బోరుబావిలో పడిన బాలుడి మృతి

29 May, 2020 01:57 IST|Sakshi
బాలుడి మృతదేహాన్ని బయటకు తీసుకువస్తున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది

17 అడుగుల లోతు నుంచి వెలికితీత

11 గంటలు అధికారులు శ్రమించినా దక్కని ఫలితం

సాక్షి, మెదక్‌: బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు సంజయ్‌ సాయివర్థన్‌ ఉదంతం విషాదాంతమైంది. సుమారు 11 గంటల పాటు అధికారులు నిర్విరామంగా కొనసాగించిన సహాయక చర్యలు ఆ పసివాడిని బతికించలేకపోయాయి. మృత్యుంజయుడై తిరిగివస్తాడనుకున్న సంజయ్‌.. కన్నవారికి తీరని శోకాన్ని మిగిలిస్తూ, కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. బుధవారం మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం పొడిచన్‌పల్లిలో అప్పుడే వేసిన బోరుబావిలో మూడేళ్ల బాలుడు సంజయ్‌ సాయివర్దన్‌ జారి పడిన విషయం తెలిసిందే.

సాయంత్రం 5.15 గంటలకు ఈ ఘటన చోటుచేసుకోగా.. అధికారులు ఆరు గంటలకు సహాయక చర్యలు ప్రారంభించారు. బోరు గుంతకు సమాంతరంగా తవ్వకం చేపట్టారు. కొంత లోతుకు వెళ్లే సరికి బండరాళ్లు వచ్చాయి. వీటిని డ్రిల్లింగ్‌ చేసి తొలగించారు. చివరకు గురువారం తెల్లవారుజామున 4.32 గంటలకు 17 అడుగుల లోతులో ఉన్న బాలుడిని వెలికితీశారు. వెంటనే ఆక్సిజన్‌ అందిస్తూ 108 వాహనంలో మెదక్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే బాలుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కాగా, సంజయ్‌ అంత్యక్రియలు తండ్రి స్వస్థలమైన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలోని పాశమైలారంలో గురువారం సాయంత్రం అశ్రునయనాల మధ్య ముగిశాయి.

ఆక్సిజన్‌ అందకపోవడంతోనే మృత్యువాత! 
సంజయ్‌ బోరుగుంతలో పడిన సమయంలో బాలుడి తాత అతడిని రక్షించేందుకు ధోవతి, చీర జత చేసి లోపలికి పంపించారు. అయితే వదులు మట్టి కావడంతో పెల్లలు బాలుడి మీద పడి కూరుకుపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. అందుకే ఆక్సిజన్‌ పైపు బాబు వద్దకు చేరలేదని.. దీంతో శ్వాస అందక చిన్నారి మృతి చెందాడని చెబుతున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు జిల్లా స్థాయిలో సరైన సాంకేతిక పరి జ్ఞానం అందుబాటులో లేకపోవడం కూడా పిల్లల ప్రాణాలు కోల్పోవడానికి కారణమవుతోంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా