మనోళ్లకు 'మహా' గోస!

16 Apr, 2020 02:46 IST|Sakshi

మహారాష్ట్రలో ఇరుక్కున్న వేలాది మంది పాలమూరు కూలీలు 

పనులు లేక.. చేతిలో చిల్లిగవ్వ లేక అవస్థలు  

కరోనా విజృంభిస్తుండటంతో భయాందోళన  

ఇక్కడికి రాలేని స్థితిలో వలస జీవులు 

వస్తే కేసులు తప్పవంటున్న అధికారులు 

దొడ్డిదారిన వచ్చిన వారిని క్వారంటైన్‌కు తరలింపు 

ఈ చిత్రంలో కనిపిస్తున్నది నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమాల్‌కి చెందిన సురేశ్‌ కుటుంబం. పొట్టకూటి కోసం ఐదేళ్ల క్రితం ఈ కుటుంబం ముంబైకి వలస వెళ్లింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో సురేశ్‌ తాను దాచుకున్న డబ్బులతో ఇన్నాళ్లూ కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు. రెండ్రోజుల నుంచి చేతిలో చిల్లిగవ్వ లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి. బుధవారం తన తల్లి హన్మతికి ఫోన్‌ చేసిన సురేశ్‌.. తన దీనస్థితిని వివరించాడు. ‘మాకు ఇక్కడ పనులు లేవు. తినడానికి తిండి లేదు. ముడుమూల్‌కు వద్దామనుకున్నా రవాణా స దుపాయం లేదు. మే 3 వరకు ఎట్లనో..’అని వాపోయాడు. ఇది ఒక్క సురేశ్‌ సమస్య కాదు.. ముడుమాల్‌కి చెందిన మరో 50 కుటుంబాలదీ ఇదే పరిస్థితి.  

ఇతను మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలం నాగరం దాడితండాకు చెందిన దేవదాస్‌. ఉపాధి కోసం భార్యాపిల్లలతో కలసి మహారాష్ట్రకు వలస వెళ్లాడు. పుణే సమీపంలో రైల్వే స్టేషన్‌ వద్ద నివాసం ఉంటున్నాడు. అక్కడ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కరోనా ప్రభావం వల్ల రవాణా సదుపాయం లేక సొంతూరుకు రాలేని పరిస్థితి. ఏం చేయాలో తోచక దిక్కులు చూస్తున్నాడు. ప్రతి రోజు నాగరం దాడితండాలో ఉంటున్న తన తల్లిదండ్రులతో వీడియో కాల్‌ చేసి మాట్లాడుతున్నాడు. దేవదాస్‌ లాగే మరో 30 కుటుంబాలు ఇదే సమస్యతో సతమతమవుతున్నాయి. 

ఈ చిత్రంలో కనిపిస్తున్నది  ఆంజనేయులు అతని భార్యాపిల్లలు. వీరిది జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం మద్దూరు. ఆరేళ్ల నుంచి పుణే సమీపంలో నివాసం ఉంటున్నారు. అక్కడే కూలీ పని చేసుకుంటూ జీనవం సాగిస్తున్నాడు. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయాడు. కూడబెట్టుకున్న డబ్బు అంతా అయిపోయి ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. అక్కడి ప్రభుత్వం తమకు ఎలాంటి సహాయం చేయడం లేదని మద్దూరులో ఉంటున్న తన తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి వాపోయాడు. ఇతనితో పాటు ఇలా మరో 20 వరకు కుటుంబాలున్నాయి.  

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో మహారాష్ట్రలో మనోళ్లు ఇబ్బందులు పడుతున్నారు. పొట్టకూటి కోసం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి వలస వెళ్లిన సుమారు 4 వేల మంది కూలీలు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కరోనా పుణ్యమా అని ఉపాధి కోల్పోయి.. తినడానికి తిండి లేక అలమటిస్తున్నారు. ఇన్నాళ్లూ సంపాదించిన దాంట్లో అత్యవసరాల కోసమని దాచుకున్న డబ్బంతా ఖర్చయి పోవడంతో ఆపన్నహస్తాల కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరైనా నిత్యావసర సరుకులిస్తారా? అని వెయ్యి కళ్లతో నిరీక్షిస్తున్నారు. కనీసం తమ స్వస్థలాలకు వద్దామన్నా రాలేని దుస్థితిలో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలోని నారాయణపేట, మక్తల్, మాగనూరు, కృష్ణా, దేవరకద్ర, వనపర్తి, గట్టు, మానవపాడు, మల్దకల్, మదనాపురం, ఘనపురం, ఆత్మకూరు, అమరచింత తదితర మండలాల పరిధిలో సుమారు నాలుగు వేల కుటుంబాలు ముంబై, పుణే తదితర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఏడాదిలో రెండుసార్లు తమ స్వస్థలాలకు వచ్చి రెండు నెలలు గడిపి మళ్లీ తిరుగు పయనమవుతారు. 

