రాష్ట్రంలో మూడు వెనుకబడిన జిల్లాలు 

15 Dec, 2017 03:04 IST|Sakshi

దేశవ్యాప్తంగా 115 జిల్లాలను ఎంపిక చేసిన నీతి ఆయోగ్‌ 

జాబితాలో ఆసిఫాబాద్, భూపాలపల్లి, ఖమ్మం 

సాక్షి, హైదరాబాద్‌: తొలిసారిగా రాష్ట్రంలోని కొత్త జిల్లాలను కేంద్రం గుర్తిం చింది. ప్రత్యేకంగా అభివృద్ధి చేయాల్సిన జిల్లాల జాబితాలో జయశంకర్‌ భూపాలపల్లి, కుమ్రంభీమ్‌ ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాలకు చోటు దక్కింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 115 జిల్లాల్లో రాష్ట్రం నుంచి మూడు జిల్లాలను నీతి ఆయోగ్‌ ఈ జాబితాలో చేర్చింది.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో 2022 న్యూ ఇండియా లక్ష్య సాధన దిశగా జిల్లాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.

వెనుకబాటుతనం, పేదరికం, తీవ్రవాద ప్రాబల్యంతోపాటు అక్షరాస్యత, ఆరోగ్య ప్రమాణాలు, విద్య, తాగునీరు, విద్యుత్‌ వసతి వంటి కీలకమైన మౌలిక వసతులను ప్రామాణికంగా తీసుకుని జిల్లాలను ఎంపిక చేసే బాధ్యతను నీతి ఆయోగ్‌కు అప్పగించింది. వేగంగా పనులు జరిగేలా చూసేందుకు కేంద్రం ఈ జిల్లాలకు  ప్రత్యేక అధికారులను నియమించింది. ఖమ్మం జిల్లాకు రాజీవ్‌ రంజన్‌ మిశ్రా, ఆసిఫాబాద్‌ జిల్లాకు వసుధా మిశ్రా, భూపాలపల్లి జిల్లాకు సంజయ్‌కుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రం తరఫున నోడల్‌ అధికారులను నియమించాలని సూచించింది. దీంతో రాష్ట్ర ప్రభు త్వం ఖమ్మం జిల్లాకు జి.అశోక్‌కుమార్, భూపాలపల్లి జిల్లాకు నవీన్‌ మిట్టల్, ఆసిఫాబాద్‌ జిల్లాకు నదీమ్‌ అహ్మద్‌ను నోడల్‌ ఆఫీసర్లుగా నియమించింది.  

మరో మూడు జిల్లాలకు చోటివ్వండి.. 
కేంద్రం గుర్తించిన వెనుకబడిన ప్రాంతాల జాబితాలో రాష్ట్రంలోని మరో మూడు జిల్లాలకు అవకాశం కల్పించాలని రాష్ట్రం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌కు రాష్ట్ర సీఎస్‌ ఎస్పీ సింగ్‌ లేఖ రాశారు. సామాజిక ఆర్థిక పరిస్థితులు, వెనుకబడిన ప్రాంతాల గుర్తింపునకు నీతి అయోగ్‌ ఎంచుకున్న ప్రమాణాల ప్రకారం మహబూబాబాద్, జోగుళాంబ గద్వాల జిల్లాలను ఈ జాబితాలో చేర్చాల్సిన అవసరముందని ప్రస్తావించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా ఉన్నందున ఆ జిల్లాను సైతం జాబితాలో చేర్చాలని కోరారు.   

మరిన్ని వార్తలు