శ్రీవారి చరణాలకు తుమ్మల ‘పచ్చకర్పూరం’

7 Jun, 2016 00:50 IST|Sakshi
శ్రీవారి చరణాలకు తుమ్మల ‘పచ్చకర్పూరం’

సాక్షిప్రతినిధి, ఖమ్మం: తిరుమల శ్రీనివాసునికి రాష్ట్ర రోడ్లు భవనాలు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 21 వేల ప్రతులతో కూడిన ‘పచ్చకర్పూరం’ దివ్యగ్రంథాన్ని సమర్పించనున్నారు. ఈ దివ్య గ్రంథంలో దేవతల స్త్రోత్రాలు, పురాణగాథలు ఉంటాయి. ఈ గ్రంథాన్ని శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రూపొందిస్తున్నారు. వేంకటాద్రి, యాదాద్రి, భద్రాద్రి పుణ్యక్షేత్రాల ప్రత్యక్ష, పరోక్ష అక్షరమంత్ర దర్శనంగా ఆవిష్కృతమవుతున్న ఈ ‘పచ్చకర్పూరం’ గ్రంథాన్ని మంత్రి తుమ్మల నాణ్యతాప్రమాణాలతో ముద్రిస్తున్నారు.

దేశం లో ఎందరో రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు నిత్యం శ్రీవారి దర్శనానికి విచ్చేస్తున్నప్పటికీ.. తొలిసారి ఇలాంటి అపురూప అక్షర ప్రయత్నాన్ని చేసి వేంకటేశుని చరణాలకు సమర్పిస్తున్న భక్తునిగా, మంత్రిగా తుమ్మల గుర్తింపు పొందనున్నారు.  250 పేజీల ఈ గ్రంథాన్ని ఈనెల మూడో వారంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అందజేయనున్నట్లు తుమ్మల తెలిపారు. తిరుమల శ్రీవారిపై పూర్తి నమ్మకంతో ఈ దివ్య గ్రంథాన్ని సమర్పిస్తున్నట్లు వివరించారు.

మరిన్ని వార్తలు