జహీరాబాద్ లో దొంగల వీరవిహారం

26 Mar, 2015 06:40 IST|Sakshi
జహీరాబాద్ లో దొంగల వీరవిహారం

జహీరాబాద్ :  మెదక్ జిల్లా జహీరాబాద్ పట్టణంలో మంగళవారం రాత్రి దొంగలు పెట్రేగి పోయారు. రెండు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. మరో మూడు ఇళ్లలో చోరీకి ప్రయత్నించారు. చెన్నారెడ్డి నగర్‌లోని ఓ ఇంట్లోని యజమానిపై దాడి చేసి బంగారంతో ఉడాయించారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని చెన్నారెడ్డి నగర్ కాలనీలో నివాసం ఉంటున్న న్యాల్‌కల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీహరి ఇంట్లోకి బుధవారం ఉదయం 3.50 గంటలకు ప్రవేశించారు. ఇంటి తలుపులను బలంగా తోసేయడంతో అవి తెరుచుకున్నాయి. అనంతరం ఇంటి యజమాని శ్రీహరి తలపై పారతో దాడిచేసి గాయపర్చారు.

ఆయన భార్య కవిత మెడలో ఉన్న ఐదు తులాలు, కుమార్తె హర్ష మెడలో ఉన్న మరో ఐదు తులాల బంగారం లాక్కున్నారు. అడ్డు వచ్చిన శ్రీహరి కుమారుడు అభినందన్‌ను స్వల్పంగా గాయపర్చారు. ఈ సమయంలోనే పోలీసుల సైరన్ మోగడంతో మూడు నిమిషాల్లోనే దొంగలు బంగారంతో ఉడాయించారు. ప్రమాదంలో గాయపడిన శ్రీహరికి స్థానిక ప్రభుత్వాస్పత్రిలో వైద్యం చేయించి హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. క్లూస్‌టీం ఆధారాలను సేకరించాయి. డాగ్ స్వాడ్‌ను రప్పించి దొంగల ఆచూకి తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దొంగలు ముందుగా దత్తగిరి కాలనీలో చోకికి పాల్పడ్డారు. మధుసూదన్‌కు చెందిన ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న రూ.10 వేల విలువ గల కెమెరా, వెండి పట్టగొలుసును దొంగలించారు. పక్కనే ఉన్న నవీన్‌కుమార్ ఇంటి తలుపులు బలంగా తోయడంతో తెరుచుకున్నాయి. ఇంట్లోని వ్యక్తులు అల్లరి చేయడంతో దొంగలు పారిపోయారు. అక్కడి నుంచి చెన్నారెడ్డినగర్ కాలనీలోకి ప్రవేశించినట్లు భావిస్తున్నారు. ముందుగా నసీర్ అనే వ్యక్తి ఇంట్లోకి దొంగలు ప్రవేశించారు. అదే సమయంలో మూత్రానికి లేచిన పొరుగింటి వారికి ఫోన్ చేయడంతో వారు అప్రమత్తమై అల్లరి చేయడంతో దొంగలు అక్కడి నుంచి కూడా పారిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అక్కడినుంచి పారిపోయిన దొంగలు కాలనీ చివరన ఉన్న శివకుమార్ ఇంటి తాళాలు పగులకొట్టారు. ఇల్లు ఖాళీగా ఉండడంతో పక్కనే కాలనీకి చివరనే ఉన్న ప్రిన్సిపాల్ శ్రీహరి ఇంట్లోకి ప్రవేశించి బంగారం దొంగిలించారు. అదే సమయంలో ఎస్‌ఐ 2 సుభాష్ కాలనీలోకి ప్రవేశించడంతొ దొంగలు పారిపోయారు. బుధవారం ఉదయం సంగారెడ్డి డీఎస్పీ తిరపతన్న, స్థానిక సీఐ, ఎస్‌ఐలు లక్ష్మీనారాయణ, శివలింగంలు సంఘటనా స్థలాలను సందర్శించారు. బాధితులను పరామర్శించారు. దొంగతనానికి పాల్పడింది పార్థి గ్యాంగ్‌గా భవిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు జహీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
ముసుగులు ధరించి వచ్చిన దొంగలు

మరిన్ని వార్తలు