వామ్మో చిరుత

10 Dec, 2018 14:05 IST|Sakshi
చిరుతదాడిలో హతమైన లేగదూడ (ఫైల్‌) 

రైతులను పరిగెత్తించిన  చిరుతపులి

ప్రాణాలు దక్కించుకున్న గిరిజన రైతులు  

ఒకే తండాలో మూడు సంఘటనలు  

రెండు మాసాలుగా అదే ప్రాంతంలో సంచరిస్తున్న చిరుత  

భయం గుప్పిట్లో గిరిజన తండాలు

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): చిరుతపులులను దూరం నుంచి చూస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది ఏకంగా రైతుల వెంటపడి తరుముతుంటే.. ప్రాణాలు దక్కించుకోవడానికి పరుగులు తీసిన సంఘటన ఆదివారం తెల్లవారుజామున ఎల్లారెడ్డిపేట మండలం గుంటపల్లి చెరువు తండా పరిసర అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. అదే తండాలో రెండునెలల వ్యవధిలో చిరుతపులి మూడుసార్లు స్థానికులకు భయం కల్పించింది. తాజాగా శనివారం రాత్రి  తండాకు చెందిన నునావత్‌ రాములు, మాలోతు గన్యా వ్యవసాయ పొలాల వద్దకు కాపలాగా వెళ్లారు. తెల్లవారుతుండగా తండాకు వస్తున్న క్రమంలో దూరంగా పులి అరుపులు విన్న రైతులు అప్రమత్తమై  తండావైపు పరుగులు తీశారు. చిరుతకు ఎక్కువ దూరంలో రైతులు ఉండడం వల్ల, తండాకు సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. చిరుతపులి సంచారంతో ఇండ్ల నుంచి బయటకు రాలేకపోతున్నామని అటవీ ప్రాంతంలో నివాసాలు ఉండే గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

రెండు నెలల్లో మూడో ఘటన 
గుంటపల్లి చెరువు అటవీ ప్రాంతంలో సరిగ్గా 57 రోజులక్రితం చిరుతపులి రెండు లేగదూడలపై దాడిచేసి హతమార్చింది. గ్రామ శివారులోని పశువుల కొట్టంలో ఉంచిన లేగదూడలను అటవీ ప్రాంతంలోకి లాక్కువెళ్లి హతమార్చింది. ఈ సంఘటన తండాలో భయాన్ని కలిగించింది. అటవీశాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగి చిరుతకోసం నామమాత్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే మరో 15 రోజులకు అటవీ ప్రాంతంలో చిరుత సంచరించడం రైతులకు కనిపించింది. వారు దూరం నుంచే గమ నించి తండాకు పరుగులు తీశారు. ఆ ఘటన నుంచి గిరిజనులు తేరుకోక ముందే 42 రోజుల కు మరోసారి తాజాగా చిరుతపులి రైతులను వెంబడించింది. గతంలో వీర్నపల్లి మం డలం కంచర్ల, రంగంపేట, మద్దిమల్ల, వీర్నపల్లి అటవీ ప్రాంతంలో చిరుతపులులు సంచరించి సుమారు 20 లేగదూడలను హతమార్చాయి.  

చిరుతలను బంధించాలి 
చిరుతపులులను బంధించి ప్రజలకు ప్రాణరక్షణ కల్పించాలి. ఈ ప్రాంతంలో సంచరిస్తున్న చిరుతపులిని పట్టుకొని జూపార్క్‌కు తరలించాలని గిరిజనులు వేడుకుంటున్నారు. ముఖ్యంగా చిరుతపులులు సంచరించే ప్రాంతంలో హెచ్చరిక బోర్డు లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. బోర్డులు ఉంటే తెలియని వారు అప్రమత్తమయ్యే అవకాశాలుంటాయని ప్రజలు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా పులుల నుంచి గిరిజనులు, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  

మరిన్ని వార్తలు