వేర్వేరు ఘటనల్లో ముగ్గురి మృతి

24 Aug, 2018 13:13 IST|Sakshi
డోర్నకల్‌: శంకర్‌ మృతదేహం

ట్రాక్టర్‌ అదుపు తప్పి రైతు

అనుమానాస్పద స్థితిలో భక్తురాలు

విద్యుదాఘాతంతో  మహిళా రైతు దుర్మరణం

పాతదుబ్బతండా, అంజనాపురం, హన్మకొండలో విషాదఛాయలు

డోర్నకల్‌ మహబూబాబాద్‌ : వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. దీంతో మహబూబాబాద్‌ జిల్లా డో ర్నకల్‌ మండలంలోని  కస్నాతండా, గార్ల మం డలంలోని అంజనాపురం, హన్మకొండలోని న్యూ రాయపురలో విషాదఛాయలు అలుముకు నా ్నయి. ట్రాక్టర్‌ అదుపు తప్పడంతో ఓ రైతు మృతి చెందాడు. స్థానిక రైతులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. డోర్నకల్‌ మండలంలోని కస్నాతండాకు చెందిన గుగులోత్‌ శంకర్‌(28)కు రెండున్నర ఎకరాల పొలం ఉంది.

గురువారం పొలాన్ని దున్ని నాటు వేసేందుకు ఇదే తండాకు చెందిన గుగులోత్‌ శ్రీనుతో కలిసి తన సొంత ట్రాక్టర్‌ను నడుపుకుంటూ బయలుదేరాడు. శంకర్‌ ట్రాక్టర్‌ను నడుపుతుండగా శ్రీను ఇంజన్‌ వెనుక నిల్చున్నాడు. ట్రాక్టర్‌ పాతదుబ్బతండా సమీపంలో ఉన్న పొలం వైపు వెళ్తుండగా..మలుపు వద్ద అకస్మాత్తుగా ఎదురుగా ద్విచక్ర వాహనం రావడంతో ట్రాక్టర్‌ను పక్కకు తిప్పాడు. దీంతో ట్రాక్టర్‌ అదుపు తప్పి పక్కనే ఉన్ననీటి గుంతలో తలకిందులుగా పడిపోయింది.

ట్రాక్టర్‌ నడుపుతున్న శంకర్‌ ట్రాక్టర్‌ కింద బురదలో కూరుకుపోగా శ్రీను నీటిలో పడిపోయాడు. చుట్టు ప్రక్కల రైతులు వచ్చి శంకర్‌ను బయటకు తీయగా అప్పటికే చనిపోయాడు. శ్రీనుకు స్వల్ప గాయాలయ్యాయి. శంకర్‌కు భార్య, ఆరు నెలల పాప ఉన్నారు. డోర్నకల్‌ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబం 

ట్రాక్టర్‌ అదుపు తప్పిన ఘటనలో గుగులోత్‌ శంకర్‌ మృతిచెందడంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. శంకర్‌ అన్న వీరభద్రం రెండు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన భార్య ఇద్దరు పిల్లలను వదిలి వెళ్లడంతో వారి సంరక్షణ బాధ్యత కూడా శంకర్‌ చూసుకుంటున్నాడు. ప్రస్తుతం తండాలోని ప్రభుత్వ పాఠశాలలో వీరభద్రం కూతురు హర్షవర్ధిని ఐదో తరగతి, కుమారుడు కార్తీక్‌ రెండో తరగతి చదువుతున్నారు. బాబాయి మృతితో హర్షవర్ధిని, కార్తీక్‌ రోదనలు మిన్నంటాయి. 

విద్యుదాఘాతంతో మహిళా రైతు..

గార్ల: విద్యుదాఘాతంతో ఓ మహిళా రైతు మృతి చెందిన సంఘటన అంజనాపురం సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గార్ల మండలం అంజనాపురానికి చెందిన ఇస్లావత్‌ బుజ్జి అలియాస్‌ తోలి(40).. అదే గ్రామంలోని ఓ రైతుకు చెందిన 2 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయ చేస్తోంది. కౌలు పొలం నాటు వేసేందుకు గురువారం బావి వద్దకు వెళ్లింది. పొలం నాటు వేస్తుండగా, మోటారును బంద్‌ చేసేందుకు వ్యవసాయి బావి వద్దకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై అక్కడ్కిక్కడే మృతి చెందింది.

ఇరుగు పొరుగు వారు వచ్చే సరికే అప్పటికే ఆమె మృతి చెందింది. ఆమె భర్త హచ్చ 15 ఏళ్ల క్రింతం అనారోగ్యంతో మృతి చెందాడు. మృతురాలికి ఒక కూతురు, ఒక కుమారుడు సంతానం. కుమారుడు డిగ్రీ చదువుతున్నాడు. రెడ్కాడితే డొక్కాడని మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వివిధ పార్టీల నాయకులు కోరారు. మృతురాలి కుమారుడు కిరణ్‌ ఫిర్యాదు మేరకు గార్ల ఎస్సై పి.శ్రీనివాసరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అనుమానాస్పద స్థితిలో మహిళ..

ధర్మసాగర్‌ : అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన సంఘటన ధర్మసాగర్‌ మండలంలోని బంజరుపల్లిలో గురువారం వెలుగు చూసింది. స్థానికులు, ధర్మసాగర్‌ పోలీసుల కథనం ప్రకారం.. హన్మకొండ న్యూరాయపురకు చెందిన గండె విజయలక్ష్మి (63) బంజరుపల్లిలోని సాయిబాబా దేవాలయంలో దైవ దర్శనం కోసం ఒంటరిగా వచ్చింది. ఇక్కడే ఉన్న రేకుల షెడ్‌లో రెండు రోజులుగా ఉంటోంది. ఈ క్రమంలో గురువారం ఉదయం ఆలయ ఆశ్రమ సమీపంలో ఉన్న మరుగుదొడ్డిలో తలపగిలి విగత జీవిగా పడి ఉంది.

ఆలయ పూజారి గ్రామస్తులకు సమాచారం అందించడంతో విషయం వెలుగు చూసింది. సమాచారం అందుకున్న ధర్మసాగర్‌ ఎస్సై విజయ్‌రాంకుమార్‌ ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కాగా, మృతురాలు గతంలో కూడా ఇక్కడకు దైవదర్శనం కోసం వచ్చి రెండు రోజుల పాటు ఉండి వెళ్లేదని, తరచూ దేవాలయాలు సందర్శిస్తు ఉంటుందని ఆమె బంధువులు వెల్లడించారు. మృతురాలి కొడుకు సంపత్‌ ఫిర్యాదు మేరు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయలక్ష్మికి ఇద్దరు కుమారులు, కుమారై ఉన్నారు.

మరిన్ని వార్తలు