ఆందోళనలో కుటుంబ సభ్యులు 
మహారాష్ట్రలో కరోనా కరాళ నృత్యం చేస్తుండటం.. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తుండటంతో అక్కడున్న తమ వారిపై కుటుంబ సభ్యులు బెంగ పెట్టుకున్నారు. రోజుకు నాలుగైదు సార్లు ఫోన్లు చేస్తూ అక్కడి పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఏ మాత్రం అవకాశం ఉన్నా.. ఎంత ఖర్చయినా సరే అక్కడ్నుంచి బయల్దేరి రావాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ధైర్యం చేసి కాలినడకన తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఇంకొందరు అక్కడక్కడ నిత్యావసర సరుకులు తెచ్చే వాహనాల్లో ఎక్కి వస్తున్నారు. మహారాష్ట్రలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల నేపథ్యంలో మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దులను పూర్తిగా మూసేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలను అధికారులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి ఎవరూ తెలంగాణలో అడుగు పెట్టకుండా అడ్డుకుంటున్నారు. అయినా కొందరు కాలినడకన, దొడ్డిదారుల గుండా రాష్ట్రంలో ప్రవేశిస్తున్నట్లు తెలుసుకున్న ప్రభుత్వం.. వారిని అడ్డుకోవాలని ఆదేశించింది. 

ఇక్కడికి వస్తే కేసులు నమోదు 
మహారాష్ట్ర నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు ఎవరూ రాకుండా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే జిల్లాలో 34 కేసులు నమోదు కావడం.. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుట పడుతుండటంతో బయటి వ్యక్తులు జిల్లాలో ప్రవేశించకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ మేరకు మహారాష్ట్రలో ఉంటున్న కూలీలకు.. స్థానికంగా ఉన్న వారి బంధువులతో ఫోన్లు చేయించే కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా అధికారులు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో, జిల్లాలో కఠినంగా అమలవుతున్న లాక్‌డౌన్‌ గురించి వివరించడంతో పాటు గడువు ముగిసేంత వరకు ఇక్కడికి రాకుండా వారిని ఆపాలని ఆదేశిస్తున్నారు. ఒకవేళ వస్తే.. కేసులు నమోదు చేస్తామని మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావ్‌ ఇప్పటికే హెచ్చరించారు.  

దొడ్డిదారిన వస్తే క్వారంటైన్‌కు.. 
► ఈ నెల 14న మహారాష్ట్ర నుంచి నారాయణపేట మండలం కొల్లంపల్లి తండాకు వస్తున్న 22 మంది కూలీలను అదే మండల పరిధిలోని ఎర్రగుట్ట చెక్‌పోస్టు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదే జిల్లా సింగారంలోని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు.  
► ముంబైకి వెళ్లిన జోగుళాంబ గద్వాల జిల్లా మల్డకల్‌ మండలం మద్దెలబండకు చెందిన సుమారు 20 మంది కూలీలు ఈ నెల 13న అర్ధరాత్రి జిల్లాలోకి ప్రవేశిస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు.. గట్టు శివారులో అడ్డుకున్నారు. మరుసటి రోజు సాయంత్రం చేతిపై ముద్ర వేసి వారి వారి ఇళ్లకు పంపి హోం క్వారంటైన్‌లో ఉంచారు.  
► వనపర్తి జిల్లా వ్యాప్తంగా సుమారు 800 నిరుపేద కుటుంబాలు మహారాష్ట్రలో కూలీలుగా పని చేస్తుంటాయి. వారిలో 300 మంది వరకు వనపర్తి, ఖిల్లాఘనపురం మండలాల పరిధిలోని తమ స్వస్థలాలకు చేరుకున్నారు. లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలవుతుండటంతో రోజుకు నాలుగైదు కుటుంబాల చొప్పున దొడ్డిదారిన జిల్లాలో ప్రవేశిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఇంటింటి సర్వే చేస్తున్న అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు వీరిని గుర్తిస్తూ హోం క్వారంటైన్‌ చేస్తున్నారు. 

ఇప్పుడే రావొద్దు 
కరోనా విముక్తి జిల్లాలో భాగంగా నేనూ నా బాధ్యత నిర్వర్తిస్తున్న. మా గ్రామానికి చెందిన 20 కుటుంబాలకు చెందిన 50 మంది మహారాష్ట్రలోని ముంబైలో కూలీ, ఇతర పనులు చేస్తున్నారు. అక్కడా పరిస్థితులు బాగో లేవు.. ఇక్కడా బాగో లేవు. అందుకే నేనే నేరుగా అక్కడున్న వారితో మాట్లాడుతున్న. పరిస్థితులు కుదుట పడే వరకు ఇక్కడికి రావొద్దని చెబుతున్నా. నిత్యావసర సరుకుల కోసం డబ్బులు లేకపోతే అక్కడున్న గ్రామస్తులు, మండలానికి చెందిన వారి నుంచి తీసుకోవాలని చెబుతున్న. మా మండలంలో గుడిగండ్ల, మంతన్‌గోడ్‌ , అరుగోండ, పంచదేవ్పాడు, చిట్యాల, గ్రామాల నుంచి మూడొందలకు పైగా కుటుంబాలు వలస వెళ్లాయి. అందరూ లాక్‌డౌన్‌ వరకు అక్కడుంటేనే మేలు.   
– లక్ష్మమ్మ, సర్పంచ్, మాద్వార్, మక్తల్‌ మండలం 

మరిన్ని వార్తలు