విశ్వ ఖ్యాతి గడించేలా హైదరాబాద్ మహా నగరాన్ని తీర్చిదిద్దుతామని ఓ వైపు సర్కార్ చెబుతున్నా.. చర్యలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. హైదరాబాద్ ‘బ్రాండ్ ఇమేజ్’ను సొంతం చేసుకోవాలంటే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అద్దాల్లాంటి రహదారులను నిర్మించాలి. మరోవైపు బోనాలు, రంజాన్ పండుగలు వైభవంగా జరుపుకొనేలా ఏర్పాట్లు చేయాలి. అదీగాక వర్షాకాలం కావడంతో రహదారులకు మరమ్మతులు, ఇతర పనులు చేపట్టాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తగిన సంఖ్యలో అధికారులను నియమించాల్సింది పోయి ఉన్న అధికారులను బదిలీ చేయడం అనుమానాలకు తావిస్తోంది. ఇంజినీర్ల బదిలీ వ్యవహారంపై కమిషనర్ సైతం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
     
    మహానగరంలో దాదాపు రూ.400 కోట్లతో పనులు చేపట్టాల్సి ఉంది. నిర్దేశించుకున్న లక్ష్యాలను పూర్తి చేసేందుకు ఇప్పటికే జీహెచ్‌ఎంసీలో తగిన సంఖ్యలో ఇంజినీర్లు లేరు. ఇంజినీర్ల పోస్టులు దాదాపు వంద వరకు భర్తీ కాకుండా ఉన్నాయి. చేయాల్సిన పనులెన్నో ఉన్నా తగినంతమంది ఇంజినీర్లు లేక ఎక్కడి పనులక్కడే మూలుగుతున్నాయి. ఈ దశలో జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్న 24 మంది ఇంజినీర్లను ప్రభుత్వం ఒక్క కలంపోటుతో బదిలీ చేసింది. వీరిలో ఆరుగురు సూపరింటెండింగ్ ఇంజినీర్లు, 18 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు ఉన్నారు.

    వీరి స్థానే ఇతర ప్రాంతాల వారిని ఇక్కడకు బదిలీ చేసిందా? అంటే అదీ లేదు. దీంతో ఉన్న కొద్దిమందిపైనే మరింత భారం పడనుంది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో డీఈఈలుగా ఉన్న వారికి ఈఈలుగా, ఈఈలుగా ఉన్నవారికి ఎస్‌ఈలుగా అదనపు బాధ్యతలు అప్పగించింది. అంటే.. బదిలీ అయిన 24 మంది ఇంజినీర్ల బాధ్యతల్ని జీహెచ్‌ఎంసీలోని వారే అదనపు భారాన్ని మోయాల్సిన పరిస్థితి. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించాల్సిన డీఈఈలు తగినంత మంది లేరు.

    ఇప్పుడు డీఈఈలకు ఈఈలుగా బాధ్యతలు అప్పగించడంతో వారు రెండు కేట గిరీలకు చెందిన పనులను ఏకకాలంలో చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈఈలు ఎస్‌ఈలుగా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించాల్సి ఉండటంతో వారిదీ అదే పరిస్థితి. ఇంజినీర్ ఇన్ చీఫ్‌కే చీఫ్ ఇంజినీర్ బాధ్యతల్ని సైతం అదనంగా అప్పగించారు. ఈ బదిలీల వల్ల అసలే అంతంతమాత్రంగా సాగుతోన్న ఇంజినీరింగ్ పనులు మరింత కుంటుపడనున్నాయి.
     
    అంతర్జాతీయ సదస్సు కోసం..
     
    మరోవైపు మెట్రోపొలిస్ సదస్సు కోసం వచ్చే విదేశీ ప్రతినిధులను ఆకట్టుకునేలా రహదారులను తీర్చిదిద్దడమేకాక, పర్యాటక ప్రదేశాలనూ సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులు భావించారు. అందులో భాగంగా పలు పనులు చేపట్టాల్సి ఉంది. ఇంజినీర్లందరినీ ఒకేసారి బదిలీ చేస్తే ఈ పనులకు ఆటంకం కలుగుతుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని తెలుస్తోంది.

    బదిలీ అయిన వారి స్థానంలో వేరేవారిని వెంటనే నియమించకపోతే నగరానికి తిప్పలు తప్పవనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. పలు పనులు సగంలో ఉండటాన్ని, కొన్ని పనులు అసలే ప్రారంభం కాకపోవడాన్ని వివరిస్తూ ఇంజినీర్ల బదిలీలను తాత్కాలికంగా నిలిపివేయాల్సిందిగా డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్ నేతృత్వంలో టీడీపీ పక్ష నాయకుడు శ్రీనివాసరెడ్డి, పలువురు కార్పొరేటర్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు విజ్ఞప్తి చేశారు.
     
    ఎక్కువ కష్టపడతాం.. పనులు పూర్తిచేస్తాం..
     
    ఇదిలావుంటే అదనపు బాధ్యతలతో పదోన్నతులు రావడంతో పలువురు ఇంజినీర్లలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఆంధ్రాప్రాంతానికి చెందిన ఇంజినీర్లు జీహెచ్‌ఎంసీలో తిష్టవేయడం వల్లే సుదీర్ఘకాలంగా తమకు పదోన్నతులు రాకుండా పోయాయని వారు చెబుతున్నారు. ప్రస్తుతం తమకు లభించిన అవకాశంతో మరింత కష్టపడి సత్తా చాటుతామని వారు పేర్కొంటున్నారు. తెలంగాణ ఇంజినీర్ల సంఘం నాయకులు మోహన్‌సింగ్, కె.కిషన్‌లు మాట్లాడుతూ, నయాపైసా, నిమిషం సమయం కూడా ఖర్చు కాకుండా జీహెచ్‌ఎంసీలో బదిలీలు.. పదోన్నతులు జరిగిన అపూర్వ సందర్భమిదని వారు వ్యాఖ్యానించడం గమనార్హం.
     

మరిన్ని వార్తలు