గొల్లుమన్న గుడ్డెందొడ్డి

18 Sep, 2018 09:45 IST|Sakshi
ఘటన స్థలంలో శంకరమ్మ, గోపాల్, మాణిక్యమ్మ మృతదేహాలు

ఓ మహిళ, ఆమె కుమారుడు–కోడలు సోమవారం ఉదయమే లేచి పొలం పనులకు వెళ్లారు.. సొంత పొలంలో సాగు చేసిన సీడ్‌ పత్తిలో కలుపు తొలగించారు.. మధ్యాహ్నం అక్కడే భోజనం ముగించుకుని మళ్లీ పనుల్లో నిమగ్నమయ్యారు. సాయంత్రం ఆకాశం మేఘావృతమై వర్షసూచన ఉండడంతో ఇంటిముఖం పట్టారు.. అంతలోనే వర్షం, మెరుపులు ప్రారంభమయ్యాయి.. దీంతో పక్కన ఉన్న చెట్టు కిందకు చేరగా పిడుగు పాటుకు అక్కడికక్కడే మృతి చెందారు.  ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్‌ మండలం గుడ్డెందొడ్డిలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, పిడుగు పాటుతోనే నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం సల్కర్‌పేటలో రైతు మేకల వెంకటయ్య మృతి చెందాడు.

ధరూరు (గద్వాల): మండల పరిధిలోని గుడ్డెం దొడ్డి గ్రామం ఘెల్లుమంది.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిడుగుపాటుకు బలికావడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పొలం పనులు ముగించుకుని ఇంటికి పయనమమైన ముగ్గురు కాసేపైతే ఇంటికి చేరేవారు. అంతలోనే పిడుగు యమపాశంలా వచ్చి వారి ప్రాణాలను హరించుకుని వెళ్లిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా.. గుడ్డెందొడ్డి గ్రామానికి చెందిన కుర్వ జంగిలప్పకు నాలుగు ఎకరాల పొలం ఉంది. కొన్ని జీవాలు కూడా ఉండటంతో వాటిపై ఆధారపడి బతుకుతునానరు. రోజులాగే పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళదామని అనుకునేలోపే సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.

ఉరుములు మెరుపులు రావడంతో కుర్వ జంగిలమ్మ భార్య శంకరమ్మ (50), కుమారుడు గోపాల్‌ (34), కోడలు మాణిక్యమ్మ (30) ఓ చెట్టుకిందకు వెళ్లి  తలదాచుకున్నారు. అదే ప్రాంతంలో పెద్ద మెరుపుతో కూడిన పిడుగు పడింది. దీంతో ఆ ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. సమీపంలో ఉన్న ఇతర కూలీలు, చుట్టు పక్కల రైతులు గమనించి చెట్టువద్దకు వెళ్లేందుకు ప్రయత్నించినా దాదాపు గంట పాటు ఎడ తెరపిలేకుండా వర్షం కురిసింది. చీకటి కావడంతో ముందు వారు వెళ్లేందుకు భయపడ్డారు. అనంతరం కొందరు గ్రామ యువకులు టార్చి లైట్లతో వచ్చి పిడుగు పడిన ప్రాంతానికి వెళ్లారు. అప్పటికే వారు విగత జీవుల్లా పడి ఉన్నారు. విషయం తెలుసుకున్న జంగిలప్ప గొర్రెల మంద నుంచి సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించాడు. ఒక్కగానొక్క కొడుకు, అతని భార్య, తన ఇల్లాలు అందరిని కోల్పోవడంతో తల్లడిల్లిపోయాడు.
 
దిక్కు తోచని స్థితిలో చిన్నారులు 
పిడుగు పాటుకు గురై మృతి చెందిన గోపాల్, మాణిక్యమ్మ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో పెద్దదైన జయసుధ 9వ తరగతి, పెద్ద మల్లన్న, చిన్న మల్లన్నలు 6వ తరగతి పక్కనే ఉన్న ఉప్పేరు గ్రామంలోని ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. ఈ ముగ్గురు చిన్నారులు దిక్కులేని వారయ్యారు. తల్లిదండ్రుల మృతదేహాల వద్ద రోదిస్తున్న తీరు అందరిని కలిచి వేసింది.

నాయకుల పరామర్శ
విషయం తెలుసుకున్న గద్వాల మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిలు వేర్వేరుగా సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. గ్రామంలోకి తీసుకు వెళ్తేందుకు తగు ఏర్పాటు చేశారు. కుటుంబానికి అన్ని విధాలా ఆదుకునేందుకు తమవంతు కృషి చేస్తామని  భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులు, పిల్లలకు ధైర్యం చెప్పారు.
 

సల్కర్‌పేటలో మరో రైతు

బిజినేపల్లి రూరల్‌: రైతన్నల పాలిట పిడుగులు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. సోమవారం మండల పరిధిలోని సల్కర్‌పేట గ్రామంలో పంట పొలంలో ఉన్న రైతుపై పిడుగు పడింది. వివరాల ప్రకారం సల్కర్‌పేట గ్రామానికి చెందిన మేకల వెంకటయ్య (40) తనకున్న మూడెకరాల పొలంలో మొక్కలు, పత్తి పంటలు వేశాడు. తెల్లవారుజామునే పంటను చూసేందుకు పొలం వద్దకు వెళ్లాడు. 6.45 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది.

చొప్పగూడు వద్ద తలదాచుకునేందుకు వెళ్లగా సరిగ్గా అదే ప్రాంతంలో  పిడుగు పడింది. దీంతో వెంకటయ్య సొమ్మసిల్లి పడిపోయాడు. గమనించిన గ్రామస్తులు వెంటనే వెంకటయ్యను నాగర్‌కర్నూల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పుడే మృతిచెందినట్లు డాక్టర్లు చెప్పారు. ఆస్పత్రి ఆవరణలో భార్యాపిల్లల రోదనలు మిన్నంటాయి. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు