లా‘సెట్‌’ కావడం లేదు

4 Sep, 2018 01:29 IST|Sakshi

     పరీక్ష జరిగి మూడు నెలలైనా ముందుకు సాగని ప్రవేశాలు

     కాలేజీలకు బార్‌ కౌన్సిల్‌ ఆమోదం లభించక ఆగిపోయిన అడ్మిషన్లు

     అనుమతుల్లో ఏటా ఆలస్యమే.. ఆందోళనలో వేల మంది విద్యార్థులు  

సాక్షి, హైదరాబాద్‌: న్యాయ విద్యలో ప్రవేశాలు ఏటా ఆలస్యం అవుతూనే ఉన్నాయి. న్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశాలకోసం బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) కాలేజీలకు అనుమతులు ఇవ్వడంలో జాప్యం చేస్తుండటంతో అర్హులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొనడంతో వేల మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో మూడేళ్లు, ఐదేళ్ల న్యాయవిద్య కోర్సుల్లో, ఎల్‌ఎల్‌ఎంలో ప్రవేశాలకు ఈ ఏడాది మే 25న లాసెట్‌ నిర్వహించగా, జూన్‌ 15న ఉస్మానియా విశ్వవిద్యాలయం ఫలితాలను ప్రకటించింది. ఇక బీసీఐ నుంచి అనుమతులు రాగానే కాలేజీల్లో ప్రవేశాలను చేపట్టేందుకు అధికారులు సిద్ధం అయ్యారు. కానీ ఇప్పటివరకు ప్రవేశాలకు అనుమతులు రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. 

మరో కోర్సులో చేరలేని పరిస్థితి.. 
రాష్ట్రంలోని 21 న్యాయవిద్యా కాలేజీల్లో 4,712 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే లాసెట్‌లో మాత్రం 15,793 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వారిలో ఎవరికి సీటు వస్తుందో, ఎవరికి రాదో తెలియని పరిస్థితి నెలకొంది. సకాలంలో ప్రవేశాలను నిర్వహిస్తే తాము మరొక కోర్సులోనైనా చేరే వీలుండేదని, ఇపుడు లాసెట్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌కోసం ఎదురుచూస్తూ ఎక్కడా చేరలేని పరిస్థితి నెలకొందని విద్యార్థులు వాపోతున్నారు. పైగా సీటు రాకపోతే విద్యా సంవత్సరం నష్టపోవాల్సి వస్తుందంటున్నారు.  

23,109 మంది దరఖాస్తు చేసుకుంటే.. 
రాష్ట్రంలోని లా కాలేజీల్లో ప్రవేశాలకోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 23,109 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో మే 25న నిర్వహించిన రాత పరీక్షకు 18,547 మంది హాజరయ్యారు. అందులో మూడేళ్ల లా కోర్సులో చేరేందుకు 16,332 మంది దరఖాస్తు చేసుకోగా 12,960 హాజరయ్యారు. వారిలో 11,563 మంది అర్హత సాధించారు. ఐదేళ్ల లా కోర్సుకు 4,580 మంది దరఖాస్తు చేసుకుంటే, 3,727 మంది రాత పరీక్షకు హాజరయ్యారు. 2,401 మంది అర్హత సాధించారు. ఇక పీజీ లాకోర్సు కోసం లాసెట్‌ రాసేందుకు 2,197 మంది దరఖాస్తు చేసుకోగా, 1,860 మంది హాజరయ్యారు. 1,829 మంది అర్హత సాధించారు. ఇలా మొత్తంగా లాసెట్‌లో అర్హత సాధించిన 15,793 మంది విద్యార్థులకు ప్రవేశాల కౌన్సెలింగ్‌కోసం నెలల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. 

మరిన్ని వార్తలు