ముసలోళ్లకు పెళ్లేంటన్నారు..

7 Mar, 2018 07:54 IST|Sakshi
ఇప్పటి దాకా ఎవరికి వారు.. ఇకపై ఒకరి ఒకరు.. వృద్ధులను కలుపుతున్న రాజేశ్వరి (ఫైల్‌)

అండగా నిలుస్తున్న ‘తోడు–నీడ’ సంస్థ  

అడ్డంకులను అధిగమించిన రాజేశ్వరి

ఒంటరి వయోధికులను ఒక్కటి చేస్తున్న వైనం

అదే ఐదారేళ్ల క్రితం అరవై ఏళ్ల వయసులో ఓ మహిళ పెళ్లి చేసుకుంటోంది లేదా మరో వ్యక్తితో కలిసి ఉంటోంది.. అనే విషయం తెలిస్తే నగరం కళ్లు ఆశ్చర్యంతో విచ్చుకునేవి. ‘ఈ వయసులో ఇదేం పని’.. అంటూ నలుగురి నోళ్లు తిట్టిపోసేవి. అయితే ఇప్పుడుపరిస్థితిలో మార్పు వచ్చింది. ఆశ్చర్యపోవడం తగ్గింది. ఎందుకంటే.. ప్రస్తుతం వృద్ధుల పెళ్లిళ్లు సిటీలో జరుగుతున్నాయి. దీనికి కారణం నిన్నటి దాకా ఒంటరిగా ఉన్న
‘రాజేశ్వరి’ కృషి. జీవితం మలిసంధ్యలో ఒంటిరి జీవితం ఎంత కష్టమో గుర్తెరిగిన ఆమె.. పెద్ద వయసు వారిని ఒక్కటి చేస్తున్నారు.

సాక్షి,సిటీబ్యూరో: ‘ప్రస్తుతం మనిషి సగటు జీవిత కాలం పెరిగింది. ఇప్పుడు 60 దాటినా ఆరోగ్యంగా జీవిస్తున్న వారు ఎందరో ఉన్నారు. అనుకోకుండా హఠాత్తుగా జీవిత భాగస్వామి దూరమైతే మిగిలిన జీవితం అంతా ఒంటరిగా గడపాల్సిందేనా? విడాకులు లేదా ఇంకేదైనా కారణంతో తోడు లేకుండా మిగిలిపోతున్న వారికి తోడు కల్పించడం కోసమే మా ‘తోడు– నీడ’ కృషి చేస్తోంది’ అని చెప్పారు రాజేశ్వరి. పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేసిన రాజేశ్వరి.. నగరంలో ఒంటరి వృద్ధులకు ‘తోడు’ వెతికిపెట్టే బాధ్యతలను కొన్నేళ్ల క్రితం స్వచ్ఛందంగా తలకెత్తుకున్నారు. అయితే తొలుత చాలా మంది ఆమెను వారించారు. ముసలోళ్లేమిటి? వారికి నువ్వు పెళ్లి చేయడం ఏమిటంటూ ఎగతాళి చేశారు. అయితే రాజేశ్వరి మాత్రం పట్టు వదల్లేదు. ‘వయసు మళ్లిన వారికే తోడు కావాలి. కాని దురదృష్టవశాత్తూ ఒంటరితనం ప్రాప్తించే అవకాశాలూ పెద్ద వయసులోనే ఎక్కువ’ అంటారామె.

వృద్ధుల కోసం పెళ్లి చూపులు, గెట్‌ టు గెదర్‌ వంటి ఈవెంట్లు, వారికి నాణ్యమైన జీవనాన్ని అందించే కమ్యూనిటీ సెంటర్లు, వృద్ధుల కోసం పిక్నిక్‌లు నిర్వహిస్తూ.. సిటీలోని సీనియర్‌ సిటిజన్స్‌కు పలు విధాలుగా ఆసరా అందిస్తున్నారు. ‘వృద్ధాశ్రమాలు శేష జీవితం గడిపేందుకు ఎంచుకుంటాం. మనకు నచ్చింది తినడానికో, నచ్చినట్టు ఉండడానికో అక్కడ వీలుండదు. కమ్యూనిటీ లివింగ్‌ ప్లేస్‌ల ద్వారా అలాంటి కొరత తీరుతుంద’ని చెప్పారు రాజేశ్వరి.

లివింగ్‌ టు గేదర్‌..
‘వృద్ధాప్యంలోనే ఒంటరి తనపు సమస్య ఎక్కువ. రెక్కలొచ్చాక పిల్లలు వెళ్లిపోయి, జీవిత భాగస్వామి సైతం దూరమైతే.. ఏకాకిగా రోజులు వెళ్లబెట్టడం కన్నా నరకం మరొకటి లేదు’ అంటారామె. పెళ్లి కావచ్చు లేదా సహజీవనం కావచ్చు.. ఇద్దరు వృద్ధులు ఇష్టపడి కలిసి జీవించాలి అనుకుంటే వారికి తోడు నీడ అండగా ఉంటుంది. వృద్ధుల ఒంటరి తనపు సమస్యను పరిష్కరించే క్రమంలో సంస్థ ప్రారంభించిన దగ్గర్నుంచి ఇప్పటిదాకా దాదాపు 50కి పైగా ఒంటరి జీవితాలను జంటగా మలచామంటూ ఆనందంగా చెబుతారామె. అయితే ఈ క్రమంలో రాజేశ్వరి ఎదుర్కున్న ఒడిదొడుకులు అన్నీ ఇన్నీ కావు. ‘పెద్దవాళ్లు పిల్లల పెళ్లిళ్లు తమ ఇష్ట్రపకారం జరగాలని ఆశిస్తారని, అలా జరగకపోతే వారిని అదుపు చేయాలని నానా విధాలుగా ప్రయత్నిస్తారని మనకు తెలుసు. కాని తమ ఒంటరి తల్లి/ లేదా తండ్రి మలి వయసులో ఓ తోడు కోసం ఆరాటపడడాన్ని జీర్ణించుకోలేని పిల్లల సంఖ్యాఎక్కువే. నిజానికి ప్రేమించుకున్న పిల్లల పెళ్లి్లకన్నా.. పెద్దల పెళ్లికే అడ్డంకులు ఎక్కువ’ అంటారామె.

పిల్లలు ఏదైనా హాలిడే ట్రిప్‌కు వెళుతుంటే తమను తీసుకువెళితే బాగుణ్నని వృద్ధులు అనుకుంటారు. ఈ పరిస్థితుల్లో తమంతట తామే సహ వయోజనులతో ట్రిప్స్‌కు ప్లాన్‌ చేసుకునేందుకు ఈ సంస్థ అండగా ఉంటోంది. ప్రతి మూడు నెలలకూ ఏదో ప్రాంతానికి టూర్స్‌ నిర్వహిస్తోంది. యువతకు మాత్రమే పరిమితం అని భావించే న్యూ ఇయర్‌ పార్టీల నుంచి వాలంటైన్స్‌డే వరకూ ఇందులో సభ్యులైన పెద్దలు సంబరంగా జరుపుకుంటున్నారు. ‘వృద్ధాప్యం అంటే కృష్ణా రామా అనుకుంటూ గడిపే దశ కాదు. దానికీ కలలూ కోరికలూ సరదాలూ అవసరమే. తమలాంటి పరిస్థితిలోనే ఉన్న మరికొందరితో కలిసి అవి నెరవేర్చుకునే చక్కటి వేదికే ఇది’ అంటున్న రాజేశ్వరి.. ఒంటరి వృద్ధులకు సంబంధించి ఆధునిక కాలంలోనూ పిల్లలు చాలా స్వార్ధంగా, సంకుచితంగా ఆలోచిస్తున్నారని, వారికి ఏ సరదా, ముచ్చటా అవసరం లేదని భావిస్తున్నారంటారు. వారి మలి జీవితం నిస్సారంగా గడచిపోయేందుకు తెలిసో తెలియకో దోహదం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తారు. వీలైనంత వరకూ ఈ పరిస్థితిని మార్చడమే తన లక్ష్యం అంటున్నారు. 

మరిన్ని వార్తలు