భూగర్భంలో మెట్రో పరుగులు!

23 Sep, 2019 02:46 IST|Sakshi

శంషాబాద్‌ సమీపం నుంచి ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌ వరకు 

సుమారు 3 కి.మీ. రూట్లో భూగర్భ మెట్రో రైలు మార్గం 

రాయదుర్గం–శంషాబాద్‌ విమానాశ్రయం రూట్లో 

31 కి.మీ. రూట్లో ఎక్స్‌ప్రెస్‌ మెట్రో

సాక్షి, హైదరాబాద్‌ : ఇప్పటివరకు నగరవాసుల కోసం ఎంఎంటీఎస్, మెట్రో రైలు అందుబాటులోకి వచ్చాయి. ఇక కోల్‌కతా తరహా భూగర్భ మెట్రోను సైతం ఇక్కడ ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రాయదుర్గం–శంషాబాద్‌ రూట్లో ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ మెట్రో కారిడార్‌ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదే తరుణంలో భూగర్భ మెట్రో అంశం తెరమీదకొచ్చింది. మొత్తం 31 కి.మీ. మార్గంలో ఏర్పాటు చేయనున్న ఈ రూట్లో 3 కి.మీ. మార్గంలో(శంషాబాద్‌ టౌన్‌ సమీపం నుంచి విమానాశ్రయం టెర్మినల్‌ వరకు) భూగర్భ మెట్రో ఏర్పాటు చేయాలని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌ సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలో సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. విమానాల ల్యాండింగ్‌.. టేకాఫ్‌కు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే భూగర్భ మెట్రోను ప్రతిపాదించినట్లు సమాచారం. కాగా ఎయిర్‌పోర్ట్‌ వరకు మెట్రో మార్గం ఏర్పాటుకు సంబంధించి ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌ ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించింది. అయితే ఈ రూట్లో మెట్రో ప్రాజెక్టును చేపట్టేందుకు అవసరమైన రూ.4,500 కోట్లను ప్రభుత్వం సొంతంగా వ్యయం చేస్తుందా.. లేదా పబ్లిక్‌–ప్రైవేటు భాగస్వామ్యంతోనా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. 

ఎయిర్‌ పోర్ట్‌కు 25 నిమిషాల్లో జర్నీ.. 
రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి రోడ్డు మార్గంలో చేరుకునేందుకు సుమారు 50 నిమిషాలు పడుతుంది. కానీ మెట్రో రైళ్లలో 25 నిమిషాల్లోనే చేరుకునేందుకు వీలుగా ఎక్స్‌ప్రెస్‌ మెట్రో కారిడార్‌ను డిజైన్‌ చేశారు. ఈ మెట్రో కారిడార్‌ ఏర్పాటుతో గ్రేటర్‌ సిటీ నుంచి విమానాశ్రయానికి వెళ్లే సిటిజన్లకు అవస్థలు తప్పనున్నాయి. ప్రస్తుతం నగరంలో అందుబాటులో ఉన్న మెట్రో కారిడార్లతో విమానాశ్రయానికి కనెక్టివిటీ లేదు. దీంతో తక్షణం విమానాశ్రయానికి మెట్రో మార్గం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించడంతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధమైన విషయం విదితమే.  

ప్రతి ఐదు కిలోమీటర్లకో స్టేషన్‌..
విమానాశ్రయ మార్గంలో ప్రతీ ఐదు కిలోమీటర్లకు ఓ మెట్రో స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. స్టేషన్లకు అనుసంధానంగా రవాణా ఆధారిత ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేషన్ల ఏర్పాటుకు ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు సమీపంలోని గచ్చిబౌలి, అప్పా జంక్షన్, కిస్మత్‌పూర్, గండిగూడ చౌరస్తా, శంషాబాద్‌ విమానాశ్రయం తదితర ప్రాంతాల్లో స్థలపరిశీలన జరుపుతున్నారు. పిల్లర్ల ఏర్పాటుకు వీలుగా సాయిల్‌ టెస్ట్‌ చేస్తున్నట్లు మెట్రో వర్గాలు తెలిపాయి.  

పీపీపీ విధానంలో ముందుకొచ్చేనా... 
ప్రస్తుతం నాగోల్‌–రాయదుర్గం, ఎల్బీనగర్‌–మియాపూర్, జేబీఎస్‌–ఫలక్‌నుమా మార్గంలో మొదటిదశ మెట్రో ప్రాజెక్టును పీపీపీ విధానంలో చేపట్టారు. మూడు మార్గాల్లో 72 కి.మీ ప్రాజెక్టు పూర్తికి సుమారు రూ.14 వేల కోట్ల అంచనా వ్యయం అవుతుందని తొలుత అంచనా వేశారు. కానీ ఆస్తుల సేకరణ ఆలస్యం కావడం, అలైన్‌మెంట్‌ చిక్కులు, రైట్‌ఆఫ్‌వే సమస్యల కారణంగా మెట్రో అంచనా వ్యయం సుమారు రూ.3 వేల కోట్లు అదనంగా పెరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రెండో దశ మెట్రో ప్రాజెక్టును పీపీపీ విధానంలో చేపట్టేందుకు ఏ సంస్థ ముందుకొస్తుందా అన్నది సస్పెన్స్‌గా మారింది. కాగా రాయదుర్గం–శంషాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ మెట్రో కారిడార్‌ ఏర్పాటుకు స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ (ప్రత్యేక యంత్రాంగం)ను ప్రభుత్వం ఏర్పాటుచేసిన విషయం విదితమే.   

మరిన్ని వార్తలు