ఉస్మానియా మెడిక‌ల్ కాలేజీలో క‌రోనా క‌ల‌క‌లం

31 May, 2020 12:05 IST|Sakshi

హైదరాబాదీ.. అలర్ట్‌

సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటి వరకు పాతబస్తీ, మలక్‌పేట్, వనస్థలిపురం, జియాగూడ, కుల్సుంపురలకే పరిమితమైన కరోనా వైరస్‌ తాజాగా కొత్త కాలనీల్లోనూ విజృంభిస్తోంది. మార్చి నుంచి ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కానీ శివారు కాలనీల్లో ఇటీవల రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆయా ప్రాంత వాసులను ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా ఉస్మానియా మెడికల్‌ కాలేజీ, పహడీషరీఫ్, హఫీజ్‌పేట్, సరూర్‌నగర్‌ చెరుకుతోట కాలనీ, లింగోజిగూడ సాయినగర్‌ కాలనీ, మీర్‌పేట్, లెనిన్‌నగర్, బడంగ్‌పేట్, నాదర్‌గుల్, మల్కాజ్‌గిరి, రామంతాపూర్‌లోని కామాక్షిపురం వీధి, మారేడ్‌పల్లి, గోల్నాక డివిజన్‌ సుందర్‌ నగర్, నార్త్‌లాలాగూడ, గుడిమల్కాపూర్, ఆజంపురా, ఎన్టీఆర్‌నగర్, లింగోజిగూడ సాయినగర్‌లలో కరోనా వైరస్‌ కేసుల పరంపర కొనసాగుతోంది.

ఇద్దరు పీజీ డాక్టర్లు సహా క్యాంటిన్‌ వర్కర్‌  
సుల్తాన్‌బజార్‌/ఉస్మానియా ఆస్పత్రి: ఉస్మానియా వైద్య కళాశాలలో ఇద్దరు పీజీ డాక్టర్లకు కరోనా వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది. స్థానిక వైద్యులు వారిని పరీక్షించి గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇతర రూమ్‌మేట్స్‌ సైతం అప్పటికప్పుడు తమ రూములు ఖాళీచేసి పరుగులు పెట్టారు. పీజీ వైద్యులు ఎవరెవరితో సమీపంగా ఉన్నారో గుర్తించే పనిలో పడ్డారు. ఇదిలా ఉంటే ఉస్మానియా ఆస్పత్రి క్యాంటిన్‌లో పనిచేస్తున్న యువకునికి(25) కూడా కరోనా వైరస్‌ సోకింది. మహబూబ్‌నగర్‌ జిల్లా, పెబ్బేరుకు చెందిన ఈ యువకుడు ఆస్పత్రి క్యాంటిన్‌లో పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్‌కు ముందే సొంతూరుకు వెళ్లి...ఇటీవలే వచ్చి మళ్లీ విధుల్లో చేరాడు. ఆయన తీవ్రమైన జ్వరం, జలుబుతో బాధపడుతుండడంతో ఉస్మానియా వైద్యులు అతనికి కరోనా పరీక్షలు చేయించారు. శనివారం అతనికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి నాగేందర్‌ తెలిపారు. క్యాంటీన్‌లో పని చేసే సిబ్బందికి దశల వారీగా కరోనా పరీక్షలు చేయిస్తామని ఆయన వెల్లడించారు. (ఒక్కరోజులో 8,000 మంది డిశ్చార్జ్‌)

చెరుకుతోట కాలనీలో ఒకరికి పాజిటివ్‌ 
హుడాకాంప్లెక్స్‌: సరూర్‌నగర్‌ పరిధిలోని చెరుకుతోట కాలనీ రోడ్‌ నెంబర్‌ తొమ్మిదికి చెందిన యువకుడు(36)కి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఆయన గత నవంబర్‌లో సౌదీ అరేబియాకు వెళ్లారు. మే 22న హైదరాబాద్‌ చేరుకున్నాడు. నగరంలోని ఓ హోటల్లో క్వారంటైన్‌ చేశారు. ఐసీఎంఆర్‌ నిబంధనల మేరకు ఏడు రోజుల తర్వాత ఇంటికి పంపారు. ఇంట్లో ప్రత్యేక గదిలో ఉన్నాడు. ఆ మరుసటి రోజే తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గు వంటి కరోనా వైరస్‌ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఆయన స్వయంగా వైద్యులకు సమాచారం ఇచ్చాడు. 108లో ఆయన్ను గాంధీకి తరలించి, వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, కరోనా వైరస్‌ సోకినట్లు తేలింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులను, ఇదే ఇంట్లో అద్దెకు ఉండే మరో ఏడుగురిని కూడా క్వారంటైన్‌ చేశారు. (కమ్యూనిటీ వ్యాప్తిపై సర్వే..)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు