నల్లగొండలో.. ముగ్గురంటే ... ముగ్గురే !

14 Mar, 2019 20:16 IST|Sakshi
గుత్తా సుఖేందర్‌రెడ్డి, భీమిరెడ్డి నర్సింహారెడ్డి

రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో మూడు సార్లు గెలిచింది ముగ్గురే

ఆ ఘనత సాధించిన జి.ఎస్‌.రెడ్డి, భీమిరెడ్డి నర్సింహారెడ్డి, గుత్తా సుఖేందర్‌ రెడ్డి

జి.ఎస్‌.రెడ్డి, భీమిరెడ్డి రద్దయిన మిర్యాలగూడ నుంచి గెలిచిన చరిత్ర

వర్తమాన  రాజకీయాల్లో నల్లగొండ నుంచి ఘనత సాధించిన గుత్తా సుఖేందర్‌ రెడ్డి

ఎవరికీ దక్కని హ్యాట్రిక్‌ విజయం

సాక్షి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు పార్లమెంటు నియోజకవర్గాల నుంచి ఇన్నేళ్ల ఎన్నికల చరిత్రలో కేవలం ముగ్గురు మాత్రమే మూడేసి సార్లు ఎంపీలుగా విజయాలు సాధించారు. వర్తమాన రాజకీయాల్లో జిల్లాలో ఆ ఘనత సాధించింది గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఒక్కరే కావడం విశేషం. నల్లగొండ నియోజకవర్గానికి 1952 నుంచి ఎన్నికలు జరుగుతుండగా, 1962 నుంచి 2004 వరకు మిర్యాలగూడ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో మిర్యాలగూడ రద్దయ్యింది. మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లు నల్లగొండ పరిధిలోకి, నల్లగొండ పరిధిలోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు, పూర్వపు వరంగల్‌ జిల్లాలోని జనగామ, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం సెగ్మెంట్లతో కలిసి 2009లో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం ఏర్పాటైంది. ఈ నియోజకవర్గానికి ఇప్పటి వరకు కేవలం రెండు పర్యాయాలు మాత్రమే ఎన్నికలు జరిగాయి.

మూడు సార్ల ఘనత .. ముగ్గురిదే
నల్లగొండ నియోజకవర్గం నుంచి మొత్తంగా మూడుసార్లు గుత్తా సుఖేందర్‌రెడ్డి మాత్రమే గెలిచి రికార్డు సృష్టించారు. ఆయన టీడీపీ తరఫున 1999 ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి కనుకుల జనార్దన్‌రెడ్డిపై 79,735ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టారు. ఆ తర్వాత జరిగిన 2004 ఎన్నికల్లో గుత్తా సుఖేందర్‌ రెడ్డి నల్లగొండ అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్‌ గూటికి చేరారు. దీంతో 2009 పార్లమెంటు ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి సీపీఐ అభ్యర్థి సురవరం సుధాకర్‌ రెడ్డిపై విజయం సాధించారు. కాంగ్రెస్‌ నుంచే రెండోసారి (మొత్తంగా మూడో సారి) 2014 ఎన్నికల్లో పోటీ చేసిన గుత్తా టీడీపీ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి పై 1,93,156 ఓట్ల భారీ మెజారిటీతో గెలు పొందారు. ఈ నియోజకవర్గం నుంచి కేవలం సుఖేందర్‌రెడ్డి మాత్రమే మూడు పర్యాయాలు గెలవగా.. రావి నారాయణరె డ్డి, బొమ్మగాని ధర్మబిక్షం, సురవరం సుధాకర్‌ రెడ్డి రెండేసి సా ర్లు గెలిచారు. ఈ ముగ్గరూ సీపీఐ నేతల కావడం గమనార్హం.

రద్దయిన మిర్యాలగూడనుంచి ... ఇద్దరు 
మిర్యాలగూడెం పార్లమెంటు నియోజకవర్గం 1962లో ఏర్పడగా, ఆ ఏడాది జరిగిన ఎన్నికల నుంచి మొదలు 2004 ఎన్నికల వరకు పన్నెండు సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ పన్నెండు ఎన్నికల్లో ప్రధాన పోటీ కేవలం కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల నడుమనే సాగింది. ఇక్కడి నుంచి ఇద్దరు నాయకులు మూడేసి సార్లు గెలిచారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి జి.ఎస్‌.రెడ్డి 1967 ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి డి.వి.రావుపై తొలి విజయం నమోదు చేసుకున్నారు. తిరిగి ఆయన 1977, 1980 ఎన్నికల్లో రెండు సార్లూ .. సీపీఎం అభ్యర్థి భీమిరెడ్డి నర్సింహారెడ్డిపైనే గెలిచి మూడు పర్యాయాలు గెలిచిన రికార్డు నెలకొల్పారు. 

మరోవైపు 1971 ఎన్నికల్లో సీపీఎం నుంచి భీమిరెడ్డి నర్సింహారెడ్డి తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్‌) అభ్యర్థి కె.జితేందర్‌రెడ్డిపై ఎంపీగా తొలి విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత 1984 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి చకిలం శ్రీనివాస రావుపై, 1991 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధి బద్దం నర్సింహారెడ్డిపై విజయం సాధించారు. దీంతో భీమిరెడ్డి కూడా ఈ నియోజకవర్గం నుంచి మూడు సార్లు గెలిచిన ఎంపీగా రికార్డు సమం చేశారు. కాగా, ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన బద్దం నర్సింహారెడ్డి, ఎస్‌.జైపాల్‌రెడ్డి రెండేసి పర్యాయాలు గెలిచారు.

మరిన్ని వార్తలు