టికెట్ బుకింగ్ సేవక్

30 May, 2014 03:16 IST|Sakshi
టికెట్ బుకింగ్ సేవక్
  •  త్వరలో అందుబాటులోకి..రైల్వే స్టేషన్లలో
  •  టికెట్లు ఇచ్చేందుకు..కాంట్రాక్టు ప్రాతిపదికన నియామకం
  •  207 స్టేషన్లలో ఏర్పాటు దక్షిణమధ్య రైల్వే ప్రకటన
  •  సాక్షి, సిటీబ్యూరో: రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు టికెట్లు ఇచ్చేందుకు ప్రత్యేకంగా ‘స్టేషన్ టికెట్ బుకింగ్ సేవక్ ’లు అందుబాటులోకి రానున్నారు. దక్షిణమధ్య రైల్వే పరిధిలో గుర్తించిన 207 స్టేషన్లలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఇలాంటి సిబ్బందిని నియమించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

    ప్రస్తుతం స్టేషన్‌మాస్టర్లు, సహాయ స్టేషన్‌మాస్టర్లే అన్నిరకాల విధులు నిర్వహిస్తున్న దృష్ట్యా వారిపై పని ఒత్తిడిని తగ్గించేం దుకు కొత్తగా ‘స్టేషన్ టిక్కెట్ బుకింగ్ సేవ క్’లకు (ఎస్‌టీబీఎస్) శ్రీకారం చుట్టినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు తెలిపారు. చాలా స్టేషన్లలో రైళ్ల రాకపోకల సమయంలో సిగ్నలింగ్ విధులు నిర్వహించడంతో పాటు స్టేషన్ మాస్టర్లే ప్రయాణికులకు టికెట్లు ఇవ్వడం వల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.

    కొన్ని సందర్భాల్లో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో బారులు తీరి ఉంటారు. అదే సమయంలో ఏదో ఒక ట్రైన్‌కు సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో స్టేషన్‌మాస్టర్ టికెట్ బుకింగ్‌ను నిలిపివేసి ప్లాట్‌ఫామ్‌పైకి వెళ్లవలసి వస్తుంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బం దికి గురవుతారు. ఇలాంటి ప్రతికూలతలను అధిగమించేందుకు ఎస్‌టీబీఎస్‌లు దోహదం చేస్తారని రైల్వే అధికారులు భావిస్తున్నారు.
     
    దరఖాస్తుల ఆహ్వానం

    పదోతరగతి చదివిన 18 - 35 ఏళ్ల వయసున్న వాళ్లు ఎస్‌టీబీఎస్‌లు కావచ్చని సీపీఆర్వో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకొనే సమయంలో మొదట రూ.2000 చెల్లించాలి. ఎంపికైన తరువాత ఈ సొమ్మును తిరిగి ఇచ్చేస్తారు. అలాగే  ఎంపికైన ఎస్‌టీబీఎస్‌లు రూ.20 వేల బ్యాంక్ గ్యారెంటీతోపాటు, రూ.ఐదు వేల విలువైన సెక్యూరిటీ డిపాజిట్ డిమాండ్‌డ్రాఫ్ట్‌లను  రైల్వేకు అందజేయాలి.

    అలాగే అభ్యర్థి కాండక్ట్, నివాస ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. సికింద్రాబాద్ డివిజన్‌లోని 57స్టేషన్లు, హైదరాబాద్ డివిజన్‌లోని 27 స్టేషన్లు, విజయవాడ డివిజన్‌లో 58, గుంటూరు డివిజన్‌లో 13, గుంతకల్ డివిజన్‌లో 37, నాందేడ్‌లో 14 స్టేషన్లలో ఎస్‌టీబీఐలను నియమిస్తారు.
     

మరిన్ని వార్తలు