పోరాటాలతోనే ‘ప్రాణహిత’ సాధ్యం

8 May, 2015 02:50 IST|Sakshi

- సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు మల్లేశ్
- తహశీల్ ఎదుట ధర్నా
బెల్లంపల్లి :
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పోరాటాలతోనే సాధించుకుంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ స్పష్టం చేశారు. గురువారం బెల్లంపల్లి మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడి హెట్టి ప్రాంతంలో నిర్మించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏకపక్షంగా కరీంనగర్ జిల్లా కాళేశ్వరం లో ప్రాణహిత ప్రాజెక్టును నిర్మించాలనే నిర్ణయానికి వచ్చిందన్నారు. ఆ ప్రాంతంలో ప్రాజెక్టును నిర్మించడం వల్ల ఆదిలాబాద్ జిల్లాలో తీవ్రమైన సాగు, తాగునీటి కొరత ఏర్పడుతుందని అన్నారు.

భవిష్యత్‌లో నీటి కష్టాలు తీవ్రంగా ఉంటాయని పేర్కొన్నారు. ప్రతిపాదిత తుమ్మిడిహెట్టి ప్రాంతంలోనే ప్రాణహిత ప్రాజెక్టును నిర్మించడం వల్ల జిల్లా ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. ప్రజలను చైతన్యవంతం చేసి ప్రాజెక్టు కాళేశ్వరం తరలి పోకుండా అడ్డుకుంటామని తెలిపారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేణి శంకర్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాగజ్‌నగర్‌లో ఎస్పీఎం మూతపడిందని, కార్మికులు వీధిన పడి జీవనోపాధి కోల్పోయారని విమర్శించారు.

ఆరుగురు కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, పేపర్‌మిల్లును తెరిపించడంలో టీఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధి లేకుండా పోయిం దని అన్నారు. ధర్నాలో సీపీఐ అసెంబ్లీ నియోజకవర్గ కార్యదర్శి డి.సత్యనారాయణ, బెల్లంపల్లి పట్టణ సీపీఐ కార్యదర్శి సిహెచ్.నర్సయ్య, మండల కార్యదర్శి లక్ష్మీనారాయణ, నాయకులు జి.చంద్రమాణిక్యం, రత్నం రాజం, తాళ్లపల్లి మల్లయ్య, మేరుగు పోశం, ఎం.రాజేశం, మున్సిపల్ కౌన్సిలర్ టి. లక్ష్మీ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు