జనావాసంలో పులి హల్‌చల్‌

25 Oct, 2019 10:11 IST|Sakshi

సుంపుటం దారిలో ఎడ్లబండికి ఎదురుపడిన వైనం

సాక్షి, వేమనపల్లి(ఆదిలాబాద్‌) : వేమనపల్లి మండలం సుంపుటం – ఖర్జీ వెళ్లే రామలక్ష్మణుల దారి లో పులి ఎడ్లబండిపై వెళ్తున్న రైతును భయానికి గురిచేసింది. గ్రామానికి చెందిన కుబిడె శంకర్‌ ఊరి నుంచి తన కూతురు వద్దకు ఎడ్లబండిపై ఖర్జీకి రామలక్ష్మణుల దారిమీదుగా వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన పులి గాండ్రిస్తూ ఎడ్ల వద్దకు రావడం మొదలు పెట్టింది. అప్పటికే శంకర్‌ భయంతో వణికిపోతున్నాడు. ఎడ్లు పులి గాండ్రింపులకు బెదురుతున్నాయి. శంకర్‌ ముళ్లుకర్రతో ఎడ్లను దమాయిస్తూ డబొబ్బలు ప్రారంభించాడు. వెంటనే సెల్‌ఫోన్‌లో గ్రామంలో ఉన్న తన కొడుకుకు సమాచారం అందించాడు. వెంటనే గ్రామస్తులు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. జనం రాకను పసిగట్టిన పులి అక్కడి నుంచి వెళ్లిపోయింది. గ్రామస్తుల సమాచారంతో సుంపుటం బీట్‌ ఆఫీసర్‌ నజీర్, సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి పులి అటకాయించిన ప్రాంతంలో ఉన్న పాదముద్రలను తీసుకొచ్చినట్లు సమాచారం. 

చెన్నూర్‌లో ఆవు, మేకలపై పంజా
చెన్నూర్‌ ఆటవీ డివిజన్‌లో పులి అలజడి ప్రారంభమైంది. నాలుగు రోజులుగా చెన్నూర్‌ మండలం సంకారం, బుద్దారం ఆటవీ ప్రాంతంలో మేకలు, పశువులపై దాడి చేసి హతమార్చింది. ఈ ప్రాంతంలో పులి సంచరిస్తుందన్న విషయాన్ని ఫారెస్ట్‌ అధికారులు కూడా ధ్రువీకరించారు. దీంతో అటవీప్రాంతానికి వెళ్లాలంటేనే మండల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. 

ఒక్కటా.. చాలానా..?
చెన్నూర్‌ ఫారెస్ట్‌ డివిజన్‌లోని చెన్నూర్, కోటపల్లి, నీల్వాయి అటవీ ప్రాంతంలో గతంలో కే4 పులి సంచరించింది. కే4 సంచరించిన సమయంలో చెన్నూర్‌తోపాటు కోటపల్లి, నీల్వాయి మండలాల్లో పశువులపై దాడి చేసి హతమార్చింది. ఆరునెలల నుంచి పులి సంచారం కానరాలేదు. ఇటీవల సంకారంలో మేకలు, పశువుపై దాడి చేయడంతో పులి సంచారం మొదలైందని గ్రామస్తులు అంటున్నారు. అది గతంలో ఇక్కడ సంచరించిన కే4 పులా..? లేక కాగజ్‌నగర్‌ ప్రాంతం నుంచి ఇతర పులులు వచ్చాయా..? అని ఈ ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్నారు. మేకను హతమార్చిన ప్రాంతంలో పులి ఆడుగులు చిన్నవిగా ఉండడంతో తల్లి పులితోపాటు మరో పిల్లపులి సంచరిస్తోందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

గాయంతో ఉన్న పులి గర్భవతి
కాగజ్‌నగర్‌లో ఫాల్గుణ పులి నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ పులి పిల్లలకు ఫారెస్ట్‌ అధికారులు  కే1, కే2, కే3, కే4గా నామకరణం చేశారు. 2016లో పిన్నారంలో ఓ పులి వేటగాళ్లు బిగించిన ఉచ్చులో పడి మృతి చెందింది. కాగజ్‌నగర్‌ అటవీ ప్రాంతంలో మరో పులి కే4 వేటగాళ్లు బిగించిన ఉచ్చుకు తగిలింది. నడుం ప్రాంతంలో ఉచ్చుతోనే చెన్నూర్‌ ప్రాంతంలో సంచరించింది. ఆటవీ శాఖ అధికారులు పులికి బిగిసిన ఉచ్చును తీసేందుకు శతవిధాలా ప్రయత్నించి విఫలమయ్యారు. అదే పులి గర్భంతో ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇన్నిరోజులు కన్పించని పులి మళ్లీ సంచరిస్తుండడం.. చిన్న అడుగులు ఉండడంతో ఆ పులే పిల్లకు జన్మనిచ్చిదా..? లేక కొత్త పులులు వలస వచ్చాయా..? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా