అన్నదాత ఆత్మక్షోభ

1 Nov, 2014 23:14 IST|Sakshi
అన్నదాత ఆత్మక్షోభ

సాగు బరువై.. బతుకు భారమై బలవన్మరణాలకు పాల్పడిన రైతన్నల ఆర్తనాదాలు సర్కారు చెవికెక్కడంలేదు. గడిచిన ఐదు నెలల కాలంలో వారానికొకరు రాలిపోయినా రెవెన్యూ యంత్రాంగం ఈ మరణాలను ‘రికార్డు’ చేయకపోవడం విస్మయం కలిగిస్తోంది. రైతుల ఆత్మహత్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినా యంత్రాంగం మొద్దునిద్ర వీడడంలేదు. రాజధానికి అనుకొని ఉన్న జిల్లాలో హరిత సిరులు కురవాల్సిన చోట కన్నీటి ధారలు పారడం ఆందోళన కలిగిస్తోంది.  -సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి
 
* ఒకరు కూడా చనిపోలేదట!
* 18మంది ఆత్మహత్యలు చేసుకున్నా.. ప్రభుత్వానికి నివేదిక పంపని జిల్లా యంత్రాంగం
* త్రిసభ్య కమిటీ నిర్ధారించలేదని తిరకాసుతో పెండింగ్ 

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పంటలు పండక, అప్పుల బాధ తాళలేక బలవన్మరణాలకు పాల్పడిన అన్నదాతల జాబితాను పంపాలని ప్రభుత్వం తహసీల్దార్లను ఆదేశించింది. ఒక హయత్‌నగర్ మండలం మినహా ఇతర మండలాల నుంచి అధికారులు రైతుల ఆత్మహత్యలపై సమాచారం పంపలేదు. హయత్‌నగర్‌లో కూడా ఇతర కారణాలతోనే రైతు చనిపోయినట్లు సదరు తహసీల్దారు నివేదిక ఇచ్చారు. వాస్తవానికి ఐదు నెలల్లో 18 మంది రైతులు చనిపోయినట్లు జిల్లా యంత్రాంగం వివిధ మార్గాల్లో సమాచారాన్ని రాబట్టింది. అయితే, ఆర్డీఓ, డీఎస్పీ, ఏడీలతో కూడిన త్రిసభ్య కమిటీ నిర్ధారిస్తే తప్ప రైతు ఆత్మహత్యల వివరాలను పంపలేమనే తిరకాసుతో నివేదికను పక్కనపెట్టింది. దీంతో జిల్లాలో ఒక రైతు కూడా బలవన్మరణానికి పాల్పడ్డట్లు తమ ‘రికార్డు’లో లేదని జిల్లా యంత్రాంగం తేల్చిందన్నమాట.

మరోవైపు జిల్లాలో 8 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు వ్యవసాయశాఖ కలెక్టర్‌కు జాబితా  ఇచ్చింది. అలాగే లోకాయుక్త కూడా జిల్లాలో 11 మంది అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడ్డారని సమాచారంపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. వీటిని క్రోడీ కరించిన యంత్రాంగం.. 15 మంది రైతులు చనిపోయినట్లు అంచనా వేసింది. రైతు ఆత్మహత్యలపై శనివారంలోపు వివరాలు ఇవ్వాలనే సీఎస్ ఆదేశాల మేరకు వీటిని పంపాలని భావించింది. అయితే, త్రిసభ్య కమిటీ నిర్ధారించని ఆత్మహత్యలకు పరిహారం కోరడం నిబంధనలకు విరుద్ధమని భావించిన అధికారులు నివేదికను పెండింగ్‌లో పెట్టారు.
 
అప్పుల బాధలు..
సాధారణకంటే 29శాతం లోటు వర్షపాతం నమోదు కావడంతో ఈ ఏడాది తీవ్ర వ ర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వానలు పడకపోవడంతో పత్తి, మిర్చి, మొక్క, వరి పంటలు ఎండు ముఖం పట్టాయి. మరికొన్ని చోట్ల దిగుబడులు దారుణంగా పడిపోయాయి. దీంతో పెట్టుబడుల రూపంలో సేకరించిన అప్పులను తీర్చడం భారంగా భావించిన అన్నదాతలు మనోస్థైర్యాన్ని కోల్పోయి చావే శరణ్యమని తనువు చాలించారు. మరోవైపు రుణమాఫీపై ప్రభుత్వం కాలయాపన చేయడం, రుణాల రీషెడ్యూల్ విషయంలోనూ బ్యాంకర్లు సవాలక్ష కొర్రీలు పెట్టడంతో రైతాంగం.. ప్రైవేటు వ్యాపారుల నుంచి రుణాలు తీసుకున్నారు.

ఇది కూడా కొన్ని చోట్ల రైతులు చనిపోయేందుకు కారణమైంది. కాగా, ఐదేళ్లలో చనిపోయిన రైతుల వివరాలు కూడా సేకరించాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఆ మేరకు రెవెన్యూ అధికారులు సమాచారాన్ని సేకరించారు. 2010లో 26, 2011లో 20, 2012లో 09, 2013లో 04 ఆత్మహత్యలు జరిగినట్టు నివేదించింది. బలవ న్మరణాలకు పాల్పడిన కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షన్నర, కేంద్రం రూ.50వేలను పరిహారంగా అందజేస్తోంది. త్రిసభ్య కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ఈ చెల్లింపులను చేస్తుంది. అయితే, కొత్త ప్రభుత్వం త్రిసభ్య కమిటీలపై స్పష్టమైన ఆదేశాలివ్వకపోవడంతో కూడా రైతు ఆత్మహత్యల నిర్ధారణలో జాప్యం జరిగిందనే వాదన రెవెన్యూవర్గాల నుంచి వినిపిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం కావడంతో కొత్త జీఓ విడుదల  చేయాల్సివుంటుందని, ఇప్పటివరకు అది జారీ కాకపోవడంతో ఈ ప్రక్రియలో ఆలస్యమవుతోందని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు