టామ్‌కామ్‌తో వెయ్యి మందికి ఉపాధి

24 Feb, 2016 02:57 IST|Sakshi
టామ్‌కామ్‌తో వెయ్యి మందికి ఉపాధి

దుబాయ్‌లో ముగిసిన ‘నాయిని’ పర్యటన
మూడు కంపెనీలతో ఒప్పందాలు

 
 రాయికల్: నకిలీ గల్ఫ్ ఏజెంట్ల వ్యవస్థను అరికట్టేందుకు...గల్ఫ్ దేశాల్లో తెలంగాణ యువత ఉపాధి కోసం తెలంగాణ మానవ వనరుల సంస్థ(టామ్‌కామ్) వేసిన తొలి అడుగు విజయవంతమైంది. అందులో భాగంగా   రాష్ట్ర కార్మిక హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డితో పాటు నిజామాబాద్ ఎంపీ  కవితలు 3రోజుల పాటు దుబాయ్‌లో పర్యటించారు. ఈ పర్యటన  సందర్భంగా వారు పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడంతో పాటు తెలంగాణ ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ కోసం తీసుకుంటున్న చర్యలు, విధివిధానాలపై రోడ్‌షో నిర్వహించారు. మంత్రి నాయిని ఈ నెల 19న దుబాయ్ వెళ్లారు.

అదే రోజు ఆయన సోలాపూర్ లేబర్ క్యాంపును సందర్శించారు. 20వ తేదీన దుబాయ్‌లో నిర్వహించిన స్కిల్ మేనేజ్‌మెంట్ రోడ్‌షోలో ఎంపీ కవితతో పాటు పాల్గొని.. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అవగాహన కల్పించారు. ఈనెల 21న జెజీరా ఎమిరేట్స్ పవర్ 250, మాడన్  ఎగ్జిక్యూటివ్ సిస్టం కన్‌స్ట్రక్షన్ కంపెనీ 500, క్యూబిజీ కంపెనీతో 300 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు నాయిని, ఆయా కంపెనీలో మేనేజింగ్ డెరైక్టర్లతో ఒప్పంద పత్రాలను చేసుకున్నారు. కాగా, మంత్రి... ఎంపీల వెంట దుబాయ్‌లో తెలంగాణ ప్రభుత్వ టామ్‌కామ్ ప్రతినిధి శ్రీనివాసశర్మ ఉన్నారు.  

 కార్మికుల సమస్యలపై సర్వే..
 మంత్రి నాయిని, ఎంపీ కవితలతో పాటు వెళ్లిన ఉన్నతాధికారుల బృందం ఆయా ప్రాంతాల్లోని తెలంగాణ కార్మికుల స్థితి గతులపై సర్వే చేపట్టారు. తెలంగాణ కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి హర్పిత్‌సింగ్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది, టామ్‌కామ్ డెరైక్టర్ భవానీరావులు 3 బృందాలుగా విడిపోయి మంగళవారం కార్మికులు ఉంటున్న క్యాంపులను సందర్శిస్తూ వివరాలు సేకరించి టామ్‌కామ్ ద్వారా తీసుకోవాల్సిన చర్యలపై సర్వే చేస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు