నెత్తుటి మరకలు.. ఖైరతాబాద్‌లో యువకుడిని వెంటాడి

21 May, 2018 08:57 IST|Sakshi

నగరంలో ఒకే రోజు మూడు హత్యలు 

వృద్ధురాలిని హతమార్చిన కేర్‌టేకర్‌ 

హియాయత్‌ నగర్‌లో సెక్యూరిటీ గార్డు హతం 

ఖైరతాబాద్‌లో యువకుడిని వెంటాడి చంపిన ప్రత్యర్థులు 

నగరంలో శనివారం రాత్రి ఒకే రోజు మూడు హత్యలు చోటు చేసుకున్నాయి. రసూల్‌పురా పరిధిలో ఓ ఇంట్లో కేర్‌టేకర్‌గా పని చేస్తున్న యువకుడు ఇంటి యజమానురాలిని దారుణంగా హత్యచేసి నగలతో పరారయ్యాడు. హిమాయత్‌ నగర్‌లో ఓ సెక్యురిటీ గార్డును గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఖైరతాబాద్‌ ప్రాంతంలో ఓ యువకుడిని పాత గొడవల నేపథ్యంలో పథకం ప్రకారం వెంటాడి వేటాడారు.. వివరాల్లో వెళితే.. 

పని విషయమై గొడవ జరగడంతో.. 
రసూల్‌పురా : వృద్ధురాలిని ఓ కేర్‌టేకర్‌ హత్య చేసి నగలతో ఊడాయించిన సం ఘటన తిరుమలగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. నార్త్‌జోన్‌ డీసీపీ సునీత కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఏడబూŠల్య్‌హెచ్‌ఓ వేదవిహార్‌ కాలనీలోని కమలా ఎన్‌క్లేవ్‌లో వ్యవసాయశాఖ రిటైర్డ్‌ ఉద్యోగి కాంతారావు, సులోచన దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు ఫణికృష్ణ మణికొండలో ఉంటుండగా, కుమార్తె కూకట్‌పల్లిలో నివాసం ఉంటోంది. కొద్దిరోజులుగా కాంతారావుకు పక్షవాతంతో బాధపడుతుండటంతో కుటుంబసభ్యులు అతడి ఆలనాపాలన చూసేందుకు బోడుప్పల్‌లోని సుధా కేర్‌సేంటర్‌ను సంప్రదించగా, వారు ఈ నెల 7న వరంగల్‌కు చెందిన అరుణ్‌ను నియమించారు. పదిరోజుల పాటు పనిచేసిన అరుణ్‌ ఊరికి వెళుతున్నానంటూ సెలవుపై వెళ్లి శనివారం తిరిగి వచ్చి పనిలో చేరాడు.

ఈ సందర్భంగా సులోచనకు అరుణ్‌కు పని విషయమై గొడవ జరగడంతో కోపోద్రిక్తుడైన అరుణ్‌ దిండుతో సులోచన(68)ను ఊపిరి ఆడకుండా చేసి హత్యచేశాడు. చనిపోలేదనే అనుమానంతో కత్తితో గొంతు కోశాడు.  అనంతరం ఆమె మెడలో ఉన్న 4 తులాల మంగళసూత్రం, చేతి రింగు, కమ్మలు, పదితులాల వెండి గొలుసులు, బంగారు పల్లెం తీసుకుని ఊడాయించాడు. ఆదివారం ఉదయం పనిమనిషి తలుపులు తెరచి ఉండటాన్ని గుర్తించి లోపలికి వెళ్లి చూడగా సులోచన విగతజీవిగా కనిపించింది.  మొదటి అంతస్తులో ఉన్న వారికి సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులు, కుమారుడు ఫణికృష్ణకు సమాచారం అందించారు. పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించగా అరుణ్‌ బ్యాగ్‌తో వెళుతున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బేగంపేట ఏసీపీ, సీఐ రాజేశ్వర్‌రావు, క్లూస్‌టీం సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. 

సెక్యురిటీ గార్డు దారుణ హత్య 
హిమాయత్‌నగర్‌ : సెక్యురిటీ గార్డుగా పని చేస్తున్న ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన హిమాయత్‌నగర్‌లో ఆదివారం చోటు చేసుకుంది. ఏసీపీ భిక్షంరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా, సామర్లకోటకు చెందిన మునిస్వామి(35) భార్య సత్యవేణి, ముగ్గురు పిల్లలతో కలిసి హిమాయత్‌నగర్‌ స్ట్రీట్‌నెంబర్‌–1లోని సుకన్య సదన్‌లో ఉంటూ సోమాజిగూడలోని ఓ ప్రైవేటు కంపెనీలో సెక్యురిటీగార్డుగా పనిచేస్తున్నాడు. అతని భార్య సత్యవేణి ఇళ్లల్లో పనిచేసేది. భార్య పిల్లలతో కలిసి పదిరోజుల క్రితం సామర్లకోటకు వెళ్లగా, తండ్రి రమణ, మునిస్వామి మాత్రమే ఉన్నారు. ఆదివారం ఉదయం వాటి ఇంట్లో నుంచి రక్తం వస్తున్నట్లు గుర్తించిన పక్కింటివారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మునిస్వామి తలపై బలమైన ఆయుధంతో మోది హత్య చేసినట్లు గుర్తించారు. క్లూస్‌టీం ఆధారాలు సేకరించి. కేసును త్వరలోనే చేధించి నిందితులను పట్టుకుంటామని ఏసీపీ తెలిపారు. 

