మంచిర్యాలలో ‘మహా’ కలకలం

11 May, 2020 08:08 IST|Sakshi

బాంద్రా నుంచి వచ్చిన ముగ్గురికి  కరోనా పాజిటివ్‌

తండ్రి కొడుకుతోపాటు సోదరుడికి సోకిన వైరస్

అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం

వీటిని వలస కేసులుగా పేర్కొంటున్న అధికారులు 

సాక్షి, మంచిర్యాల: జిల్లాలో కొత్తగా మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్‌ వచ్చిన వారిలో తండ్రి కొడుకుతోపాటు తండ్రి సోదరుడు ఉన్నారు. ఒకే కుంటుంబానికి చెందిన వీరు పొరుగున ఉన్న మహారాష్ట్రకు వెళ్లిరావడంతోనే వైరస్‌ సోకినట్లు వైద్యాధికారులు గుర్తించారు. బాధితుల్లో 80 ఏళ్ల వయస్సు ఒకరు, 70 ఏళ్లు మరొకరు, 30 ఏళ్ల యువకుడు ఉన్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు అప్రత్తమయ్యారు. కొంతకాలంగా వీరు మహారాష్ట్ర ఉంటూ రాపల్లికి రాకపోకలు సాగిస్తున్నారు. గత ఫిబ్రవరిలో బాంద్రాలో వారి ఇంటి ఆస్తి పరిష్కారం కోసం వెళ్లి అక్కడే చిక్కుకుపోయారు. దేశవ్యాప్తంగా ఈ నెల 3 నుంచి లాక్‌డౌన్‌ సడలించడంతో బాధితులు ఈ నెల 5న సొంతూరు హాజీపూర్‌ మండలం రాపల్లికి తిరిగి వచ్చారు. అదే రోజు వైద్యాధికారులు ముగ్గురిని బెల్లంపల్లిలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో గల కరోనా ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. (ప్లాంట్లను ప్రారంభించే ముందు జాగ్రత్త)

అనంతరం వారి శాంపిళ్లు సేకరించి గాంధీ ఆస్పత్రికి పంపగా ఆదివారం తెల్లవారు జామున 2 గంటలకు వచ్చిన ఫలితాల్లో ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. లాక్‌డౌన్‌కు ముందు మహారాష్ట్రకు వెళ్లగా.. వెళ్లిన పని పూర్తయినా రవాణా సౌకర్యం లేక అక్కడే చిక్కుకుపోయారు. అయితే అక్కడ ఉన్నప్పుడు 80 ఏళ్ల వృద్ధునికి ఫిట్స్‌ రావడంతో స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో పలువురి ద్వారా వైరస్‌ సోకినట్లు అనుమానిస్తున్నారు. వారుండే ప్రాంతంలోనూ కరోనా తీవ్రత అధికంగా ఉండడంతో అక్కడ ఇతరుల నుంచి వైరస్‌ సోకిందా అని అనుమానిస్తున్నారు. దీంతో బాధితుల ఇంటి పక్కన ఉన్న మరో నలుగురికి ముద్రలు వేసి అధికారులు హోంక్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. అంతేకాక ఇతరుల్ని ఎవరినైనా కలిశారా? అని ఆరా తీస్తున్నారు. అయితే ఈ మూడు కేసులు జిల్లా పరిధిలోని కేసులుగా గుర్తించలేమని వలస వెళ్లిన కేసుల జాబితాలోనే పేర్కొంటామని జిల్లా సరై్వవల్‌ అధికారి డాక్టర్‌ బాలాజీ పేర్కొన్నారు.  (కరోనా: జులైలో మరీ ఎక్కువ)

22 రోజుల తర్వాత  పాజిటివ్‌ కలకలం
జిల్లాలో గత నెల 17న చెన్నూరు మండలం ముత్తరావుపల్లికి చెందిన ఓ మహిళ మరణాంతరం కోవిడ్‌ 19 ఉన్నట్లు ఫలితాల్లో తేలింది. అయితే ఇప్పటికి ఆమెకు ఎలా సోకిందనేదానిపై స్పష్టత రాలేదు. ఆమెకు పాజిటివ్‌ రిపోర్టు రావడంపై కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్రం అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా ముత్తరావుపల్లిని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించి ఇంటింటి సర్వే చేశారు. ఆమె కుంటుంబ సభ్యులు, సన్నిహితంగా మెలిగిన 40మంది శాంపిళ్లు సేకరించి పరీక్షలు చేయగా వారందరికీ నెగిటివ్‌ వచ్చాయి. అంతేకాక అనుమానితుల క్వారంటైన్‌ గడువు కూడా ముగిసిపోయింది. దీంతో కంటైన్మెంట్‌ జోన్‌ను ఎత్తివేశారు. ముత్తరావుపల్లిలో యథావిధిగా కార్యాకలాపాలు సాగుతున్నాయి.

అనూహ్యంగా మరో మూడు పాజిటివ్‌ రావడంతో ఒక్కసారిగా అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే వీరంతా గ్రామాల్లో ఎవర్ని కాంటాక్టు కాకుండా నేరుగా ఐసోలేషన్‌ కేంద్రానికి వెళ్లడంతో కొత్తగా కంటైన్మెంట్‌ జోన్‌ అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. అయినా బాధితులు ఎవరైనా కాంటాక్టు అయితే అనుమానం ఉన్నవారందరిని హోం క్వారంటైన్‌లో ఉంచనున్నారు. ఇక జిల్లాలో ఆదివారం నాటికి ఒక వ్యక్తి శాంపిల్‌ ఫలితాలు రావాల్సి ఉంది. మరోవైపు లాక్‌డౌన్‌ సడలించడంతో పెద్ద ఎత్తున మహారాష్ట్రతోపాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి చేరుతున్నారు.

ఇన్నాళ్లు లాక్‌డౌన్‌తో రవాణా సౌకర్యం లేక అక్కడే చిక్కుకుపోయి ఉన్నారు. సడలింపులు ఇవ్వడంతో రోడ్డు మార్గాన నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలో కొత్తగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం జిల్లా ఆరెంజ్‌ జోన్‌లో కొనసాగుతుండగా కొంతకాలం కరోనా కేసులు నమోదు కాకపోతే గ్రీన్‌ జోన్‌లోకి వెళ్తుందనే ఆశతో ఉన్న తరుణంలో కొత్త కేసులు రావడంతో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, స్వీయరక్షణ చర్యలు పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.     

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు