ఈ ఏడాది నష్టం 900 కోట్లు

3 Aug, 2016 03:26 IST|Sakshi
ఈ ఏడాది నష్టం 900 కోట్లు

సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.900 కోట్ల మేరకు నష్టాలు వచ్చే అవకాశముందని తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) అంచనా వేసింది. వేతన సవరణ, అలవెన్సులకు తోడు బకాయిల చెల్లింపు భారంగా మారిన నేపథ్యంలో ఈ స్థాయిలో నష్టాలు వచ్చే అవకాశముందని తేల్చింది. ఆర్థిక సంవత్సరంలో ఇంకా 8 నెలలు మిగిలి ఉండగానే.. ఆర్టీసీ ఈ లెక్కలు వేయడం గమనార్హం. ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్ర ఆర్టీసీ 2013-14 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.908 కోట్లు నష్టాలను నమోదు చేసింది.

అంటే ఉమ్మడి ఆర్టీసీ నష్టం రికార్డును తెలంగాణ ఆర్టీసీ ఒక్కటే దాటిపోనుండడం ఆందోళనకరంగా మారింది. మంగళవారం హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎండీ రమణారావు, ఈడీలు రవీందర్, పురుషోత్తమ్ నాయక్, నాగరాజు, వేణులతోపాటు ఇతర విభాగాధిపతులతో నిర్వహించిన సమీక్షలో ఈ వివరాలను పేర్కొనడం గమనార్హం.
 
కారణం వేతన సవరణే..!
గత ఆర్థిక సంవత్సరం ఆర్టీసీకి రూ.707 కోట్లు నష్టం వచ్చింది. అయినా కార్మికులు అడిగినదానికంటే ఎక్కువగా ప్రభుత్వం 44 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించడంతో.. ఆర్టీసీపై తీవ్ర భారం పడింది. ఆ సవరణను 2012 నుంచి అమలు చేయాల్సి రావటంతో దాదాపు రూ.1,200 కోట్ల వరకు బకాయిలు దానికి తోడయ్యాయి. పాత అప్పులు తీర్చకపోవడంతో బ్యాంకులు కొత్త అప్పులు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు.

దాంతో కార్మికుల పరపతి సహకార సంఘం పేరుతో అప్పు తెచ్చుకుని రోజులు నెట్టుకొస్తోంది. ఇక భారీగా బకాయిలు చెల్లించాల్సి ఉన్నందున ఈ ఆర్థిక సంవత్సరం భారీ నష్టాలు తప్పవని అధికారులు తేల్చేశారు. ఒకవేళ 10% మేర బస్సు చార్జీలు పెంచినా.. దాని వల్ల కేవలం రూ.250 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం లేకపోవడం, ప్రత్యామ్నాయ ఆదాయం కోసం పెద్దగా కసరత్తు లేకపోవడంతో నష్టాలు తగ్గే అవకాశం తక్కువని తేల్చారు.
 
ఆదాయం పెంచుకుంటాం: సోమారపు
ప్రస్తుతం రూ.4 వేల కోట్లుగా ఉన్న ఆర్టీసీ వార్షికాదాయాన్ని రూ.5 వేల కోట్లకు పెంచేందుకు కసరత్తు చేస్తున్నామని ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ ప్రకటించారు. ఆదాయాన్ని పెంచుకునేందుకు దోహదం చేసే అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని.. అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారని సమావేశం అనంతరం చెప్పారు. కొత్తగా 1,575 బస్సులను, 236 మినీ బస్సులను కొనుగోలు చేయనున్నట్టు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని బస్సుల షెడ్యూల్‌ను రూపొందించాలని అధికారులకు ఆదేశించారు.కృష్ణా పుష్కరాలకు 1,150 ప్రత్యేక బస్సులను తిప్పనున్నట్టు ఆర్టీసీ ఎండీ రమణారావు చెప్పారు. ఏసీ బస్సునూ తిప్పాలనుకున్నామన్నారు.

మరిన్ని వార్తలు