అర్ధరాత్రి అరాచకం 
ఖైరతాబాద్‌ : పాత గొడవల నేపథ్యంలో ఓ యువకుడిని కొందరు వ్యక్తులు పథకం ప్రకారం దాడి చేసి హత్య చేసిన సంఘటన శనివారం రాత్రి ఖైరతాబాద్‌ ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకివ వెళితే..కర్నూలు జిల్లా, నందికొట్కూరుకు చెందిన గంగుల శివకిరణ్‌(33) అలియాస్‌ కిరణ్‌ బోరబండలో ఉంటున్నాడు. నేరాలకు అలవాటు పడిన శివకిరణ్‌పై గోపాల్‌పురం పోలీస్‌స్టేషన్‌లో పీటా కేసులు, 2014లో కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో హత్య కేసు,  పంజగుట్ట పీఎస్‌లో రెండు కేసులు ఉన్నాయి. 2016లో గోపాల్‌పురం పోలీసులు అతడిని పీడి యాక్ట్‌పై అరెస్టు చేసి జైలుకు పంపారు.  

మద్యం మత్తులో జరిగిన గొడవ నేపథ్యంలో..... 
ఈ నెల 16న  శివకిరణ్‌ మరికొందరు యువకులతో కలిసి దూల్‌పేట్‌లో మద్యం సేవిస్తుండగా కన్నా, ఖైరతాబాద్‌ మహాభారత్‌నగర్‌కు చెందిన రహమాన్‌ మధ్య గొడవ జరిగింది. ఈ సందర్భంగా రహమాన్‌ కత్తితో దాడి చేయడంతో కన్నా చేతికి గాయాలయ్యాయి. ఈ విషయంలో జోక్యం చేసుకున్న శివకిరణ్‌ గొడవలు వద్దని కేసు లేకుండా చేసేందుకు రూ.10వేలు  వైద్యం ఖర్చుల కోసం ఇవ్వాలని రహమాన్‌కు సూచించాడు. ఆ తర్వాత పలు మార్లు ఫోన్‌ చేసి డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తానని రహమాన్‌ను బెదిరించాడు.

శనివారం సాయంత్రం శివకిరణ్‌ తన రెండో భార్య సంగు లక్ష్మితో ఐమాక్స్‌లో సినిమా చూసి వస్తుండగా ఫోన్‌ చేసిన రహమాన్‌ రూ.3000 ఇస్తానని చెప్పి అతడిని మహాభారత్‌నగర్‌కు పిలిపించాడు. అప్పటికే పథకం ప్రకారం ఇందిరానగర్‌కు చెందిన భరత్‌ అలియాస్‌ చాప, మక్తాకు చెందిన అజ్జు, జావెద్, మహ్మద్‌ మోయిఉద్దీన్‌లకు అక్కడికి రప్పించాడు. బైక్‌పై అక్కడికి వచ్చిన శివకిరణ్‌ రహమాన్‌ను డబ్బులు అడగడంతో తన వద్ద రూ. వెయ్యి మాత్రమే ఉన్నట్లు చెప్పడంతో శివకిరణ్‌ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో రహమాన్‌ కత్తితో  అతడిపై దా డికి దిగాడు. తప్పించుకుని  వెళ్తున్న శివకిరణ్‌ను బీజేఆర్‌నగర్‌ రోడ్డులో మరో ముగ్గురు కిందపడేసి పట్టుకోగా, రహæమాన్, భరత్‌ కత్తులతో దాడి చేసి హత్య చేశారు.   

12గంటల్లో నిందితుల పట్టివేత? 
హత్యకేసులో నిందితులను సైఫాబాద్‌ పోలీసులు 12గంటల్లోపే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. శివకిరణ్‌ స్నేహితుడు దుర్గాప్రసాద్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శివకిరణ్‌ మొదటి భార్య శారద స్వగ్రామం నుంచి తిరిగివచ్చిన అనంతరం అతడి మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిపారు.  

మరిన్ని వార్తలు