ఫార్మాసిటీలో మూడు ప్లాంట్లు

29 May, 2018 01:15 IST|Sakshi

ఒకేచోట సౌర, గ్యాస్, ఘన వ్యర్థాల విద్యుత్‌ ప్లాంట్లు

మొత్తం 688 మెగావాట్ల విద్యుదుత్పత్తికి యోచన  

ఒక్క సోలార్‌ రూఫ్‌టాప్‌తోనే 435 మెగావాట్ల ఉత్పత్తి

కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు తెలిపిన టీఎస్‌ఐఐసీ

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక ఔషధ నగరి పారిశ్రామికవాడలో ఔషధాలతో పాటు భారీ ఎత్తున విద్యుదుత్పత్తి జరగనుంది. రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు, కడ్తాల్‌ మండలాల పరిధిలోని 19,333.20 ఎకరాల భారీ విస్తీర్ణంలో నిర్మించనున్న హైదరాబాద్‌ ఫార్మాసిటీలో సౌర, సహజవాయువులు, ఘన వ్యర్థాల విద్యుదుత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్‌ఐఐసీ) నిర్ణయం తీసుకుంది.

ఈ పారిశ్రామికవాడ అవసరాలకు 985 మెగావాట్ల విద్యుత్‌ కావాల్సి ఉండ గా, ఈ మూడు రకాల విద్యుత్‌ ప్లాంట్ల ద్వారా 688 మెగావాట్ల విద్యుత్‌ను అక్కడికక్కడే ఉత్పత్తి చేసి విని యోగించుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. 435 మెగావాట్ల రూఫ్‌టాప్‌ సోలార్, 250 మెగావాట్ల గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ కేంద్రం, మరో 3 మెగావాట్ల వేస్ట్‌ ఎనర్జీ(వ్యర్థాల నుంచి విద్యుదుత్పత్తి) ప్లాంట్లను ఫార్మాసిటీలో నెలకొల్పుతామని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు సమర్పించిన ప్రాజెక్టు నివేదికలో టీఎస్‌ఐఐసీ ప్రతిపాదించింది.

ఫార్మాసిటీ తుది విడత నిర్మాణం పూర్తయ్యే నాటికి ఈ విద్యుదుత్పత్తి ప్లాంట్ల ఏర్పాటును పూర్తి చేస్తామని తెలిపింది. గ్యాస్‌ ఆధారిత విద్యుదు త్పత్తి ప్లాంట్‌కు అవసరమైన సహజవాయువులను సర ఫరా చేసేందుకు గుజరాత్‌ స్టేట్‌ పెట్రోలియం కార్పొరే షన్‌ అంగీకరించింది. ఫార్మాసిటీలోని పరిశ్రమలు, నివాస సముదాయాల నుంచి ఉత్పత్తయ్యే ఘన వ్యర్థాలతో విద్యుదుత్పత్తి జరపనున్నారు.  


అతిపెద్ద రూఫ్‌ టాప్‌ !
ఫార్మాసిటీలో ఏర్పాటు కానున్న 435 మెగావాట్ల రూఫ్‌టాప్‌ సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ దేశంలోనే అతిపెద్దదిగా అవతరించనుంది. దేశంలో మరెక్కడా కనీసం 10 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రూఫ్‌టాప్‌ సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ కూడా లేదు. ఫార్మాసిటీలో వేల ఎకరాల విస్తీర్ణంలో పరిశ్రమలు, వాణిజ్య భవనాలు, విశ్వవిద్యాలయం, నివాస సముదాయాలకు సంబంధించిన భవనాలను నిర్మించనుండటంతో భారీ విస్తీర్ణంలో భవనాలపైన ఖాళీ ప్రాంతం అందుబాటులోకి రానుంది.

ఫార్మాసిటీ ప్రణాళిక ప్రకారం... 19,333 ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు కానుండగా, 9,535 ఎకరాల్లో పరిశ్రమలు, 1,507 ఎకరాల్లో రెసిడెన్షియల్‌ టౌన్‌షిప్, 322 ఎకరాల్లో ఫార్మా వర్సిటీ, 544 ఎకరాల్లో కార్యాలయాలు, 827 ఎకరాల్లో పరిశోధన కేంద్రం, 203 ఎకరాల్లో లాజిస్టిక్‌ హబ్, 104 ఎకరాల్లో ఆస్పత్రి, 141 ఎకరాల్లో హోటల్‌ను నిర్మించనున్నారు. వీటన్నింటికి సంబంధించిన భవనాలపై భాగంలో సౌర విద్యుత్‌ పలకలను ఏర్పాటు చేయడం ద్వారా 435 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు.

మరిన్ని వార్తలు