పులుల రక్షణకు ‘టైగర్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌’

23 Jan, 2019 02:22 IST|Sakshi

వేటకు విద్యుత్‌ కంచె వాడితే కఠిన చర్యలు 

అటవీ శాఖ కీలక నిర్ణయాలు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పులులు, వన్యప్రాణుల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేకంగా ‘స్టేట్‌ టైగర్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌’ను ఏర్పాటు చేయనుంది. కవ్వాల్, అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వుల్లో ఉన్న పులులు, వన్యప్రాణులకు రక్షణ కల్పించేందుకు 112 మంది సిబ్బందితో దీనిని ఏర్పాటు చేయనుంది. రెండు చోట్లా అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ స్థాయి అధికారులు దీనికి నేతృత్వం వహిస్తారు. ఇందులో ముగ్గురు రేంజ్‌ ఆఫీసర్లు, 81 మంది గార్డులు, 26 మంది ఫారెస్ట్‌ వాచర్లు ఉంటారు. దీని నిర్వహణకు అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం చొప్పున భరిస్తాయి.  

సమీకృత ప్రణాళిక.. 
అటవీ సంపద రక్షణ కోసం వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో సమీకృత ప్రణాళికను అటవీశాఖ సిద్ధం చేస్తోంది. సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు సంబంధిత శాఖల సమన్వయంతో అడవుల రక్షణ కోసం ఈ ప్రణాళికను అమలుచేయనుంది. అడవుల్లో చెట్ల నరికివేత నియంత్రణ, వేటను పూర్తిగా అరికట్టడం, అటవీ నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించడంతో పాటు పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి అధ్యక్షతన ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి అటవీ రక్షణ కమిటీలో ఈ మేరకు నిర్ణయించారు.  

అడవుల్లో జంతువుల వేటకు విద్యుత్‌ కంచెను వాడితే, కరెంట్‌ చౌర్యం, అక్రమ వినియోగం కింద కేసులు పెట్టాలని అటవీ శాఖ నిర్ణయించింది. అటవీ నేరాల్లో విచారణ వేగవంతం చేయడం, నిందితులకు వీలైనంత త్వరగా శిక్ష పడేలా చేసేందుకు ప్రభుత్వపరంగా అటవీ శాఖకు న్యాయ సహకారం అందనుంది. ఇందుకోసం జిల్లాకు ఒక లీగల్‌ అడ్వయిజర్‌ను నియమించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. టాస్క్‌ఫోర్స్‌ దాడులు, అటవీ భూముల ఆక్రమణల తొలగింపునకు అవసరమైన చోట అటవీశాఖ పోలీసుల సహకారం తీసుకోనుంది. అటవీ సమీప గ్రామాల్లో గ్రామ సభ ఏర్పాటు చేసి అటవీ రక్షక దళాలను ఏర్పాటు చేయాలని, కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు దీనిపై అవగాహన కల్పించేలా అటవీశాఖ చర్యలు చేపట్టనుంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా