3 నెలలు ఇంటి అద్దెలు వాయిదా

24 Apr, 2020 01:33 IST|Sakshi

మార్చి, ఏప్రిల్, మే నెలల్లో అద్దెలు తీసుకోరాదు

ఆ తర్వాత వాయిదాల్లో వడ్డీ లేకుండా బకాయిలు వసూలు

రాష్ట్రంలోని ఇళ్ల యజమానులకు ప్రభుత్వం ఆదేశం

ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అద్దె వసూళ్లను ఈ ఏడాది మార్చి నుంచి మూడు నెలల పాటు వాయిదా వేసుకోవాలని ఇంటి యజమానులను ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు సీఎస్‌ ఆదేశించారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో అద్దె వసూళ్లను వాయిదా వేయాలని, ఆ తర్వాతి కాలంలో వాయిదాల పద్ధతిలో ఈ అద్దెలను వడ్డీ లేకుండా వసూలు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. విపత్తుల నివారణ చట్టం, అంటురోగాల నియంత్రణ చట్టాలు కల్పిస్తున్న విశేష అధికారాలను ఉపయోగిస్తూ పురపాలక శాఖ పేరుతో ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

శాశ్వత, సగం శాశ్వత, తాత్కాలిక కట్టడాలను అద్దెకు ఇచ్చిన వారికి ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. ఈ ఉత్తర్వుల అమలుకు సంబంధించిన అధికారాలను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో సహా అన్ని మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల కమిషనర్లకు జిల్లా విపత్తుల నివారణ కమిటీ చైర్మన్లు అయిన జిల్లా కలెక్టర్లు కట్టబెట్టాలని ఉత్తర్వుల్లో తెలిపారు. ఎవరైనా ఈ ఉత్తర్వులను ఉల్లంఘించి అద్దెలు వసూలు చేస్తే అంటురోగాల నివారణ చట్టంతో పాటు విపత్తుల నివారణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

కరోనాను అరికట్టే నేపథ్యంలో.. 
కరోనా వైరస్‌ నిర్మూలన కోసం మార్చి 22 నుం చి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలు చేస్తుండటంతో అన్ని రకాల పరిశ్రమలు, వ్యాపారాలు, ఉద్యోగ, ఉపాధి మార్గాలు మూసుకుపోయాయి. (ప్రభు త్వ, ప్రైవేటు) జీతాలు చెల్లించడం కూడా కష్టం గా మారింది. కొందరి వ్యక్తుల జీతాల్లో 40 శాతం వరకు ఇంటి అద్దెలే ఉంటున్నాయి. ఈ క్రమంలో అద్దె ఇళ్లలో నివాసముండే పెద్ద సం ఖ్యలోని జనాభా అద్దెలు చెల్లించలేక ఇబ్బందు లు ఎదుర్కొంటోంది. అద్దె చెల్లించలేదనే కారణంతో వారిని ఇంటి యజమానులు ఖాళీ చేయించే ప్రమాదముంది. ప్రస్తుత లాక్‌డౌన్‌ పరిస్థితిలో ఇలా నిరాశ్రయులైన కుటుంబాలు, వ్యక్తు లు బహిరంగ ప్రదేశాల్లో నివాసముంటే వారికి కరోనా వైరస్‌ సోకే ప్రమాదముంది. దీంతో వైరస్‌ వ్యాప్తి మరింత పెరగనుంది. ఈ కారణాల నేపథ్యంలో అద్దెల వసూళ్లను వాయిదా వేస్తున్నట్టు ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలియజేసింది.

>
మరిన్ని వార్తలు