గాలివానతో కకావికలం

20 Apr, 2019 00:32 IST|Sakshi

వడగండ్లు.. పిడుగులతో కూడిన భారీ వర్షం 

నేలకూలిన భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు 

పలుచోట్ల తడిసిన ధాన్యం డ్రైనేజీపాలు  

సాక్షి  నెట్‌వర్క్‌: తెలంగాణ జిల్లాల్లో శుక్రవారం పలుచోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది. వడగండ్లు, పిడుగులతో కూడిన భారీ వర్షానికి జనం అతలాకుతలమయ్యారు. బలమైన ఈదురుగాలుల కారణంగా ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. ఫలితంగా అనేక గ్రామాల్లో విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మామిడి, వరి, కూరగాయల పంటలు నేలపాలయ్యాయి. చేతికొచ్చిన పంటలు దెబ్బతినడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట, బోయినపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో రాళ్లవాన బీభత్సం అధికంగా ఉంది. ఈ రెండు మండలాల పరిధిలోనే 1,500 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు అంచనా. ఈదురు గాలులకు తీగలు తెగిపడటంతో విద్యుత్‌ సరఫరా నిలిచి పోయింది. మామిడి తోటలూ దెబ్బతిన్నాయి. అలాగే.. జగిత్యాల, రాయికల్, కొడిమ్యాల, మేడిపెల్లి మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిముద్దయింది. పొలాల్లో ఉన్న వరి గింజలు రాలిపోయి తాలు మిగిలింది. మల్యాలలోని కొనుగోలు కేంద్రంలోకి వచ్చిన వరదతో ధాన్యం డ్రైనేజీలో కొట్టుకుపోయింది.  

ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్, కౌటాల మండలం సాండ్‌గాం, కుంబారి గ్రామాల్లో పలువురి ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి.రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో వడగండ్లు భారీగా పడ్డాయి. కొత్తపల్లిలో విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి.కందుకూరు మండలంలో పౌల్ట్రీఫాం రేకులు లేచిపోయాయి. భువనగిరి, యాదగిరిగుట్ట, ఆత్మకూర్‌(ఎం), మోత్కూరు, అడ్డగూడూరు, రామన్నపేట, సంస్థాన్‌ నారాయణపురం, తుర్కపల్లి, చౌటుప్పల్, మోటకొండూరు మండలాల్లో గాలివానతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఈదురు గాలులకు ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. చౌటుప్పల్‌ మండలం చిన్నకొండూర్‌ సమీపంలో పౌల్ట్రీషెడ్డు కుప్పకూలడంతో కోళ్లు మృతి చెందాయి.

నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలంలోని మందవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. లోకేశ్వరం చెరువులో రెండేళ్ల తర్వాత నీళ్లు వచ్చాయి.జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని నాగారం కొనుగోలు కేంద్రంలోని 300 క్వింటాళ్ల ధాన్యం తడిసింది. 500 ఎకరాల్లో వరిపంట నేల కొరగగా మామిడి తోటలు ధ్వంసమయ్యాయి. ములుగు జిల్లా గోవిందరావుపేటలో రెండు గంటలకు పైగా గాలిదుమారం రావడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.  

మరిన్ని వార్తలు