ఆ కాలేజ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌లకు అడ్డా..

24 Sep, 2019 09:17 IST|Sakshi

సాక్షి, తొగుట(దుబ్బాక): తొగుట ప్రభుత్వ కళాశాల విద్యార్థులు జాతీయ ఉపకార వేతనాలకు ఎంపికవుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా నేషనల్‌ మీన్స్‌ మెరిట్‌ స్కాలర్‌ షిప్‌ ఎంపికకు విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహిస్తోంది. మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు కళాశాల అధ్యాపకులు కృషి చేస్తున్నారు. చదువులతో పాటు క్రీడలు, పలు పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభతో విద్యార్థులు రాణిస్తున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన పోటీ పరీక్షల్లో విద్యార్థులు సత్తా చాటుతున్నారు.

కళాశాల నుంచి ఏటా ఎనిమిది మంది 
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉపకార వేతనాలకు ప్రతి ఏటా ఎనిమిది మంది చొప్పున విద్యార్థులు ఎంపికవుతున్నారు. ఎంపికైన విద్యార్థులకు డిగ్రీ, పీజీ చదివేందుకు ఐదు సంవత్సరాలకు సుమారు రూ.70 వేలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. కళాశాలలో యువ అధ్యాపక బృందం విద్యార్థులకు విద్యాబోదన అందిస్తున్నారు. పోటీ పరీక్షల్లో రాణించేందుకు మెలకువలు నేర్పిస్తున్నారు.

2009లో కళాశాల స్థాపన 
తొగుట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2009లో జూనియర్‌ కళాశాల ఏర్పాటైంది. గ్రీమీణ ప్రాంతాల పేద విద్యార్దులకు ఉన్నత విద్య అందుబాటులోకి తీసుకు రావాలన్న ఉద్దేశంతో దివంగత దుబ్బాక ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి కళాశాల ఏర్పాటుకు కృషిచేశారు. అప్పటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు కళాశాలను ప్రారంభించారు. కళాశాల ఏర్పాటైన రెండో సంవత్సరంలోనే 200 మంది విద్యార్థులు చేరారు. దీంతో విద్యార్థుల సంఖ్యకు కళాశాల సరిపోలేదు.

దీంతో ముత్యంరెడ్డి తన సొంత భవనాన్ని కళాశాలకు అందజేశారు. అందులో చాలా కాలం పాటు విద్య కొనసాగింది. తర్వాత ఆరంపురంలో కళాశాలకు సొంత భవనం నిర్మించి అందజేశారు. దీంతో కళాశాలకు విశాలమైన భవనం అందుబాటులోకి వచ్చింది. విద్యార్థులకు ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. ఇంటర్‌ ఫలితాల్లో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచారంటే విద్యా బోధన ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

విద్యార్థుల పట్టుదల, అధ్యాపకుల ప్రోత్సాహం
కళాశాలలో యువ అధ్యాపక బృందం విద్యాబోధనతో విద్యార్థులు పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభతో ఎంపికవుతున్నారు. ఇంటర్‌ ఫలితాల్లో జిల్లాకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంటర్‌ విద్యతో పాటు పోటీ పరీక్షల్లో రాణించేలా బోధిస్తున్నాం. ఇప్పటివరకు కళాశాల నుంచి సుమారు వంద మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న పరీక్షల్లో ఇక్కడి విద్యార్థులు ప్రతి ఏటా ఎంపికవుతున్నారు. బోధనలో అధ్యాపకుల కృషి అభినందనీయం. – పరమేశ్, ప్రిన్సిపాల్, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల రాంపురం  

ప్రత్యేక తరగతులు 
ఇంటర్‌ విద్యతో పాటు పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా అధ్యాపకకులు బోధిస్తున్నారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించి తర్ఫీదునిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఉపకార వేతనాలకు కళాశాల నుంచి ఎంపికవుతున్నారు. అధ్యాపకుల సూచనలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.  – చిప్ప నవీన, కళాశాల పూర్వ విద్యార్థిని 

మరిన్ని వార్తలు