కవ్వాల్‌లో పెద్దపులి జాడ!

16 Dec, 2018 01:27 IST|Sakshi

ఏడాది తర్వాత అభయారణ్యంలో మళ్లీ సంచారం 

అటవీశాఖ కెమెరా ట్రాప్‌లకు చిక్కిన దృశ్యాలు 

సత్ఫలిస్తున్న అటవీ సంరక్షణ చర్యలు 

శాశ్వత పులుల నివాసంగా వృద్ధి చేస్తామంటున్న అటవీశాఖ

సాక్షి, హైదరాబాద్‌: కవ్వాల్‌ అభయారణ్యంలో చాలాకాలం తర్వాత మళ్లీ పెద్దపులి ప్రత్యక్షమైంది. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ ఫారెస్ట్‌ డివిజన్‌ కడెం రేంజ్‌ పరిధిలోని కవ్వాల్‌ అభయారణ్యంలో అటవీశాఖ ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్‌లకు ఏడాది విరామం తర్వాత పెద్దపులి సంచరిస్తున్న దృశ్యాలు చిక్కాయి. కవ్వాల్‌ అభయారణ్యంలో అడపాదడపా పులి సంచారమున్నా, శాశ్వత ఆవాసం ఏర్పాటు చేసుకునేందుకు అనువైన పరిస్థితులు లేవు. మానవ సంచారం, చెట్ల నరికివేత, పశువులను మేపటంపై అటవీ శాఖ గతకాలంగా నిషేధాన్ని అమలు చేయడంతో ప్రస్తుతం కొంతవరకు పరిస్థితుల్లో మార్పులొచ్చాయి. 22 వేల హెక్టార్ల విస్తీర్ణంలో కవ్వాల్‌ అభయారణ్యం ఉండగా, ఇందులో దాదాపు 5 వేల హెక్టార్లలో పశువులు, గొర్రెలు మేపుకోవడానికి సమీప గ్రామాల ప్రజలకు అటవీశాఖ అనుమతి ఇచ్చింది.

మిగతా ప్రాంతంలో మానవ సంచారంపై పూర్తిగా నియంత్రణ విధించింది. ఈ దిశగా సమీప గ్రామాల ప్రజలను చైతన్యపరిచింది. కోర్‌ ఏరియాలో సహజ గడ్డిక్షేత్రాలు పెంచడంతోపాటు జంతువుల కోసం తాగునీటి సదుపాయం కల్పించింది. ఇది శాఖాహార జంతువుల ఆవాసం పెరగడానికి దోహదపడింది. వీటిపై ఆధారపడే మాంసాహార జంతువుల సంఖ్య కూడా కొంతకాలంగా పెరుగుతూ వస్తోంది. కోర్‌ ఏరియాలో ఉన్న గ్రామాల తరలింపు కూడా ఓ కొలిక్కి వచ్చింది. పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా రాంపూర్, మైసంపేట గ్రామాల తరలింపునకు స్థానికులు అంగీకారం తెలిపారు. ఇందుకు జాతీయ పులుల సంరక్షణ అథారిటీ ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపి రూ.8,852 కోట్లు విడుదల చేసింది.  

పెరిగిన పులుల సంచారం 
అటవీశాఖ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలివ్వడంతో కవ్వాల్‌లో పులులు, చిరుతలతోపాటు శాఖాహార జంతువుల సంచారం పెరిగిందని కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌ సి.శరవనన్‌ పేర్కొన్నారు. తాజాగా కవ్వాల్‌లో చిక్కింది ఆరోగ్యంగా ఉన్న మగపులి అని ఆయన వెల్లడించారు. కవ్వాల్‌లో చాలాకాలం తర్వాత మళ్లీ పులి జాడ వెలుగులోకి రావడంపట్ల అటవీశాఖ సంతోషం వ్యక్తం చేసింది. కవ్వాల్‌ అభయారణ్యం పులులకు శాశ్వత ఆవాసంగా మారేలా చర్యలు తీసుకుంటామని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(పీసీసీఎఫ్‌) పి.కె.ఝా ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, పెంపుడు జంతువులు, మనుషుల సంచారాన్ని పూర్తిగా నియంత్రించాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించామన్నారు.

మరిన్ని వార్తలు