రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఇంజనీర్లు మృతి 

11 Dec, 2018 02:03 IST|Sakshi
ప్రమాదానికి గురైన కారు

కల్వర్టు గుంతలో పడ్డ కారు  

విహార యాత్ర నుంచి వస్తుండగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఘటన 

మృతుల స్వస్థలం వైజాగ్‌.. విధులు హైదరాబాద్‌లో 

మాగనూర్‌ (మక్తల్‌): మహబూబ్‌నగర్‌ జిల్లా మాగనూరు – కృష్ణా మండలాల సరిహద్దులోని నల్లగట్టు సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న కారు కల్వర్టుకోసం తవ్విన గుంతలో పడడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఏపీలోని విశాఖపట్నం జిల్లా రంప చోడవరానికి చెందిన ఆరుగురు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు హైదరాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా శుక్రవారం.. ఆ తర్వాత రెండో శనివారం, ఆదివారం ఇలా వరుస సెలవులు రావడంతో అనిల్, అవినాశ్, అమర్‌నాథ్, మణికంఠ, మహేశ్, కామేశ్‌ కారులో గురువారం రాత్రి హైదరాబాద్‌ నుంచి విహార యాత్రకు వెళ్లారు. గోకర్ణ, గోవా తదితర ప్రాంతాలను సందర్శించారు. అనంతరం వీరు సోమవారం ఉదయం విధులకు చేరుకునేలా ఆదివారం రాత్రి తిరుగు పయనమయ్యారు.  

కల్వర్టు గుంతలో పడి..  
వీరు ప్రయాణిస్తున్న కారు మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నల్లగట్టు సమీపానికి సోమవారం తెల్లవారుజామున చేరుకుంది. అయితే, వేగంగా వస్తున్న కారు అక్కడ కల్వర్టు నిర్మాణం కోసం తవ్విన గుంతలో పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న మణికంఠ (26), మహేశ్‌ (26), కామేశ్‌ (26) అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో మహేశ్, మణికంఠ అన్నదమ్ములు కావడం గమనార్హం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనలో మృతి చెందిన వారిలో ఇద్దరి మృతదేహాలు కారునుంచి బయటకు ఎగిరి పడగా, మరొకరి మృతదేహం కారులోనే ఇరుక్కుపోయింది. కృష్ణా ఎస్‌ఐ నరేశ్‌ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని జేసీబీతో కారు డోర్‌ను తొలగించి మృతదేహాన్ని బయటకు తీశారు. ఆ తర్వాత క్షతగాత్రులను చికిత్సకోసం మక్తల్‌కు, ఆపై హైదరాబాద్‌కు తరలించారు. 

మరిన్ని వార్తలు