మరణశయ్యపై మరో పులి

11 Jun, 2018 00:56 IST|Sakshi

నడుముకు చుట్టుకున్న వేటగాళ్ల ఉచ్చు

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల, చెన్నూర్‌: చెన్నూర్‌ ఫారెస్టు డివిజన్‌లో ఓ పులి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. వేటగాళ్లు అమర్చిన ఇనుప తీగల ఉచ్చు రోజురోజుకు బిగుసుకుపోతుండటంతో గాయం తీవ్రమవుతోంది. మూడు రోజుల క్రితం మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ అటవీ ప్రాంతంలో తీవ్ర గాయంతో ఆ పులి సంచరిస్తున్నట్లు సీసీ కెమెరాకు చిక్కింది.

ఏడాదిన్నర వయసు గల ఈ కే–4 పులి ప్రాణాలకు ప్రమా దం ఉందని గతంలో ‘సాక్షి’కథనాలు ప్రచురిం చిన విషయం తెలిసిందే. గతేడాది కోటపల్లి అటవీ ప్రాంతంలో జేష్ట అనే పులి వేటగాళ్ల చేతిలో హతమైనా, మరో పులి గాయంతో సంచ రిస్తోందని తెలిసినా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో పరిస్థితి ఇంతవరకు వచ్చింది.

సంరక్షణ ఏదీ?
చెన్నూర్‌ ఫారెస్టు డివిజన్‌లో సంచరిస్తున్న ఈ పులి ఆవుల్ని హతమారుస్తోంది. హతమైన ఆవు లు, పశువులకు అటవీ అధికారులు పరిహారం చెల్లిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 30 మంది కి పరిహారం చెల్లించారు. పులికి అటవీ ప్రాం తంలో ఆహారం లభిస్తే పశువులను హతమార్చే అవకాశాలు లేవని గ్రహించి జన్నారం అటవీ ప్రాంతం నుంచి 25కు పైగా జింకల్ని తీసుకొచ్చి అటవీ ప్రాంతంలో వదిలేశారని సమాచారం.

ఆహారంపై దృష్టి పెట్టిన అధికారులు.. గాయం తీవ్రమైనట్లు తెలిసినా చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చెన్నూర్‌ ఫారెస్టు డివిజన్‌ పరిధిలోని చెన్నూర్, కోటపల్లి, నీల్వాయి రేంజ్‌లలో వన్యప్రాణి సంరక్షణ కోసం 200 సీసీ కెమెరాలు, 3 బేస్‌ క్యాం పులు, 1 స్ట్రైకింగ్‌ ఫోర్స్, 1 యానిమల్‌ ట్రాకర్స్‌ బృందాలు ఏర్పాటు చేశారు. వీరితోపాటు ఫారెస్ట్‌ సిబ్బంది 50 మందికి పైగానే ఉన్నారు. వీరంతా పులి సంరక్షణకు ప్రయత్నం చేయకపోవడం నిర్లక్ష్యమేనని తెలుస్తోంది.

పాత కథే పునరావృతం అవుతుందా..
కోటపల్లి మండలం పిన్నారంలో గత డిసెంబర్‌ లో వేటగాళ్లు అమర్చిన విద్యుత్‌ వైర్లకు తగిలి పులి హతమైంది. దీనిపై ఇద్దరు ఫారెస్టు అధికారులను సస్పెండ్‌ చేసి ఉన్నతాధికారులు చేతులు దులిపేసుకున్నారు. ఈ పులి విషయంలోనూ ఇదే పునరావృతం అవుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పులి బతికుంటే సంరక్షణ కోసం పాట్లు పడాల్సి వస్తుందనే అ«ధికారులు నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

ఆరోగ్యంగానే ఉంది..
పులి ఆరోగ్యంగానే ఉంది. రోజుకు 10 కిలోమీటర్లు సంచరిస్తోంది. ఇప్పటివరకు 26 పశువుల్ని హతమార్చింది. అనారోగ్యంగా ఉంటే ఆహారం తీసుకోలేదు. ఏప్రిల్‌లో సీసీ కెమెరాలను పరిశీలించాం. పులి సంచారం కానరాలేదు. పులి జాడ, పరిస్థితి గురించి తెలుసుకోడానికి సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నాం.   – అనిత, ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్, చెన్నూర్‌

మరిన్ని వార్తలు