ఆర్టీసీకి రూ.వెయ్యి కోట్లు

9 Mar, 2020 02:52 IST|Sakshi

అధికారులు అడిగింది రూ.3 వేల కోట్లు

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌ఆర్టీసీ చరిత్రలో అతిపెద్ద సమ్మె కాలాన్ని ఇటీవలే చవిచూసిన నేపథ్యంలో ప్రభుత్వం ఆర్టీసీ పరిరక్షణ , బలోపేతం కోసం భారీ కార్యాచరణ ప్రకటించటంతో బడ్జెట్‌ కేటాయింపులపై భారీ ఆశలే నెలకొన్నాయి. బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తానని సీఎం చెప్పడంతో ఈసారి భారీ నిధులే వస్తాయని అధికారులు అంచనా వేశారు. అన్నీ కలుపుకొని రూ.వెయ్యి కోట్లు మాత్రమే ప్రకటించడంతో మరో ఏడాది నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏటా ఇచ్చే బడ్జెట్‌ నిధులకు అదనంగా, సీఎం ప్రకటించిన రూ.వెయ్యి కోట్లు వస్తాయని అధికారులు అంచనా వేశారు.

తాజా బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు ప్రస్తావించడంతో, సీఎం చెప్పింది ఈ నిధులేనని సరిపుచ్చుకుంటున్నట్లు ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. టీఎస్‌ఆర్టీసీకి రుణాల పద్దు కింద రూ.400 కోట్లు, వివిధ కేటగి రీ వ్యక్తులకు కేటాయించిన బస్సు పాస్‌లకు సంబంధించిన రాయితీల మొత్తం తిరిగి చెల్లించేందుకు రూ.600 కోట్లు చూపారు. వెరసి రూ. వెయ్యి కోట్లు బడ్జెట్‌లో కేటా యించినట్లు అయింది. రూ.3 వేల కోట్లు ఇవ్వాలని అధికారులు కోరారు. సమ్మె కాలానికి సంబంధించి ఉద్యోగులకు జీతం ఇవ్వనున్నట్లు సీఎంకేసీఆర్‌ ప్రకటించగా.. తాజా బడ్జెట్‌లో ఆ ప్రస్తావన లేకపోవడంతో ఇప్పుడు ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. 

>
మరిన్ని వార్తలు