ముగిసిన చేప ప్రసాదం పంపిణీ

10 Jun, 2018 00:09 IST|Sakshi

80 వేల మందికి పైగా అందజేత

కిందటేడాది కంటే అధికం  

సాక్షి, హైదరాబాద్‌: ఏటా మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు అందజేసే చేప ప్రసాదానికి ఈ సారి అనూహ్యమైన స్పందన కనిపించింది. కిందటే డాది కంటే భారీ ఎత్తున జనం తరలి వచ్చారు. శుక్రవారం నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో ప్రారంభించిన చేపప్రసాదం పంపిణీ కార్యక్రమం శనివారంతో ముగిసింది. శనివారం ఉదయం 10 గంటల వరకు 75, 631 మందికి చేపప్రసాదం పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. మధ్యహ్నానికి ఈ సంఖ్య 80 వేలు దాటింది.

75 వేల మందికి పైగా చేప పిల్లల మందు పంపిణీ చేయగా, మరో 5 వేల మందికి బెల్లంలో కలిపి మందు ఇచ్చారు. చేప ప్రసాదం కోసం 1.32 లక్షల చేప పిల్లలను ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది. 34 కౌంటర్ల ద్వారా కూపన్లు అందజేశారు. అన్ని ప్రభుత్వ శాఖలు, అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేశారని, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పేర్కొన్నారు. చేప ప్రసాదం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి సేవలందించిన స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులను ఆయన అభినందించారు.

ఉత్తరాది నుంచి భారీగా జనం
చేప ప్రసాదంకోసం ఉత్తరాది రాష్ట్రాల నుంచి జనం భారీగా తరలి వచ్చారు. రాజస్తాన్, పంజాబ్, హరియాణా, జమ్మూ కశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఢిలీ తదితర రాష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలో వచ్చారు. చేప ప్రసాదంపై హిందీ దిన పత్రికలు, చానళ్లలో వెలువడిన ప్రకటనలతో జనంలో బాగా స్పందన కనిపించింది. ఈ రెండు రోజుల్లో చేప ప్రసాదం తీసుకోలేకపోయినవారు దూద్‌బౌలీలోని బత్తిన హరినాథ్‌ గౌడ్‌ నివాసంలో కూడా పొందవచ్చు.

మరిన్ని వార్తలు