తిప్పేశ్వర్‌ పులి.. శివ్వారంలో బలి!

26 Jan, 2019 03:02 IST|Sakshi

వీడిన పులిచర్మం మిస్టరీ

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎక్కడో తిప్పేశ్వర్‌ అభయారణ్యంలో పుట్టిన పులి.. ఆహారం కోసం ఆదిలాబాద్‌ అడవుల్లోకి ప్రవేశించిన నెల రోజులకే వేటగాళ్ల ఉచ్చుకు చిక్కి బలైంది.  ఆదిలాబాద్‌ అడవుల్లోకి మరో పులి వచ్చి చేరిందన్న సంతోషం నెల రోజుల్లోనే ఆవిరైంది. గురువారం మంచిర్యాల జిల్లా మందమర్రిలో లభించిన పులి చర్మం కవ్వాల్‌లో కనిపించిన పులిదేనని అధికారులు అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించడం లేదు. ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నట్లు చెబుతున్నా.. పులి చర్మం తాజాగా ఉండటం, కవ్వాల్‌లో కనిపించిన పులి మాయమవడం, పులి ఫొటోలు, పులి చర్మం ఒకేరకంగా ఉండటాన్ని బట్టి కవ్వాల్‌లో కనిపించిన పులిగానే నిర్ధారించారు.

నీల్వాయి ప్రాంతంలో తిరుగుతున్న కె–4 ఆడపులి సాంగత్యం కోసం గానీ, గుంపులుగా సంచరించే జింకల కోసమో ఈ పులి శివ్వారం అడవుల్లోకి వచ్చినట్లు అధికారులు అంచనాకు వచ్చినట్లు సమాచారం. అడవి పందులు, జింకల కోసం అమర్చిన విద్యుత్‌ ఉచ్చులో చిక్కుకొని 15 రోజుల క్రితమే ఈ పులి హతమైంది. శివ్వారానికి చెందిన తొమ్మిది మంది పులిని హతమార్చిన ఘటనలో నిందితులు కాగా సాయిలుని ఏ–1గా పోలీసులు కేసు నమోదు చేశారు. కొమురయ్య, సాయిలు కొడుకు శ్యామ్, మధునయ్య, లింగ య్యలను అరెస్టు చేసి పీడీపీపీ చట్టం కింద కేసులు నమోదు చేయగా, మరో నలుగురు పరారీలో ఉన్నారు. 

పోలీసుల చర్యతోనే.. 
మందమర్రిలో పులి చర్మం వెలుగుచూసిన వ్యవహారంపై రామగుండం పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పోలీసులు తక్షణమే స్పందించి ఒక్కరోజులోనే కేసు మిస్టరీని ఛేదించింది. నిందితులను విచారించగా, శివ్వారంలో పులిని హతమార్చిన ప్రాంతం వివరాలు వెల్లడించారు. ఈ మేరకు కమిషనర్‌ సత్యనారాయణ, డీసీపీ వేణుగోపాల రావు, డీఎఫ్‌ఓ రామలింగం, ఇతర అటవీ శాఖ అధికారులు శుక్రవారం రాత్రి ఘటనా స్థలాన్ని సందర్శించారు. 

మరిన్ని వార్తలు