గుడిపేట శివారులో పులి సంచారం

13 Jul, 2020 11:12 IST|Sakshi
గుడిపేట అటవీ ప్రాంతంలో కనిపించిన పులి అడుగులు

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): మండలంలోని గుడిపేట అటవీ శివారు ప్రాంతంలో పులి అడుగు జాడలు కనిపించాయి. ఆషాడ మాసం ఆదివారం కావడంతో పలువురు చెట్ల తీర్థాలు, వన భోజనాల బాట పట్టారు. ఈ క్రమంలో గుడిపేట అటవీ శివారు ప్రాంతం అయిన గుట్టలు, అటవీ ప్రాంతంలో పులి అడుగులు పలువురికి కనిపించాయి. దీంతో ఒక్కసారిగా ఆందోళనకు గురై పులి అడుగు జాడలను ఆసక్తిగా గమినించి వాటి ఫొటోలను తీసి అటవీ శాఖ అధికారులకు, సిబ్బందికి వెంటనే సమాచారం అందించారు. ఆదివారం కావడంతో అధికారులు అందుబాటులో లేకపోవడంతో సోమవారం పులి అడుగు జాడలు కనిపించిన ప్రాంతానికి వచ్చి ధృవీకరిస్తామని తెలియజేసినట్లు సమాచారం. ఏదేమైనా ఇటీవల సీసీసీ, శ్రీరాంపూర్‌ జీఎం కార్యాలయ సమీపం, జైపూర్‌ అటవీ ప్రాంతాల పరిసరాల్లో పులితో పాటు చిరుత పులి సంచరిస్తున్నట్లు వార్తలు సోషల్‌ మీడియాల్లో హల్‌చల్‌ చేశాయి. అటవీపిల్లి అని కొంత మంది కొట్టి పారివేయగా మరికొంత మంది చిరుత పులి అని భయాందోళనలోనే గడిపారు. తాజాగా మండలంలోని గుడిపేట శివారులోని అటవీ ప్రాంతంలో పులి అడుగులు కనిపించడంతో ఈ పులి ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందని అంతా ఆరాతీస్తున్నారు.

 

మరిన్ని వార్తలు