ప్రసాదం కోసం జన ప్రవాహం

9 Jun, 2018 00:37 IST|Sakshi

చేపప్రసాదం కోసం భారీగా తరలివచ్చిన ఉత్తరాది జనం

మొదటిరోజు 75 వేలమంది ఆస్తమా బాధితులు  

సాక్షి, హైదరాబాద్‌: చేప ప్రసాదం కోసం ఆస్తమా బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బత్తిన కుటుంబసభ్యులు, బత్తిన హరినాథ్‌గౌడ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీ చేశారు. ఉదయం 8.50 గంటలకు శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌కు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ చేప ప్రసాదం అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత నిర్వాహకులు 34 కౌంటర్ల ద్వారా కూపన్ల పంపిణీ చేపట్టారు. డిమాండ్‌కు తగినట్లుగా లక్షకుపైగా చేపపిల్లలను అందుబాటులో ఉంచారు.

చేప ప్రసాదం కోసం వచ్చిన ఆస్తమా బాధితుల సంఖ్య 75 వేలు దాటిపోయింది. శనివారం మధ్యాహ్నం వరకు ఈ సంఖ్య లక్ష దాటే అవకాశమున్నట్లు నిర్వాహకులు అంచనా వేశారు. జనవిజ్ఞాన వేదిక, హేతువాదులు, వైద్యనిపుణులు కొంతకాలంగా చేపట్టిన ప్రచారం వల్ల మందు కోసం వచ్చే బాధితుల సంఖ్య గత రెండు మూడేళ్లుగా 50 వేల నుంచి లక్ష లోపే ఉన్నట్లు అంచనా. కానీ, ఈసారి అనూహ్యం గా ఆదరణ పెరిగింది. ఈ సారి తెలుగు రాష్ట్రాల కంటే ఉత్తరాది రాష్ట్రాల నుంచే జనం భారీఎత్తున తరలివచ్చారు.

శుక్రవారం రాత్రి వరకు ప్రసాదం తీసుకున్న 75 వేల మందిలో కనీసం 45 వేల మంది ఉత్తరాది వారేనని అధికారుల అంచనా. గతేడాది వయోధికులు, మహిళలు ఎక్కువ సంఖ్యలో కనిపించగా, ఈసారి పిల్లల సంఖ్య ఎక్కువగా కనిపించింది. రాజస్తాన్‌కు చెందిన అస్తమా బాధితులు ఎక్కువ సంఖ్యలో కనిపించారు. దివ్యాంగులకు, వృద్ధులకు అదనపు కౌంటర్లు లేకపోవడంతోఇబ్బందులకు గురయ్యారు. బాధితులకు జీహెచ్‌ఎంసీ ఐదు రూపాయల భోజన కౌంటర్లను ఏర్పాటు చేసింది. స్వచ్ఛంద సంçస్థలు భోజనాన్ని అందజేశాయి. జలమండలి సుమారు 3 లక్షల నీటి ప్యాకెట్‌లను అందజేశారు.  

భారీగా స్తంభించిన ట్రాఫిక్‌....
చేపమందు కోసం జనం పెద్ద ఎత్తున తరలి రావడంతో వాహనాలు గంటల తరబడి ట్రాఫిక్‌లో స్తంభించాయి. మొజంజాహీ మార్కెట్‌ నుంచి    గాం«ధీభవన్‌ వరకు వాహనాల రాకపోకలకు తీవ్ర అసౌకర్యం కలిగింది, సరైన పార్కింగ్‌ సదుపాయం   కల్పించకపోవడం వల్ల ఎగ్జిబిషన్‌గ్రౌండ్స్‌కు వచ్చిన వాహనాలన్నీ రోడ్లపైనే నిలిచిపోయాయి.

మరిన్ని వార్తలు