ఏ అవసరమున్నా.. నేనున్నా

29 Sep, 2014 02:24 IST|Sakshi
ఏ అవసరమున్నా.. నేనున్నా

సమస్య చెప్పండి.. పరిష్కరిస్తా
మూడు నెలలకోసారి గ్రామాలకు వస్తా
లంచాలు, పైరవీలతో మోసపోవద్దు
చెరువుల పునరుద్ధరణతోనే సస్యశ్యామలం
మంత్రి హరీష్‌రావు
సిద్దిపేట రూరల్: ‘ఎవ్వరికీ ఏ అవసరం ఉన్నా నేనున్నాను.. లంచాలు, పైరవీలతో మోసపోవద్దు.. అలాంటి వాటిని అసలే నమ్మొద్దు.. ఏ సమస్య ఉన్నా చెప్పండి.. మూడు నెలలకోసారి మీ గ్రామాలకు వస్తా.. సమస్యలు పరిష్కరిస్తా’ అని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ప్రజలకు భరోసా ఇచ్చారు. ఆదివారం మండలంలోని పుల్లూర్ గ్రామంలో సబ్‌స్టేషన్, ఎస్సీ కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన, ఇమాంబాద్‌లో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. అలాగే మహిళా భవనానికి శంకుస్థాపన చేశారు. ఇమాంబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని, రుణం తీసుకున్న ప్రతి రైతుకు మాఫీచేసి తీరుతామని అన్నారు. నవంబర్ నుంచి పింఛన్ డబ్బును పెంచుతున్నట్లు చెప్పారు. గ్రామాల్లో చెరువులు బాగుంటేనే ప్రజలు బాగుంటారన్నారు. చెరువుల పునరుద్ధరణ కోసం సంవత్సరానికి రూ.5 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు తె లిపారు. తెలంగాణలో కరెంట్ కష్టాలకు చంద్రబాబునాయుడే కారణమని అన్నారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు తెలంగాణకు 53 శాతం విద్యుత్ ఇవ్వాలని ఢిల్లీలో ఒప్పందం కుదిరినప్పటికీ లెక్కచేయడంలేదన్నారు.
 
స్వచ్ఛమైన నీరు అందించడమే లక్ష్యం
తాను ఏ నీళ్లు తాగుతున్నానో ప్రజలంతా అదే నీళ్లు తాగాలన్నది తన లక్ష్యమని మంత్రి హరీష్‌రావు అన్నారు. అందులో భాగంగానే నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన నీరు తాగాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు 64 గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు. మరో 11 గ్రామాల్లో పూర్తి చేస్తే అన్ని గ్రామాల్లో పూర్తి చేసినట్టవుతుందన్నారు. అదే విధంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, పూర్తిస్థాయిలో గృహనిర్మాణాలు, ప్రతి కుటుంబానికి 30 కిలోల రేషన్ బియ్యం, అర్హులందరికీ పింఛన్లు అందిస్తామన్నారు.

కార్యక్రమంలో ఎంపీపీ ఎర్ర యాదయ్య, ఉపాధ్యక్షుడు శ్రీహరిగౌడ్, జడ్పీటీసీ గ్యార వజ్రవ్వ, గ్రామ సర్పంచ్ పుల్లూరి సరోజన ఆంజనేయులుగౌడ్, ఎంపీటీసీ మహేష్, నాయకులు కిషన్‌రెడ్డి,తిరుపతిరెడ్డి, ఉడుత మల్లేశం, రాజయ్య, కమలాకర్‌రావు, రవీందర్‌రెడ్డి, బాల్‌రంగం, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు