ఆగిన ‘అక్షయపాత్ర’

24 Jul, 2015 23:53 IST|Sakshi
ఆగిన ‘అక్షయపాత్ర’

♦ ఆకలికి అలమటించిన వేలాది మంది విద్యార్థులు
♦ అక్షయపాత్ర సిబ్బంది సమ్మే కారణం
♦ నేటి నుంచి యథావిధిగా భోజనం : డిప్యూటీ ఈఓ పోమ్యానాయక్
 
 జోగిపేట : అక్షయపాత్ర సిబ్బంది సమ్మె విద్యార్థుల కడుపు కాలేలా చేసింది. జిల్లాలోని 11 మండలాల్లో ప్రభుత్వ పాఠశాలలకు అక్షయపాత్ర వారు భోజనం సరఫరా చేస్తోంది. శుక్రవారం అక్షయపాత్ర సిబ్బంది సమ్మె చేయడంతో పాఠశాలలకు భోజనం సరఫరా కాలేదు. దీంతో విద్యార్థులు ఆకలితో అలమటించారు. జోగిపేట డివిజన్ పరిధిలోని 88 పాఠశాలలకు అక్షయ పాత్ర వారు భోజనం సరఫరా చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 460 పాఠశాలల్లో భోజనం సరఫరా చేయాలి. ప్రతి రోజూ ఉదయం 11 గంటల్లోపు పాఠశాలలకు భోజనం చేరాలి. అయితే శుక్రవారం ఒంటి గంట అయినా భోజనం రాలేదు. దీంతో ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు అక్షయపాత్ర నిర్వాహకులకు ఫోన్లు చేశారు.

సిబ్బంది సమ్మెలో ఉన్నందున భోజనం సరఫరా చేయలేమని నిర్వాహకులు చేతులెత్తేశారు. దీంతో ఏం చేయాలో ప్రధానోపాధ్యాయులకు పాలుపోలేదు. ఇక చేసేది లేక మధ్యాహ్నం నుంచి విద్యార్థులను ఇళ్లకు పంపారు. వసతి గృహాలకు ఫోన్ చేసి విద్యార్థులకు భోజనం చేయాలని ఆదేశించి పిల్లలను హాస్టళ్లకు పంపారు. జోగిపేట డివిజన్‌లోని అందోల్, రేగోడ్, రాయికోడ్ పాఠశాలల విద్యార్థులు సుమారు 15 వేల మంది అక్షయపాత్ర సిబ్బంది సమ్మె కారణంగా ఇబ్బంది పడ్డారు.

ఈ విషయం గురించి డిప్యూటీ ఈఓ పోమ్యా నాయక్‌ను వివరణ కోరగా అక్షయపాత్ర సిబ్బంది సమ్మె కారణంగా డివిజన్ పరిధిలోని 88 పాఠశాలలకు భోజనం అందలేదన్నారు. సమ్మె చేస్తున్నట్లు సమాచారం ఇచ్చి ఉంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే వాళ్లమని తెలిపారు. హాస్టల్ విద్యార్థులకు భోజనం ఇబ్బంది లేకుండా చూశామన్నారు. మిగిలిన విద్యార్థులు ఇళ్లకు పంపామని వివరించారు. శనివారం నుంచి యథావిధిగా భోజనం సరఫరా అవుతుందని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు