వడదెబ్బకు ముగ్గురి బలి

4 May, 2015 02:54 IST|Sakshi
వడదెబ్బకు ముగ్గురి బలి

తలకొండపల్లి / పెబ్బేరు : జిల్లాల్లో వేర్వేరు చోట్ల ముగ్గురు వ్యక్తులు వడదెబ్బకు గురై మృత్యువాతపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. తలకొండపల్లికి చెందిన బుడ్డ రామయ్య (75) ఇంటి వద్ద చెప్పులు కుడుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు భార్య నాగమ్మతో పాటు నలుగురు కుమారులున్నారు. ఎప్పటిలాగే అతను శనివారం ఉదయం నుంచి పనిచేస్తుండగా వడదెబ్బతో అదే రాత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతి చెందాడు.

మరో సంఘటనలో కొంతకాలంగా చంద్రధనకు చెందిన ముంతగల్ల కృష్ణయ్య (37) స్థానికంగా జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో కూలీగా పని చేస్తున్నాడు. ఈయనకు భార్య చిట్టెమ్మతో పాటు ఇద్దరు కుమారులున్నారు. ఎప్పటిలాగే శనివారం ఉదయం శివారులో పనికి వెళ్లిన అతను మధ్యాహ్నం వడదెబ్బకు గురై రెండుసార్లు వాంతులు చేసుకున్నాడు. ఇది గమనించిన తోటికూలీలు వెంటనే ఇంటికి పంపించారు. ఆ కొద్దిసేపటి కే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరుమన్నారు.

ఆదివారం ఉదయం బాధిత కుటుంబాన్ని జెడ్పీటీసీ సభ్యుడు నర్సింహతో పాటు ఏపీఓ శివశంకర్ పరామర్శించారు. ఈ మేరకు కృష్ణయ్య కుటుంబానికి *వెయ్యి, రాములు కుటుంబానికి *మూడు వేల ఆర్థికసాయం అందజేశారు. కాగా, శనివారం సాయంత్రం జూలపల్లిలో  పిడుగుపాటుకు కడారి వెంకటయ్యకు చెందిన ఎద్దు మృతి చెందింది. ఇంకో సంఘటనలో పెబ్బేరు మండలం గుమ్మడానికి చెందిన బోయజల్లి భాస్కర్ (40) వృత్తిరీత్యా వ్యవసాయ కూలీ. ఈయనకు భార్య లక్ష్మితోపాటు కుమారుడు, కూతురు ఉన్నారు.

ఎప్పటిలాగే రెండు రోజుల క్రితం పనికి వెళ్లి ఎండ తీవ్రత వల్ల అస్వస్థతకు గురయ్యాడు. స్థానికంగా వైద్యం చేయించుకున్నా ఎంతకూ తగ్గలేదు. దీంతో ఆదివారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు అతడిని కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఈ సంఘటనతో వారు కన్నీరు మున్నీరయ్యారు.

మరిన్ని వార్తలు